Stock Market Update: మార్కెట్లకు లాభాల జోష్‌..!

లోహ, ఇంధన, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల షేర్లు రాణించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి....

Updated : 17 May 2022 16:11 IST

ముంబయి: లోహ, ఇంధన, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల షేర్లు రాణించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలూ సూచీలకు దన్నుగా నిలిచాయి. గత 15 నెలల్లో సూచీలకు ఇదే సెకండ్‌ బెస్ట్‌ డే కావడం విశేషం.

ఉదయం సెన్సెక్స్‌ 53,285.19 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,399.42 - 53,176.02 మధ్య కదలాడింది. చివరకు 1344.63 పాయింట్ల భారీ లాభంతో 54,318.47 వద్ద ముగిసింది. 15,912.60 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 438.15 పాయింట్లు లాభపడి 16,280.45  వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,284.25 - 15,900.80 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.47 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ముగియడం విశేషం. టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఐటీసీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి.

మార్కెట్ల జోరుకు ప్రధాన కారణాలు..

షాంఘైలో జీరో కొత్త కేసులు: వరుసగా మూడోరోజు చైనాలోని షాంఘైలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది మదుపర్ల సెంటిమెంటును పెంచింది. పైగా అక్కడి ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ ఆంక్షల్ని దశలవారీగా సడలిస్తుండడంతో సాధారణ కార్యకలాపాలు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు: గతవారం వరుసగా నష్టాలపాలైన మార్కెట్లు.. కనిష్ఠాల వద్ద అమ్మకాల తాకిడిని ఎదుర్కొంటోంది. సూచీలు ఇప్పటికే భారీగా స్థిరీకరించుకున్నాయని మదుపర్లు భావించడమే ఇందుకు కారణం. కీలక కంపెనీల షేర్లు తక్కువకు అందుబాటులో ఉండడంతో మదుపర్లు కొనుగోలుకు ఆసక్తి చూపించారు.

కీలక గణాంకాల దన్ను: దేశీయంగా చూస్తే తయారీ, సేవారంగ కార్యకలాపాలు పుంజుకున్నాయి. మరోవైపు కొవిడ్‌ ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడంతో వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్‌లో జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. అలాగే ఏప్రిల్‌లో ఎగుమతులు సైతం 30.7 శాతం పుంజుకున్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* అబోట్‌ ఇండియా షేర్లు ఇంట్రాడేలో ఆరు శాతం మేర లాభపడ్డాయి. గత ఏడాది నాలుగో త్రైమాసికం ఫలితాలు అంచనాలను అందుకోవడమే ఇందుకు కారణం.

* మార్చితో ముగిసిన త్రైమాసికంలో బజాజ్‌ ఎలక్ట్రికల్స్ ఫలితాలు నిరాశపర్చినప్పటికీ.. భవిష్యత్తు వృద్ధి అంచనాలతో షేర్లు ఈరోజు 10 శాతం వరకు రాణించాయి.

* హోండా ఇండియా పవర్‌ ప్రోడక్ట్స్‌ షేర్లు 17 శాతం లాభపడ్డాయి. గత నెలరోజుల్లో ఈ స్టాక్‌ 25 శాతానికి పైగా లాభపడింది. కంపెనీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు భవిష్యత్తు వృద్ధికి దోహదం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ షేరు ర్యాలీ అవుతోంది.

* గోధుమ ఉత్పత్తుల ధరలు పెరుగుతుండడంతో ఐటీసీ షేరు ఐదు వారాల గరిష్ఠానికి చేరింది. గోధుమ ఆధారిత కంపెనీలన్నీ ఈరోజు లాభపడ్డాయి.

* ఈరోజు మార్కెట్లలో లిస్టయిన ఎల్‌ఐసీ షేర్లు మదుపర్లను నిరాశపర్చాయి. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే షేరు 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద నమోదైంది. ఇంట్రాడేలో రూ.860 వద్ద కనిష్ఠాన్ని, రూ.918 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు ఇష్యూ ధరతో పోలిస్తే 8 శాతం నష్టపోయి రూ.875 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని