India GDP: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7 శాతం: NSO

India GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసింది. గతేడాది కంటే ఇది తక్కువ కాగా.. ఆర్‌బీఐ వెలువరించిన అంచనాల కంటే ఎక్కువ కావడం గమనార్హం. 

Updated : 06 Jan 2023 19:58 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జీడీపీ (GDP) 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. గతేడాది 8.7 శాతంతో పోలిస్తే ఈ సారి తక్కువ వృద్ధి నమోదు కానుండడం గమనార్హం. మైనింగ్‌, తయారీ రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడమే దీనికి కారణం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) శుక్రవారం తన తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెలువరించిన 6.8 శాతం వృద్ధి అంచనాలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ కావడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం 1.6 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేయొచ్చని గణాంక కార్యాలయం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 9.9 శాతం వృద్ధి నమోదు చేసింది. అలాగే, మైనింగ్‌ రంగం సైతం గతేడాది 11.5 శాతం వృద్ధి నమోదు చేయగా.. ఈ సారి కేవలం 2.4 శాతం మాత్రమే నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక స్థిర ధరల (2011-12) ప్రకారం రియల్‌ జీడీపీని గణించినప్పుడు ఈ ఏడాది రూ.157.60 లక్షలు కోట్లుగా ఉండనుందని గణాంక కార్యాలయం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం ఇది రూ.147.36 లక్షల కోట్లుగా ఉంది. అదే ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీని లెక్కించినప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లుగా ఉండనుంది. గతేడాదికి గానూ ఈ మొత్తం రూ.236.65 కోట్లుగా అంచనా వేసింది.  

రంగాల వారీగా అంచనాలు..

వ్యవసాయ రంగం గతేడాది 3 శాతం వృద్ధి చెందగా.. ఈసారి 3.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని గణాంక కార్యాలయం తెలిపింది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌ సేవల రంగం 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుందని అంచనా. ఆర్థిక, స్థిరాస్తి, వృత్తినైపుణ్య సేవలు 4.2 శాతం నుంచి 6.4 శాతానికి పెరగనున్నాయి. నిర్మాణ రంగం 11.5 శాతంతో పోలిస్తే 9.5 శాతానికి తగ్గనుంది. ప్రభుత్వ పాలన, రక్షణ, ఇతర సేవలు 12.6 శాతం నుంచి 7.9 శాతానికి చేరనున్నాయని గణాంక కార్యాలయం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని