Stock Market Update: వరుసగా 6 రోజులు నష్టాలు.. రెండేళ్ల తర్వాత తొలిసారి!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఆరో రోజైన శుక్రవారమూ నష్టాలతో ముగిశాయి....

Updated : 13 May 2022 16:34 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఆరో రోజైన శుక్రవారమూ నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు చివరి గంటన్నరలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠాల నుంచి ఏకంగా 900 పాయింట్లకు పైగా పతనం కావడం గమనార్హం. ఏప్రిల్‌ 2020 తర్వాత ఇలా వరుసగా ఆరు రోజుల పాటు సూచీలు నష్టపోవడం ఇదే తొలిసారి. మొత్తంగా ఈ వారం సెన్సెక్స్‌ 2000 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ గత ఐదు రోజుల్లో రూ.13.83 లక్షల కోట్లు ఆవిరైంది. ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్‌ మార్కెట్లలో ఉన్న భయాలే దేశీయ సూచీల పతనానికీ కారణమవుతున్నాయి. నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో ఉదయం లాభాల బాటలో పయనించిన సూచీల సెంటిమెంటును ఎస్‌బీఐ ఫలితాలు నిరాశపర్చాయి. సంస్థ ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో మదుపర్లు నిరాశకు గురయ్యారు. ఎస్‌బీఐ షేరు ఈరోజు 3.89 శాతం నష్టాన్ని చవిచూసింది.

స్థూలంగా ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, చమురు ధరల పెరుగుదల, త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం ఫలితంగా ఆర్థిక మందగమన సంకేతాలు ఈ వారం మార్కెట్లను భారీ దెబ్బకొట్టాయి. ఉదయం సెన్సెక్స్‌ 53,565.74 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో  53,785.71 - 52,654.89 మధ్య కదలాడింది. చివరకు 136.69 పాయింట్ల నష్టంతో 52,793.62 వద్ద ముగిసింది. 15,977.00 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 25.85 పాయింట్లు నష్టపోయి 15,782.15 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,083.60 - 15,740.85 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.48 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, టైటన్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని