Stock Market: సూచీల వరుస లాభాలకు బ్రేక్‌.. నిఫ్టీ @ 23,500

Stock Market Closing Bell: శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 270 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 23,550 మార్క్‌ కిందకు పడిపోయింది.

Updated : 21 Jun 2024 16:11 IST

Stock Market Closing Bell: ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు (Stock Market) ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. అయితే.. ఆ జోరు ఎంతోసేపు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఆరంభ లాభాలు ఆవిరై ఈ వారాంతాన్ని మార్కెట్లు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌ (BSE) 270 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ (NSE) 23,550 మార్క్‌ కిందకు పడిపోయింది.

ఈ ఉదయం 77,729 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ (Sensex) ఆరంభంలో 77,800 మార్క్‌ను దాటి ట్రేడ్‌ అయ్యింది. మధ్యాహ్నం తర్వాత దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 76,802 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 269.03 పాయింట్లు కోల్పోయి 77,209.90 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) 23,398-23,667 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 65.90 పాయింట్లు దిగజారి 23,501.10 వద్ద స్థిరపడింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 83.54 వద్ద ముగిసింది. ఐటీ, లోహ, మీడియా, టెలికాం షేర్లు 0.5-1 శాతం మేర పెరిగాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లు ఒక శాతం మేర కుంగాయి. నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారత్‌ పెట్రోలియం, టాటా మెటార్రస్‌, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని