Indian Steel Association Conference: ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి

మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్‌ సిన్హా సూచించారు.

Published : 06 Jul 2024 02:29 IST

 చైనా నుంచి దిగుమతులపై సుంకాలు పెంచాలి
ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ సదస్సులో వక్తలు

సదస్సులో మాట్లాడుతున్న నవీన్‌ జిందాల్‌. చిత్రంలో అలోక్‌ సహాయ్,
జయంత్‌ ఆచార్య, నరేంద్రనాథ్‌ సిన్హా, అమరేందు ప్రకాశ్, ఆశిష్‌ అనుపమ్, రంజన్‌ ధార్‌ 

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, మాదాపూర్‌: మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్‌ సిన్హా సూచించారు. పైవంతెనలు, ఆనకట్టలను కాంక్రీటుతో నిర్మించేందుకు 4-5 ఏళ్లు పడుతుందని, స్టీల్‌ నిర్మాణాలతే.. నాలుగైదు నెలల్లోనే పూర్తి చేయొచ్చని వివరించారు. సాగునీటి కాలువల నిర్మాణంలోనూ ఉక్కు పైపులను వినియోగిస్తే, నీటి వృథాను అరికట్టడంతో పాటు, భూసేకరణ సమస్యనూ అధిగమించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్టీల్‌ ఇన్‌ఫ్రా బిల్డ్‌’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో స్టీల్‌ ఫ్రేమ్స్‌ వినియోగం 40-50% ఉంటే, మన దేశంలో 2 శాతమే ఉందన్నారు. స్టీల్‌ పరిశ్రమకు తమ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని, దృశ్య మాధ్యమ పద్ధతిలో ప్రసంగించిన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 

వందేళ్ల మన్నిక: జిందాల్‌

ఉక్కుకు కనీసం 100 ఏళ్ల జీవితకాలం ఉంటుందని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ ఛైర్మన్, ఐఎస్‌ఏ అధ్యక్షుడు నవీన్‌ జిందాల్‌ తెలిపారు. చైనా 3 నెలల్లో పూర్తి చేస్తున్న నిర్మాణం తరహాలోనివి మన దగ్గర మూడునాలుగేళ్లు పడుతున్నట్లు చెప్పారు. ఉక్కు నిర్మాణ ప్రక్రియలో ఆటోమేషన్‌ రావాలని సూచించారు. స్టీల్‌ ఆధారిత నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలతోపాటు, నిర్మాణ నిపుణుల్లోనూ అవగాహన పెంచాలని తెలిపారు.  దేశంలో ఏటా 150 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతోందని, రానున్న ఆరేడు ఏళ్లలో ఇది 200 మిలియన్‌ టన్నులకు చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయంత్‌ ఆచార్య, టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ ఉపాధ్యక్షుడు ఆశిష్‌ అనుపమ్, సెయిల్‌ కార్యదర్శి అలోక్‌ సహాయ్, అర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ డైరెక్టర్‌ రంజన్‌ ధార్‌ తదితరులు పాల్గొన్నారు. 

రూ.6500 కోట్ల పెట్టుబడులు: సెయిల్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సెయిల్‌ ఛైర్మన్, ఎండీ అమరేందు ప్రకాశ్‌ వెల్లడించారు. విస్తరణ కోసం 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామన్నారు. తమ ఉత్పత్తి సామర్థ్యం 2031 నాటికి 35 మిలియన్‌ టన్నులకు చేరుతుందని, ఆ తర్వాత 50 మిలియన్‌ టన్నులకు చేరుతుందన్నారు. ఉక్కు వినియోగంలో దేశం 13% వృద్ధి సాధిస్తోందని, రానున్న 10 ఏళ్లలో 8% వార్షిక వృద్ధి రేటు నమోదవుతుందన్నారు. 

275 మిలియన్‌ టన్నులకు గిరాకీ: డెలాయిట్‌ 

రానున్న దశాబ్ద కాలంలో దేశంలో ఉక్కుకు గిరాకీలో 5-7.5% సగటు వార్షిక వృద్ధి ఉంటుందని డెలాయిట్‌ నివేదిక పేర్కొంది. 2034 నాటికి 221-275 మిలియన్‌ టన్నుల ఉక్కుకు గిరాకీ ఏర్పడొచ్చని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్టీల్‌లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలే 41% వినియోగించుకున్నాయని పేర్కొంది. తెలంగాణలో ఉక్కు వినియోగం ఏటా 15.75% వృద్ధి చెందుతోందని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు