Dollar Vs Rupee: రూపాయి ప‌త‌నంతో విదేశీ విద్య మ‌రింత భారం!

రూపాయి ప‌త‌నం ఎక్కువ‌వ‌డంతో..డాల‌ర్ల కొనుగోలుకు అధిక భార‌త రూపాయిలను వెచ్చించాలి.

Updated : 26 Sep 2022 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశాల్లో విద్య‌న‌భ్య‌సించడానికి చాలా మంది భార‌తీయ విద్యార్థులు ఆస‌క్తి చూపిస్తూ ఉంటారు. అక్క‌డ అత్యున్న‌త విద్యావిధానం, వేగంగా ఉద్యోగం దొర‌క‌డం, కెరీర్‌లో వృద్ధి ఇవ‌న్నీ విదేశీ విద్య‌ పట్ల భార‌తీయ విద్యార్థుల్లో ఆసక్తి క‌లిగిస్తున్నాయి. అధికారిక గ‌ణాంకాల ప్ర‌కారం 13.24 ల‌క్ష‌ల మంది భార‌తీయ విద్యార్థులు విదేశాల‌లో చ‌దువుకుంటున్నారు. వీరిలో అధిక శాతం అమెరికాలోనే విద్య‌న‌భ్య‌సిస్తున్నారు. విదేశాల్లో విద్య‌న‌భ్య‌సించాలంటే ల‌క్ష‌లు, కొన్ని కోర్సుల‌కు కోట్ల‌లో కూడా ఖ‌ర్చు ఉంటుంది. అక్కడి ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌కు డాల‌ర్ల‌లో చెల్లించాలి. ఇటీవల డాల‌రుతో రూపాయి మార‌కం విలువ వేగంగా ప‌డిపోయింది. ఇదే కొన‌సాగితే భ‌విష్య‌త్‌లో విదేశీ విద్య.. విద్యార్థుల‌కు మ‌రింత భారంగా మారే అవ‌కాశం ఉంది.  

2017 ఆగ‌స్టులో 64.08 రూపాయిల‌కు ఒక అమెరికా డాల‌రు ల‌భించేది. ఈ సెప్టెంబ‌రు 22 నాటికి 81.11 రూపాయిలు చెల్లిస్తేనే ఒక డాల‌రు ల‌భిస్తుంది. ఈ రూపాయి ప‌త‌నానికి ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అధిక ముడి చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌మైన విదేశీ డాల‌రు, విదేశీ మూల‌ధ‌న ప్ర‌వాహాలు, ఇంకా అనేక అంత‌ర్జాతీయ ప‌రిణామాలు కార‌ణ‌మ్యాయి. అమెరికాలో యూనివ‌ర్సిటీ ట్యూష‌న్ ఫీజు, జీవించడానికి అయ్యే ఖ‌ర్చులు ఎక్కువ భాగాన్ని ఆక్ర‌మిస్తాయి. అయితే, చ‌దువు పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం ఉద్యోగం చేస్తున్న విద్యార్థుల‌కు ఈ డాల‌రు విలువ పెర‌గ‌డం లాభిస్తుంది. విద్యా రుణాన్ని ఒత్తిడి లేకుండా చెల్లించడానికి వీలు పడుతుందది.

విదేశీ విద్య‌కు ఫీజులు ఎలా పెరిగాయి?

అమెరికా యూనివ‌ర్సిటీల్లో 2010-11లో 4 ఏళ్ల డిగ్రీ కోర్సు స‌గ‌టు ఫీజు 32,000 డాల‌ర్లు (అప్ప‌టి భార‌త క‌రెన్సీలో రూ. 14.40 ల‌క్ష‌లు). ఇదే డిగ్రీ కోర్సుకు 2022-23లో 43,000 డాల‌ర్లు (ఇప్ప‌టి భార‌త క‌రెన్సీలో రూ. 34.83 ల‌క్ష‌లు) అవ‌స‌రం పడుతోంది. భార‌తీయ రూపాయి విలువ క్షీణించ‌డంతో పాటు అమెరికాలో మొత్తం విద్యా వ్య‌యంలో సాధార‌ణ వార్షిక పెరుగుద‌ల దాదాపు 10% ఉంది. ఈ ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డం మూలంగా గ‌తేడాది విద్యార్థులు చెల్లించే ప్ర‌తి రూ. 1 ల‌క్ష ఫీజుకు... ఈ సంవ‌త్స‌రం రూ. 6,575 అద‌నంగా చెల్లించాలి. అంతేకాకుండా భార‌త్‌లో క‌న్నా అమెరికాలో ఏర్ప‌డిన రికార్డు స్థాయి ద్ర‌వ్యోల్బ‌ణం (8.60%) వల్ల ప‌రిస్థితి మ‌రింత దిగజారింది. దీని మూలంగా అక్క‌డ జీవ‌న వ్య‌యానికి విద్యార్థులు అద‌నంగా డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంది.

విదేశీ విద్య‌కు ఇది మంచి స‌మ‌య‌మేనా?

ఏదైనా ఆల‌స్యం చేయ‌వ‌చ్చేమో గానీ విద్య‌ను విరామం లేకుండా పూర్తి చేయాలని నిపుణులు చెబుతుంటారు. విద్యార్థులు విదేశాల‌లో స్కాల‌ర్‌షిప్‌లు, అసిస్టెంట్‌షిప్‌లు, పార్ట్‌టైమ్/క్యాంప‌స్ ఉద్యోగాలు మొద‌లైన వాటితో ల‌భించే ఆదాయంతో కొన్ని ఖ‌ర్చులను భ‌రించ‌వ‌చ్చ‌ని కూడా వారు చెబుతున్నారు. ఈ ప్ర‌త్యామ్నాయ ఫండింగ్ అవ‌కాశాల‌తో విద్యార్థికి కార్పొరేట్ ప్ర‌పంచం అర్థం అవుతుంద‌ని, చ‌దువు పూర్తయ్యాక ఉపాధిని పొందేందుకు మెరుగ్గా సిద్ధం అవుతార‌ని చెబుతున్నారు. రుణం తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే విద్యార్థులు భ‌విష్య‌త్తులో పెరిగే అధిక వ‌డ్డీ రేట్ల‌ను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి. 

రూపాయి ప‌త‌నాన్ని విద్యార్థులు ప‌ట్టించుకుంటారా?

రూపాయి ఎంత ప‌త‌న‌మైనా విద్యార్థులు విదేశాల‌కు వెళ్ల‌డం మాత్రం మానేయ‌ర‌ని క‌న్స‌ల్టెంట్ సంస్థ‌ల అభిప్రాయం. విదేశీ విద్య అనేది అప్ప‌టిక‌ప్పుడు తీసుకునే నిర్ణ‌యం కాద‌ని, ఎన్నో ఏళ్లుగా దాని గురించి ఆలోచించే ఉంటార‌ని చెబుతున్నాయి. అందువ‌ల్ల అంత సుల‌భంగా విద్యార్థులు వెన‌క‌డుగు వేయ‌క‌పోవ‌చ్చు అని ఈ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. విద్యార్థులు విదేశీ విద్య‌కు ప్ర‌తి డాల‌రు వ్య‌యానికి ఎక్కువ రూపాయిల‌ను చెల్లించాలి అని ఆందోళ‌న చెంద‌డం స‌హ‌జ‌మే. అయిన‌ప్ప‌టికీ, విద్యార్థుల కోర్సు పూర్త‌యిన త‌ర్వాత విదేశాల‌లో ఉద్యోగం ల‌భిస్తే సంపాద‌న డాల‌ర్ల‌లోనే ఉంటుంది. ఈ డాల‌ర్ల సంపాద‌న‌ను తిరిగి భార‌త్‌కు పంపించేట‌ప్పుడు అధిక రూపాయలు లభిస్తాయన్నది మరిచిపోకూడదు. కాబ‌ట్టి, పెట్టిన అధిక ఖ‌ర్చుకు భ‌విష్య‌త్‌లో వ‌చ్చే అధిక రాబ‌డి స‌మం అయిపోతుంది. అయితే ఈ రాబ‌డి అంచ‌నాలు విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ప‌నిచేస్తేనే స‌త్ఫ‌లితాల‌నిస్తాయి. భార‌త్‌లో లేదా మ‌రొక దేశంలో ప‌నిచేస్తున్న‌ప్పుడు ఈ విదేశీ విద్యా రుణాన్ని తీర్చ‌డం ఆల‌స్య‌మ‌వుతుంది.

విదేశీ విద్య‌కు ముందు నుంచి సిద్ధం కావాలి..

విదేశీ విద్య‌ను కోరుకునే విద్యార్థుల తల్లిదండ్రులు క‌నీసం 10 ఏళ్ల ముందు నుంచే ప్ర‌ణాళిక‌గా సిద్ధం కావాలి. 10 ఏళ్ల దీర్ఘ‌కాల స‌మ‌యానికి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క్ర‌మానుగ‌త (SIP) విధానంలో మ‌దుపు ప్రారంభించాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో స్వ‌ల్ప‌కాలం పాటు ఒడుదొడుకులు ఏర్ప‌డినా 10 ఏళ్ల దీర్ఘ‌కాలానికి మంచి నిధినే దాచ‌వ‌చ్చు. దీర్ఘ‌కాలానికి ప్ర‌భుత్వ హామీ ఉండే పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బును పొదుపు చేయ‌డం కూడా మంచిదే. బాలిక‌ల తల్లిదండ్రులు అయితే ఉన్న‌త విద్య‌ కోసం 'సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం'లో పొదుపు గురించి ఆలోచించ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కానికి కూడా ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. వీటిలో దీర్ఘ‌కాలానికి అధిక మొత్తంలోనే నిధిని సంపాదించ‌వ‌చ్చు. విదేశీ విద్య క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని