Published : 18 May 2022 16:00 IST

Stock Market Update: 2 రోజుల లాభాలకు బ్రేక్‌.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు

ముంబయి: రెండు రోజుల వరుస లాభాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. తర్వాత కనిష్ఠాల వద్ద మరోసారి కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ.. అది ఎంతోసేపు నిలవలేదు. చివరకు రెండు ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. 

నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మార్కెట్లను గతకొన్ని రోజులుగా కలవరపెడుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వంటి పరిణామాల్లో ఎలాంటి సానుకూల అంశాలు లేనప్పటికీ నిన్న సూచీలు రాణించిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి అవి స్థిరీకరణ దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఐరోపా మార్కెట్లు, ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేలచూపులు చూడడం కూడా మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 15.8 శాతానికి చేరడం, ఫెడ్‌ వడ్డీరేట్లను అవసరమైతే మరింత వేగంగా పెంచుతామని పావెల్‌ ప్రకటించడమూ సూచీలను కలవరపరిచింది. స్థూలంగా మదుపర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఉదయం సెన్సెక్స్‌ 54,554.89 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,786.00 - 54,130.89 మధ్య కదలాడింది. చివరకు 109.94 పాయింట్ల నష్టంతో 54,208.53 వద్ద ముగిసింది. 16,318.15 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 19 పాయింట్లు నష్టపోయి 16,240.30 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,399.80 - 16,211.20 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.58 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* గత ఏడాది నాలుగో త్రైమాసికంలో టీమ్‌లీజ్‌ ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంలో కంపెనీ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 15 శాతం వరకు నష్టపోయాయి. తర్వాత కోలుకోవడంతో నష్టాలు 2.4 శాతానికి పరిమితమయ్యాయి.

* మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ షేర్లు 52 వారాల కనిష్ఠానికి చేరింది. ఇంట్రాడేలో ఈ షేరు 9 శాతానికి పైగా నష్టపోయింది.

* మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ ఫలితాలు బలంగా నమోదైనప్పటికీ.. ఈరోజు కంపెనీ షేర్లు మాత్రం బలహీనంగా ట్రేడయ్యాయి. ఓ దశలో 5 శాతానికి పైగా నష్టపోయాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని