Published : 15 Feb 2022 23:16 IST

Coal Shortage: మరోసారి తెరపైకి బొగ్గు కొరత అంశం.. అలాంటిదేమీ లేదన్న కేంద్రం

దిల్లీ: దేశంలో బొగ్గు కొరత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తికే పెద్ద మొత్తంలో బొగ్గు నిల్వలు కేటాయిస్తున్నందున తాము కొరతను ఎదుర్కొంటున్నామని అల్యూమినియం, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు, టెక్స్‌టైల్ మిల్లులు, ఎరువుల తయారీదారులు వాపోతున్నారు. ఈ మేరకు అల్యూమినియం అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతోసహా ఎనిమిది పరిశ్రమల సంఘాలు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. విద్యుత్‌ ఉత్పత్తి, పరిశ్రమల మధ్య బొగ్గు కేటాయింపులో న్యాయబద్ధమైన కేటాయింపులు ఉండేలా చూడాలని కేంద్రాన్ని కోరాయి. కొరతకు సంబంధించి గణాంకాలు ఇవ్వలేదు. అయితే.. ఇలాంటి సమస్యేదీ లేదని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌), బొగ్గు మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి.

బొగ్గు సరఫరాలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లకు ప్రాధాన్యమిచ్చేలా ఉన్న ప్రభుత్వ విధానం.. భయాందోళనలకు, అనిశ్చితికి కారణమవుతోందని విద్యుదేతర పరిశ్రమల అధికారులు తెలిపారు. ‘నాన్-పవర్ సెక్టార్‌కు బొగ్గు సరఫరా గతేడాది కంటే తక్కువగా ఉంది. గతేడాది ఆగస్టులో రోజుకు 36 రైళ్లు కేటాయించగా.. తాజాగా జనవరి చివరి నాటికి రోజుకు 12- 14 రైళ్లకు పడిపోయింద’ని కోల్ కన్జ్యూమర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనిపై బొగ్గు మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. రైళ్ల లభ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో లోటుపాట్లు ఉంటే త్వరలో పరిష్కరిస్తామని చెప్పింది. భారీ ధరల కారణంగా.. దేశంలో బొగ్గు దిగుమతులు 2021లో తొమ్మిదేళ్ల కనిష్ఠానికి పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సీఐఎల్‌పై ఆధారపడటం పెరిగింది.

మరోవైపు 2024 నాటికి దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు దిగుమతుల అవసరం రాదని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్ జైన్ మంగళవారం తెలిపారు. సీఐఎల్‌ ద్వారా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి సైతం 10 శాతం పెరుగుతుందని చెప్పారు. సీఐఎల్‌ అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్)తో సమీక్ష సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇదివరకు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ల కోసం ఏటా తొమ్మిది కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి అయ్యేది. ఈ ఏడాది 6-7 కోట్ల టన్నులు దేశీయంగానే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది’ అని చెప్పారు. సీఐఎల్‌ ఉత్పత్తి ఈ ఏడాది 63-65 కోట్ల టన్నులుగా ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 70 కోట్ల టన్నులకు పెరుగుతుందని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని