Economic Survey: ఈ ఏడాది వృద్ధి రేటు 7%.. ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు

ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తుందని ఆర్థిక సర్వే (Economic Survey) అంచనా వేసింది.

Updated : 31 Jan 2023 15:12 IST

దిల్లీ: ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే (Economic Survey) తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022- 23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023- 24లో అది 6.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ‘పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ (PPP)’ పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంది. బడ్జెట్‌ (Budget 2023) సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వే (Economic Survey)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఆర్థిక సర్వేలో కీలకాంశాలు..

మహమ్మారి సమయంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుంది. నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. నెమ్మదించిన అంశాలన్నీ తిరిగి పుంజుకున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలోగానీ, లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలోగానీ ఉండదు.

రుణరేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉంది. కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంత కాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేయనుంది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇంకా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.

ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, కరెంటు ఖాతా లోటు విస్తృతమవుతున్న నేపథ్యంలో రూపాయికి ఒడుదొడుకులు తప్పకపోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా కమొడిటీ ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున కరెంటు ఖాతా లోటు (CAD) మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇతర దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి భారత్‌ చాలా వేగంగా కోలుకుంది. దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేయనున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఎగుమతుల వృద్ధి కాస్త నెమ్మదించింది.

ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయి.

స్థిరాస్తి రంగంతో పాటు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో ఉపాధి కల్పన మెరుగైంది. వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి ఇది దోహదం చేసింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉన్నట్లయితే ‘సూక్ష్మ, చిన్న మధ్యస్థాయి పరిశ్రమ (MSME)’ల రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

కొవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘అత్యవసర రుణ హామీ పథకం (ECLGS)’ వల్ల MSMEలు వేగంగా కోలుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని