Apple: భారత్‌ అద్భుతమైన మార్కెట్‌.. యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌

Apple: యాపిల్‌కు భారత్‌ ‘‘అద్భుతమైన మార్కెట్‌’’ అని.. యాపిల్‌ ప్రధానంగా ఇక్కడి విపణిపై దృష్టి సారించిందని సీఈఓ టిమ్‌ కుక్‌ ఉద్ఘాటించారు.

Updated : 05 May 2023 16:44 IST

Apple | వాషింగ్టన్‌: భారత మార్కెట్‌పై యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పటితో పోలిస్తే, భారత్‌లో మధ్యతరగతి కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. వీరిలో కొంతమందైనా ఐఫోన్‌ (iPhone) కొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత విపణి కీలక దశకు చేరుకుందని తెలిపారు. పరోక్షంగా ఐఫోన్‌ (iPhone) సహా యాపిల్‌ ఉత్పత్తులకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని ఉద్ఘాటించారు.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై కాన్ఫరెన్స్‌ కాల్‌లో షేర్‌హోల్డర్లతో కుక్‌ గురువారం మాట్లాడారు. యాపిల్‌కు భారత్‌ ‘‘అద్భుతమైన మార్కెట్‌’’ అని.. కంపెనీ ప్రధానంగా ఇక్కడి విపణిపై దృష్టి సారించిందని ఉద్ఘాటించారు. మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో భారత్‌లో యాపిల్‌ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. వార్షికంగా చూస్తే రెండంకెల వృద్ధితో బలమైన ఫలితాలు నమోదయ్యాయని వెల్లడించారు. యాపిల్‌ బ్రాండ్‌పై ఇక్కడి ప్రజలకు ఉన్న ఆసక్తిని తాను ఇటీవలి పర్యటనలో స్పష్టంగా గమనించినట్లు తెలిపారు. భారత విపణిపై ఎంతో ఆశావహంగా ఉన్న కుక్‌ (Tim Cook).. సమావేశంలో దాదాపు 20 సార్లు భారత్‌ గురించి నొక్కి చెప్పినట్లు సమాచారం.

భారత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న యాపిల్‌ (Apple) ఇటీవలే ఇక్కడ రెండు రిటైల్‌ స్టోర్లను తెరిచిన విషయం తెలిసిందే. వీటిని స్వయంగా టిమ్‌ కుక్‌ (Tim Cook) ప్రారంభించడం.. భారత్‌కు యాపిల్‌ (Apple) ఇస్తున్న ప్రాధాన్యాన్ని వెల్లడించింది. ఈ మేరకు గత నెల భారత పర్యటనకు వచ్చిన కుక్‌.. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

కేవలం విక్రయాలపరంగానే కాకుండా యాపిల్‌ (Apple) తయారీ విషయంలోనూ భారత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరించే క్రమంలో ఇండియాపై ప్రధానంగా దృష్టి సారించింది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి యాపిల్‌ దాదాపు 5.5 బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అలాగే భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఐఫోన్ల వాటా ప్రస్తుతం ఆరు శాతంగా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని