Indian Economy: కొవిడ్‌ నష్టాలను పూడ్చుకోవడానికి 12 ఏళ్లు పట్టొచ్చు: ఆర్‌బీఐ నివేదిక

కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఏర్పడిన నష్టాలను అధిగమించడానికి భారత ఆర్థిక వ్యవస్థకు దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)’ ప్రచురించిన ఓ నివేదిక పేర్కొంది....

Published : 30 Apr 2022 17:50 IST

ముంబయి: కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఏర్పడిన నష్టాలను అధిగమించడానికి భారత ఆర్థిక వ్యవస్థకు దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)’ ప్రచురించిన ఓ నివేదిక పేర్కొంది. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని విశ్లేషించిన ఈ నివేదికలో.. మహమ్మారి కాలంలో ఉత్పత్తిపరంగా వాటిల్లిన నష్టాలను సుమారు రూ.52 లక్షల కోట్లుగా అంచనా వేసింది.

వివిధ దశల్లో విజృంభించిన కరోనా స్థిరమైన పునరుద్ధరణకు అడ్డుకట్ట వేసిందని ‘కరెన్సీ, ఫైనాన్స్‌ 2021-22’ పేరిట విడుదల చేసిన నివేదికలో ‘మహమ్మారి గాయాలు’ అనే అధ్యాయంలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అలాగే వివిధ దశల ప్రభావం ఆయా త్రైమాసిక జీడీపీ పోకడలో స్పష్టంగా కనిపించిందని వివరించారు. మహమ్మారి కారణంగా 2020-21 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు భారీగా క్షీణించిందని గుర్తుచేశారు. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు.. 2021-22 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో రెండో దశ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని తెలిపారు. అలాగే 2022 జనవరిలో వచ్చిన మూడో దశ సైతం పునరుద్ధరణపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదంతో అటు ప్రపంచంతో పాటు ఇటు దేశీయ వృద్ధికి ఉన్న ఇబ్బందులు మరింత తీవ్రమతాయని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. కమొడిటీ ధరల పెరుగుదల, ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయాలు సవాళ్లుగా నిలుస్తున్నాయని పేర్కొంది. కొవిడ్‌కి ముందు 2012-13 నుంచి 2019-20 మధ్య దేశ వార్షిక వృద్ధి రేటు 6.6 శాతంగా ఉన్నట్లు తెలిపింది. 2021-22లో నమోదైన 8.9 శాతం వృద్ధిరేటుతో పాటు 2022-23లో 7.2 శాతం, ఆ తర్వాత 7.5 శాతం వృద్ధిరేటు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే కొవిడ్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి 2034-35 వరకు వేచి చూడాల్సి రావొచ్చని పేర్కొంది.

ఉత్పత్తిపరంగా చూస్తే కొవిడ్ మూలంగా 2020-21లో రూ.19.1 లక్షల కోట్లు, 2021-22లో 17.1 లక్షల కోట్లు, 2022-23లో 16.4 లక్షల కోట్ల నష్టాన్ని నివేదిక అంచనా వేసింది. ఆర్‌బీఐలోని ‘ఎకనమిక్‌ అండ్‌ పాలసీ రీసెర్చి’ విభాగంలోని అధికారులు ఈ నివేదికను రూపొందించారు. ఈ రిపోర్టులోని అంశాలు కేంద్ర బ్యాంకు అభిప్రాయాలను సూచించవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొవిడ్‌ వెలుగులోకి రావడానికి ముందే నెలకొన్న మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. తర్వాత మహమ్మారి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు అనేక సంస్కరణలు చేపట్టినట్లు తెలిపింది. ఇవన్నీ ఇప్పుడు వృద్ధిరేటును వేగవంతం చేయడానికి దోహదం చేస్తాయని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని