Electric Vehicles: రైల్వే స్టేషన్లలో విద్యుత్తు వాహన ఛార్జింగ్‌ పాయింట్లు!

దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Published : 12 Oct 2022 00:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో విద్యుత్తు వాహన ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని భారత రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో విద్యుత్తు వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తొలి విడతలో భాగంగా 40 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 2024 డిసెంబరు నాటికి ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, చెన్నై, కోల్‌కతా, పుణె, సూరత్‌లోని రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్‌ వసతి అందుబాటులోకి రానుంది.

రెండో దశలో భాగంగా డిసెంబరు 2025 నాటికి 10 లక్షల కంటే అధిక జనాభా ఉన్న నగరాలతో పాటు ఇతర పెద్ద పట్టణాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. మిగిలిన అన్ని ప్రధాన స్టేషన్లలో డిసెంబరు 2026 నాటికి విద్యుత్తు వాహనాల కోసం ఛార్జింగ్‌ వసతులు కల్పిస్తామని పేర్కొంది. అయితే, ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై జోనల్‌ రైల్వే విభాగాలు తొలుత అధ్యయనం చేయనున్నాయని తెలిపింది. ఆ నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. జోనల్‌ రైల్వే ఇచ్చే బడ్జెట్‌ గ్రాంట్లు లేదా డెవలపర్‌ మోడ్‌లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఒకవేళ డెవలపర్‌ మోడ్‌ల్‌లో ఏర్పాటు చేస్తే ఛార్జ్‌ పాయింట్‌ ఆపరేటర్లు తమ సొంత నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఏటా రైల్వేకు అద్దె చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని