Gold: పసిడికి ‘ధరా’ఘాతం.. 18శాతం తగ్గిన గిరాకీ

అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల కారణంగా ఇటీవల పసిడి ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే ఇది విక్రయాలపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో బంగారం గిరాకీ 18శాతం తగ్గింది.

Published : 28 Apr 2022 13:24 IST

ముంబయి: అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల కారణంగా ఇటీవల పసిడి ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే, ఇది విక్రయాలపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో బంగారం గిరాకీ 18శాతం తగ్గింది. ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం వెల్లడించింది.

2022 తొలి త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ ట్రెండ్‌పై డబ్ల్యూజీసీ నివేదిక విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. 2022 జనవరి - మార్చి మధ్య 135.5 టన్నుల పసిడి క్రయవిక్రయాలు జరిగాయి. 2021 ఇదే త్రైమాసికంలో 165.8 టన్నుల మేర డిమాండ్‌ ఉండగా.. ఈ ఏడాది 18శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. విలువ పరంగా.. జనవరి - మార్చి కాలంలో బంగారం గిరాకీ 12శాతం తగ్గి రూ.61,550కోట్ల విలువైన పసిడి క్రయవిక్రయాలు జరిగాయి. ఆభరణాలకు 26శాతం గిరాకీ తగ్గి 94.2 టన్నులుగా ఉంది.

అయితే గత త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడులు మాత్రం 2021 తొలి త్రైమాసికంతో పోలిస్తే 5 శాతం పెరిగాయి. ధరల పెరుగుదలతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, రూపాయి క్షీణత కారణంగా.. పసిడిలో పెట్టుబడులు శ్రేయస్కరమని మదుపర్లు భావించినట్లు బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

‘‘తొలి త్రైమాసికంలో బంగారు ఆభరణాల గిరాకీ 100 టన్నుల కంటే తక్కువగా ఉండటం 2010 తర్వాత మళ్లీ ఇప్పుడే. జనవరి - మార్చి మధ్య మంచి రోజులు తక్కువగా ఉండటంతో వివాహాది శుభకార్యాలు తగ్గాయి. మరోవైపు పసిడి ధర కూడా విపరీతంగా పెరగడంతో ప్రజలు కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. జనవరి ఆరంభం నుంచే బంగారం ధరలు పెరిగాయి. తొలి త్రైమాసికంలో 10 గ్రాముల పసిడి ధర దాదాపు 8శాతం పెరిగింది’’ అని డబ్ల్యూజీసీ రీజినల్‌ సీఈఓ సోమసుందరమ్‌ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తంలో 800 నుంచి 850 టన్నుల పసిడి వ్యాపారం జరిగే అవకాశముందని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని