Stock Market: సూచీలను వీడని యుద్ధ భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టాలే

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలే మార్కెట్లను నిర్దేశించాయి.....

Updated : 21 Feb 2022 15:59 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలే నేడు మార్కెట్లను నిర్దేశించాయి. మధ్యలో కాస్త కోలుకున్నప్పటికీ.. ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి.

ఉదయం సెన్సెక్స్‌ 57,551.65 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో  58,141.96 - 57,167.02 మధ్య కదలాడింది. చివరకు 149.38 పాయింట్ల నష్టంతో 57,683.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,192.25 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజులో 17,351.05 - 17,070.70 మధ్య కదలాడింది. చివరకు 69.65 పాయింట్లు నష్టపోయి 17,206.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.58 వద్ద నిలిచింది.

ప్రభావం చూపిన అంశాలివే...

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రక్తతలే నేడు మార్కెట్లను నిర్దేశించాయి. సరిహద్దుల్లో రష్యా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు శాటిలైట్‌ చిత్రాల్లో కనిపిస్తోందంటూ వచ్చిన వార్తలు ఉదయం మదుపర్లను కలవరపెట్టాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం ఇవే భయాలతో తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమైనప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్‌ వివాదానికి పరిష్కారం లభించే అవకాశం ఉందన్న అంచనాలతో కొంత పుంజుకున్నాయి. పుతిన్‌-బైడెన్ మధ్య భేటీతో సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావించాయి. దీంతో భారత్‌ సహా అంతర్జాతీయ సూచీలు కొంత సానుకూలంగా కదలాడాయి. కానీ, బైడెన్‌తో సమావేశంపై రష్యా ప్రతికూలంగా స్పందించడంతో వచ్చిన స్వల్ప లాభాలు కాస్తా ఆవిరయ్యాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ, నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

* బీటా కరోనా వైరస్‌ వ్యాక్సిన్స్‌ తయారీ నిమిత్తం భారత ప్రభుత్వం, పనసియా బయోటెక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 5 శాతం మేర పుంజుకున్నాయి.

* ఆఫిల్‌ ఇండియా షేర్లు ఈరోజు 4 శాతం మేర లాభపడ్డాయి. ఆప్‌నెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 28.33 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను తమ అనుబంధ సంస్థ ఆఫిల్‌ ఇంటర్నేషనల్‌ పూర్తి చేసిందని ప్రకటించింది. 

* ముంబయి, దిల్లీలోని ఇండియా బుల్స్‌ ఫైనాన్స్‌ సెంటర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్‌ కార్యకలాపాల నిరోధక చర్యల్లో భాగంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

* సెన్సెక్స్‌ నష్టాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఐటీసీ ప్రధాన పాత్ర పోషించాయి. 

* హోటల్స్‌ రంగంలోని షేర్లు ఈరోజు రాణించాయి. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో తిరిగి గిరాకీ రానుందన్న అంచనాల మధ్య చాలెట్‌ హోటల్స్‌ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 20 శాతం వరకు లాభపడడం విశేషం.

* గత బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన వేదాంత్‌ ఫ్యాషన్స్‌ (మాన్యవర్‌) షేర్లు ఈరోజు 2 శాతం వరకు కుంగాయి. లిస్టింగ్ డే నాటి గరిష్ఠాల నుంచి ఇప్పటి వరకు 12 శాతం మేర పడిపోయింది. ఇష్యూ ధర కంటే కేవలం 1 శాతం పైన ట్రేడవుతోంది.

* ప్రమోటర్‌ రాకేశ్‌ గంగ్వాల్‌ బోర్డు నుంచి తప్పుకోవడంతో పాటు తన వాటాల్ని ఉపసంహరించుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో నేడు ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు 2.5 శాతానికి పైగా పడిపోయాయి.  

* రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్‌ సూచీ మాత్రమే స్వల్ప లాభాల్లో ముగిసింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, యుటిలిటీస్‌, మెటల్‌, పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, బేసిక్‌ మేటీరియల్స్‌, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. 

* నిఫ్టీ 50 సూచీలో 12 షేర్లు లాభపడగా.. 38 షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని