SUV: ధర ఎక్కువైనా సరే.. ఎస్‌యూవీలే కొంటాం..!

SUV: భారత్‌లో ‘స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (SUV)’కు ఆదరణ పెరుగుతోంది.....

Updated : 17 Jul 2022 18:27 IST

ఎక్కువ ఫీచర్లుండే కార్ల వైపు భారతీయుల మొగ్గు

దిల్లీ: భారత్‌లో ‘స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (SUV)’కు ఆదరణ పెరుగుతోంది. తయారీ సంస్థలు ఇస్తున్న ఫీచర్లు దాన్ని మరింత పెంచుతున్నాయి. గత ఐదేళ్లలో ఏకంగా 36 ఎస్‌యూవీలు భారత విపణిలో విడుదలయ్యాయి. డిమాండ్‌ ఎక్కువ వున్న కొన్ని మోడళ్ల కోసమైతే బుక్‌ చేసుకున్న తర్వాత రెండేళ్ల పాటు వేచి చూడాల్సి వస్తోంది. అయినా, కొత్త ఆర్డర్లు ఏమాత్రం తగ్గడం లేదు. సన్‌రూఫ్‌, కనెక్టెడ్‌ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీల వైపే కారు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. విక్రయాల్లో ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్ల హవా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని ఎంట్రీ లెవెల్‌, మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీలు ఆక్రమించాయి. దీంతో కంపెనీలు ఆయా సెగ్మెంట్‌లోనే కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి.

మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా ఒకప్పుడు 19 శాతంగా ఉండేది. 2020-21 నాటికి అది 40 శాతానికి పెరిగినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. 2011 నుంచి కార్ల మార్కెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల హవా నడిచింది. ప్రస్తుతం ప్రయాణికుల వాహన విభాగంలో ఎంట్రీ-లెవెల్‌ ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది మొత్తం 30.68 లక్షల కార్లు విక్రయం కాగా.. వీటిలో 6.52 లక్షలు ఎంట్రీ-లెవెల్‌ ఎస్‌యూవీలే కావడం గమనార్హం. యువతరం సౌకర్యవంతమైన ఫీచర్లు ఉండే కార్లవైపు మొగ్గుచూపుతున్నారు. 2016-17లో అత్యధిక ఫీచర్లు ఉన్న కార్ల విక్రయాల వాటా 17 శాతంగా ఉండగా.. 2021-22 నాటికి అది 24 శాతానికి పెరగడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని