Stock Market: ఎనిమిదో రోజూ దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: అమెరికాలో వడ్డీరేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తామన్న ఫెడ్‌ ఛైర్మన్‌ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీచాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లూ అదే బాటలో పయనించాయి.

Published : 01 Dec 2022 15:59 IST

 

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ దూసుకెళ్లాయి. గురువారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. గతకొన్ని రోజుల తరహాలోనే సూచీలు నేడు కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు విషయంలో వేగాన్ని తగ్గిస్తామన్న ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలు సూచీల పరుగుకు దోహదం చేశాయి. మరోవైపు చమురు ధరలు దిగువ శ్రేణుల్లో ట్రేడవుతుండడం, రూపాయి బలపడడం కూడా ర్యాలీకి కలిసొచ్చాయి.

సెన్సెక్స్‌ ఉదయం 63,357.99 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 63,583 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖరుకు 184.54 పాయింట్ల లాభంతో 63,284.19 వద్ద స్థిరపడింది. 18,871.95 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 18,887.60 వద్ద తాజా గరిష్ఠాన్ని తాకింది. చివరకు 54.15 పాయింట్లు ఎగబాకి 18,812.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, మారుతీ, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.15 వద్ద నిలిచింది.

మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు..

☛ వొడాఫోన్‌ ఐడియా షేరు ధర ఈరోజు 1 శాతానికి పైగా కుంగింది. ఎస్‌బీఐ నుంచి ఈ కంపెనీ రూ.16,000 కోట్ల రుణానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్న వార్తలే షేరును కిందకు లాగాయి.

☛ క్యామాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.608 కోట్లతో 98 మిలియన్ల జొమాటో షేర్లను కొనుగోలు చేసింది. మరోవైపు అలీబాబా గ్రూప్‌ 263 మిలియన్ల షేర్లను విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో జొమాటో స్టాక్‌ ధర గత రెండు రోజుల్లో 5 శాతానికి పైగా పెరిగి ఈరోజు రూ.66.65 వద్ద స్థిరపడింది.

☛ బిస్లరీ బ్రాండ్‌ పేరిట ప్యాకేజ్డ్‌ వాటర్‌, కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌ విక్రయిస్తున్న ఓరియెంట్‌ బెవరేజెస్‌ షేరు వరుసగా ఆరో రోజూ 5 శాతం పెరిగి రూ.179.05 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ ధర 77 శాతం పెరగడం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని