NASSCOM: భారత టెక్‌ వృద్ధి నెమ్మదించొచ్చు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) భారత టెక్నాలజీ రంగ వృద్ధి 8.4 శాతం తగ్గి 245 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ అంచనా వేసింది.

Updated : 02 Mar 2023 07:27 IST

నాస్‌కామ్‌ అంచనా

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) భారత టెక్నాలజీ రంగ వృద్ధి 8.4 శాతం తగ్గి 245 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ అంచనా వేసింది. 2021-22లో పరిశ్రమ దశాబ్దకాలంలోనే అత్యుత్తమంగా 15.5 శాతం వృద్ధి చెంది 226 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కొవిడ్‌ కారణంగా ఖాతాదారులకు టెక్నాలజీ వ్యయాలకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం ఒక్కసారిగా గరిష్ఠాలకు చేరింది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడంతో మాంద్యం రావొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా టెక్‌ రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. భవిష్యత్‌పై కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు అత్యంత అప్రమత్తంగా ఉన్నారని నాస్‌కామ్‌ పేర్కొంది. భౌగోళిక ఉద్రికత్తల వల్ల ఐటీ కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయని, కొన్ని విపణుల్లో గిరాకీ తగ్గుతోందని నాస్‌కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయానీ ఘోష్‌ తెలిపారు. అగ్రగామి 5 కంపెనీలు 18 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను ప్రకటించాయని, మొత్తంగా 10 శాతం ఖాతాదారుల వృద్ధిని నమోదుచేశాయని, ఉద్యోగుల వినియోగం 6-7 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

* ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో ఉపాధి అంతరాలు కనిపిస్తున్నట్లు నాస్‌కామ్‌ తెలిపింది. మూలాలు, నైపుణ్యాల కల్పనపై విద్యా వ్యవస్థ దృష్టి పెట్టడం లేదని పేర్కొంది. సరిపడా నైపుణ్యాలు లేకపోవడంతో ఫ్రెషర్ల శిక్షణపై కంపెనీలు అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని