Malware: సోషల్‌ మీడియా యాప్‌లతో భద్రం.. వెలుగులోకి మరో కొత్త మాల్‌వేర్‌!

బెంగళూరుకు చెందిన సైబర్‌ పరిశోధన సంస్థ మరో కొత్త మాల్‌వేర్‌ (Malware)ను గుర్తించింది. దీని సాయంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల డివైజ్‌లలోని సమాచారాన్ని హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

Published : 31 May 2023 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్ల డేటా కోసం సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మాల్‌వేర్‌ (Malware)ను వ్యాప్తి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు నకిలీ ఆండ్రాయిడ్‌ యాప్‌ల ద్వారా గెరిల్లా మాల్‌వేర్‌, దామ్‌ వైరస్‌లతో యూజర్ల ఫోన్లు హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై జాతీయ సైబర్‌ సెక్యూరిటీ విభాగం సెర్ట్‌-ఇన్‌ (CERT-In) యూజర్లను అప్రమత్తం చేసింది. దీంతో, హ్యాకర్లు డోగేరాట్‌ (DogeRAT) పేరుతో మరో కొత్త మాల్‌వేర్‌ను సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా యూజర్ల డివైజ్‌లలోకి ప్రవేశపెడుతున్నట్లు భారతీయ సైబర్‌ పరిశోధనా నిపుణులు వెల్లడించారు. దీని సాయంతో ఆర్థిక, బ్యాకింగ్‌, బీమా, ఈ-కామర్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల డివైజ్‌లలోని సమాచారాన్ని హ్యాకర్లు లక్ష్యంగా ఎంచుకున్నారని బెంగళూరుకు చెందిన క్లౌడ్‌సెక్‌ (CloudSEK) సైబర్‌ పరిశోధన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 

యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఓపెరా మినీ, టెలిగ్రామ్‌ వంటి పాపులర్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా యూజర్ల డివైజ్‌లలోకి ఈ మాల్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నారని క్లౌడ్‌సెక్‌ వెల్లడించింది. డోగేరాట్ డివైజ్‌లలోకి ప్రవేశించిన తర్వాత యూజర్‌ అనుమతి లేకుండా రిమోట్ యాక్సెస్‌ ద్వారా ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లోని నంబర్లకు స్పామ్‌ మెసేజ్‌లు పంపడంతోపాటు నగదు చెల్లింపులు, కాల్‌ రికార్డింగ్‌లు వినడం, ఫొటో/వీడియోలు తీసేందుకు హ్యాకర్లకు సాయపడుతుందని తెలిపింది. సోషల్‌ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే డైరెక్ట్‌ మెసేజ్‌లు, వెబ్‌ లింక్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ఆఫర్ల పేరుతో కనిపించే ప్రకటనలపై క్లిక్ చేయొద్దని క్లౌడ్‌సెక్ హెచ్చరించింది. ఎప్పటికప్పుడు డివైజ్‌ల ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవడంతోపాటు, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించడం మేలని సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని