COVID-19: కొవిడ్‌లో పేదలకు భారత్‌ అందించిన సాయం భేష్‌: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు

కొవిడ్‌ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిన తీరును ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కొనియాడారు. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం సత్ఫలితాలిచ్చిందన్నారు.

Published : 06 Oct 2022 03:07 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 సంక్షోభం సమయంలో పేదలు, బడుగు వర్గాలకు భారతదేశం అందించిన సాయం విశేషమైనదని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ బుధవారం కొనియాడారు. అలాగే విస్తృత రాయితీలకు బదులు భారత్‌లో అమలవుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ఇతర దేశాలు సైతం అనుసరించాలని సూచించారు. ఫలితంగా అసవరమైన లబ్ధిదారులకు మాత్రమే ఫలాలు అందుతాయన్నారు.  

పేదరిక నిర్మూలనలో ప్రపంచం సాధించిన ప్రగతికి కొవిడ్‌-19 ముగింపు పలికిందని మాల్పాస్‌ తెలిపారు. మహమ్మారి వెలుగులోకి రావడానికి ముందు మూడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. పేదదేశాల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మహమ్మారి వల్ల అత్యధికంగా పేద వర్గాలే ప్రభావితమయ్యాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదాయ అసమానతలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పేద దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారినప్పటికీ.. వర్ధమాన దేశాలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతి సాధించాయన్నారు. 

కొవిడ్‌-19 సమయంలో భారత ప్రభుత్వం 69 శాతం పట్టణ, 85 శాతం గ్రామీణ కుటుంబాలకు ఆహారం లేదా నగదు సాయాన్ని అందజేసిందని మాల్పాస్‌ తెలిపారు. దీనికి డిజిటల్‌ వేదికలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాలో దాదాపు 2.9 కోట్ల మందికి 6 బిలియన్‌ డాలర్లు విలువ చేసే భారీ సామాజిక భద్రతా కార్యక్రమాన్ని అమలు చేసినట్లు తెలిపారు. అలాగే బ్రెజిల్‌లో ఆర్థిక పరిస్థితులు మందగించినప్పటికీ.. 2020లో డిజిటల్‌ నగదు బదిలీ ద్వారా అత్యంత పేదరికాన్ని తగ్గించగలిగిందని పేర్కొన్నారు. విస్తృత స్థాయి రాయితీలకు బదులు ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాలు సత్ఫలితాస్తాయనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts