TATA SONS Chairman: వినియోగదారు విపణికి తిరుగు లేదు

జనాభాతో పాటు మధ్యతరగతి వర్గం పెరుగుతుండటం, పట్టణీకరణ వేగవంతం అవుతుండటం, మిగులు ఆదాయం పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షల నేపథ్యంలో.. దేశంలో ఎఫ్‌ఎంసీజీ  ఉత్పత్తుల అమ్మకాలు దీర్ఘకాలంలోనూ బాగుంటాయని టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ గురువారం వెల్లడించారు.

Published : 14 Jun 2024 02:21 IST

టీసీపీఎల్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌

దిల్లీ: జనాభాతో పాటు మధ్యతరగతి వర్గం పెరుగుతుండటం, పట్టణీకరణ వేగవంతం అవుతుండటం, మిగులు ఆదాయం పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షల నేపథ్యంలో.. దేశంలో ఎఫ్‌ఎంసీజీ  ఉత్పత్తుల అమ్మకాలు దీర్ఘకాలంలోనూ బాగుంటాయని టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ గురువారం వెల్లడించారు. టీసీపీఎల్‌ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా వృద్ధి చెందుతోందని, కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భౌగోళిక - రాజకీయ పరిణామాలు, సరఫరా వ్యవస్థ, ఇంధన భద్రత వంటి సమస్యలు ఎదురవుతుంటాయని వివరించారు.  

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024, 2025 సంవత్సరాల్లో 3 శాతానికి పైగా వృద్ధితో సాగుతుందనేది అంచనా. మన దేశం 2023-24లో 8.2% వృద్ధిని సాధించిందని, భవిష్యత్తులోనూ పటిష్ఠ వృద్ధిని స్థిరంగా కొనసాగించేలా అడుగులు వేస్తోందని చంద్రశేఖరన్‌ వెల్లడించారు. మన దేశంలో మధ్యతరగతి వర్గీయులు ఇప్పుడు 30% కాగా, ఈ దశాబ్దం చివరకు 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని, అంటే సుమారు 30 కోట్ల మంది ఈ ఆదాయ వర్గంలోకి వస్తారని వివరించారు. ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలకు ఈ వర్గమే ప్రధానమని గుర్తు చేశారు. 

డిజిటలీకరణ ప్రక్రియ నడుస్తోంది: టీసీపీఎల్‌ ఉత్పత్తులు 40 లక్షల విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయని, డిజిటలీకరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. సేల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌లో కొత్త ఆవిష్కరణల వాటా 5 శాతంగా ఉందన్నారు. టాటా స్టార్‌బక్స్‌ 2023-24లో 95 కొత్త స్టోర్లను ప్రారంభించిందని, కంపెనీ అంతర్జాతీయ వ్యాపారం కూడా పురోగమిస్తోందని వివరించారు. 2023-24లో టీసీపీఎల్‌ రూ.15,206 కోట్ల ఆదాయాన్ని (10 శాతం వృద్ధి) ఆర్జించింది. 2020లో టాటా కెమికల్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ వ్యాపారాన్ని టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌తో విలీనం చేసి టీసీపీఎల్‌ సంస్థను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని