Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stock Market: బుధవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు మిశ్రమంగా ముగించాయి. సెన్సెక్స్‌ 36 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయింది.

Updated : 19 Jun 2024 15:56 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించలేకపోయాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. నేటి ట్రేడింగ్‌ను సూచీలు మిశ్రమంగా ముగించాయి. సెన్సెక్స్‌ (Sensex) 36 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ (Nifty) 41 పాయింట్లు నష్టపోయింది.

ఈ ఉదయం 77,543 పాయింట్ల వద్ద ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 77,851 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అయితే, దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. దీంతో ఇంట్రాడేలో 76,954 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 36.45 పాయింట్ల స్వల్ప లాభంతో 77,337.59 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 23,412-23,664 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 41.90 పాయింట్లు నష్టపోయి 23,516 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు తగ్గి 83.45 వద్ద ముగిసింది.

బ్యాంకింగ్‌, ఐటీ మినహా దాదాపు అన్నిరంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. లోహ, చమురు, రియల్టీ, ఆటోమొబైల్‌ సూచీలు 1-3శాతం మేర కుంగాయి. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు రాణించగా.. టైటాన్‌ కంపెనీ, మారుతీ సుజుకీ, ఎల్‌ అండ్‌ టీ, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని