Indian funds in Swiss banks: స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు రూ.9771 కోట్లే

స్విస్‌బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు భారీగా తగ్గాయి. 2022తో పోలిస్తే 2023లో ఇవి 70% క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠమైన 1.04 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు (దాదాపు రూ.9,771 కోట్ల)కు పరిమితమయ్యాయని స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకు గురువారం వెల్లడించింది.

Updated : 21 Jun 2024 07:24 IST

నల్లధనం వివరాలు లేవు

దిల్లీ/జ్యూరిచ్‌: స్విస్‌బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు భారీగా తగ్గాయి. 2022తో పోలిస్తే 2023లో ఇవి 70% క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠమైన 1.04 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు (దాదాపు రూ.9,771 కోట్ల)కు పరిమితమయ్యాయని స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకు గురువారం వెల్లడించింది. వరుసగా రెండో ఏడాదీ స్విస్‌ బ్యాంకుల్లో మన పెట్టుబడులు తగ్గాయి. 2021లో చూస్తే, 14 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 3.83 బి. స్విస్‌ ఫ్రాంక్‌ (సీహెచ్‌ఎఫ్‌)లను భారతీయులు జమ చేశారు. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక పథకాల ద్వారా ఈ బ్యాంకుల్లో నిధులు జమ చేయొచ్చు. భారతీయుల డిపాజిట్‌ ఖాతాలు, ఫండ్ల మొత్తం కూడా గణనీయంగా తగ్గాయి.

ఇవన్నీ స్విట్జర్లాండ్‌ నేషనల్‌ బ్యాంక్‌(ఎస్‌ఎన్‌బీ)కు, అక్కడి బ్యాంకులు పంపిన అధికారిక గణాంకాలు మాత్రమే. భారతీయులు దాచి ఉంటారని భావిస్తున్న నల్లధనం వివరాలు ఇందులో లేవు. భారతీయులు, ప్రవాసులు లేదా ఇతరులు.. ఇతర దేశాల సంస్థల పేర్లతో చేసిన డిపాజిట్లు కూడా వెల్లడికాలేదు.

  • 2006లో రికార్డు గరిష్ఠ స్థాయి అయిన 6.5 బిలియన్‌ ఎస్‌ఎఫ్‌ల మేర భారతీయుల డిపాజిట్లు ఉండేవి. 2011, 2013, 2017, 2020, 2021 ఏడాదుల్లో మినహా, మిగతా సంవత్సరాల్లో డిపాజిట్లు తగ్గుతూ వచ్చాయి. 
  • 2023లో బ్రిటన్‌ నుంచి అత్యధికంగా 254 బిలియన్‌ ఎస్‌ఎఫ్‌లు స్విస్‌ బ్యాంకుల్లో జమ కాగా.. ఆ తర్వాత అమెరికా (71 బి.సీహెచ్‌ఎఫ్‌), ఫ్రాన్స్‌ (64 బి.సీహెచ్‌ఎఫ్‌) ఉన్నాయి. డిపాజిట్ల పరంగా వెస్ట్‌ ఇండీస్, జర్మనీ, హాంకాంగ్, సింగపూర్, లగ్జెంబర్గ్, గుర్న్‌సే అగ్రగామి-10 దేశాల జాబితాలో ఉన్నాయి. డిపాజిట్ల పరంగా 2022లో 46వ స్థానంలో ఉన్న భారత్, గతేడాది 67వ స్థానానికి చేరింది. పాకిస్థాన్‌ పెట్టుబడులు 388 మి.సీహెచ్‌ఎఫ్‌ నుంచి 286 మి.సీహెచ్‌ఎఫ్‌కు తగ్గాయి. బంగ్లాదేశ్‌ పెట్టుబడులు 55 మి.సీహెచ్‌ఎఫ్‌కు చేరాయి. భారత్‌కు మాదిరిగానే ఈ రెండు దేశాల్లో నల్లధనం రాజకీయ అంశంగా ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు