Tim Cook: టిమ్‌ కుక్‌తో 13 ఏళ్ల బాలుడు.. పోస్ట్‌ వైరల్‌

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈఓ(CEO) టిమ్ కుక్‌ను కలిసిన ఫొటోను ఓ బాలుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Published : 12 Jun 2024 18:38 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈఓ(CEO) టిమ్ కుక్‌(Tim Cook)ను కలవాలని ఎందరో కలలు కంటుంటారు. అటువంటి అవకాశం ఓ 13 ఏళ్ల కుర్రాడికి రావడంతో అతడు తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. టిమ్‌కుక్‌తో ఆ బాలుడు దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ వ్యాపార సంస్థ యాపిల్‌(Apple) సోమవారం తన వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)ను నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌కు హాజరైన పలువురు వ్యక్తులు సోషల్ మీడియాలో చిత్రాలు, వీడియోలను పంచుకున్నారు. భారతీయ సంతతికి చెందిన 13 ఏళ్ల బాలుడు శౌర్య గుప్తా కూడా ఈ వార్షిక ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఇందులోభాగంగా యాపిల్‌ సీఈఓ(CEO) టిమ్ కుక్‌ను కలిసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. టిమ్‌ కుక్‌ను కలవాలనుకున్న తన కోరిక నెరవేరడంతో మిషన్‌ కంప్లీటెడ్‌ అంటూ వ్యాఖ్యను జత చేశాడు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు టిమ్‌ కుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ చాలా మంచి చిత్రం ఆ అబ్బాయి ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేడు అని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ టిమ్‌ కుక్‌ చాలా మంచివారిలా ఉన్నారంటూ పోస్టు చేశారు.

ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో యాపిల్‌ దాని iOS 18, యాపిల్‌ ఇంటెలిజెన్స్, AI సహా వివిధ పరికరాల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను వెల్లడించారు. కంపెనీ ప్రదర్శనలో ఆపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త AI ప్లాట్‌ఫారమ్ వ్యాపారులను ఆకర్షించింది. ఒకప్పుడు కంపెనీ అగ్రగామి అయిన డిజిటల్ అసిస్టెంట్ సిరి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను కూడా ప్రదర్శించారు. 

ఈ ఏడాది నిర్వహించిన స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో తాను గెలుపొందినందుకు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందని శౌర్య గుప్తా తెలిపాడు. స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అనేది ప్రతీ సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించే ఒక ఛాలెంజ్ పరీక్ష అని దీనిలో అప్లికేషన్‌ రూపొందించాల్సి ఉంటుందని వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని