Stock Market Update: వరుసగా నాలుగో రోజూ నష్టాలే!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన బుధవారమూ నష్టాలతో ముగిశాయి....

Updated : 11 May 2022 16:09 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన బుధవారమూ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నానికి భారీ నష్టాల్లోకి కూరుకుపోయి ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈరోజు అమెరికాలో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. మదుపర్లు దానిపై దృష్టి సారించారు. మరోవైపు ద్రవ్యోల్బణం, మందగమన సూచనల మూలంగా గతకొన్ని రోజులుగా ప్రపంచమార్కెట్లలో వీస్తున్న ప్రతికూల పవనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సూచీలు నేడు నష్టాలు చవిచూశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 54,544.91 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,519.30 -  54,598.55 మధ్య కదలాడింది. చివరకు 276.46 పాయింట్ల నష్టంతో 54,088.39 వద్ద ముగిసింది. 16,270.05 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 72.95 పాయింట్లు నష్టపోయి 16,167.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,318.75 - 15,992.60 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.23 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. ఎల్ అండ్‌ టీ, బజాజ్‌  ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, మారుతీ, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. 

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* జనవరి-మార్చి త్రైమాసికంలో వెల్‌స్పన్‌ ఇండియా ఫలితాలు నిరాశపర్చడంతో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 17 శాతం మేర నష్టపోయాయి. మార్చి 2020 తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద ఒకరోజు నష్టం.

* జీ మీడియా షేర్లు వరుసగా పదో సెషన్‌లోనూ నష్టాలు నమోదు చేశాయి. ఈరోజు కంపెనీ షేరు 10 శాతానికి పైగా కుంగింది.

* ఎఫ్‌పీఓ తర్వాత భారీగా ఎగబాకిన రుచి సోయా షేర్లు గతకొన్ని రోజులుగా స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. ఈరోజు షేరు ధర 10 శాతానికి పైగా నష్టపోయింది.

* ఈరోజు ప్రారంభమైన వీనస్‌ పైప్స్‌ ఐపీఓకి పూర్తిస్థాయి స్పందన లభించింది. రిటైల్‌ విభాగంలో తొలిరోజు 2.59 రెట్ల స్పందన రావడం విశేషం. డెలివరీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఈరోజే ప్రారంభమైంది. దీనిపై మదుపర్ల స్పందన పేలవంగానే ఉంది. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలిపి 20 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. ఈ రెండు ఐపీఓలు మే 13న ముగియనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని