Indigo: విమానం దిగడం ఇక ఈజీ.. ఇండిగో కొత్త సదుపాయం

Indigo: ప్రయాణికులు దిగే సమయాన్ని తగ్గించడం కోసం ఇండిగో విమాన సంస్థ కొత్త విధానం తీసుకొచ్చింది.

Updated : 24 Nov 2022 12:45 IST

దిల్లీ: విమానాల్లో ప్రయాణించడం అంటే చాలా మందికి సరదా. అయితే, విమానాశ్రయానికి వెళ్లడం.. బోర్డింగ్‌ పాస్‌ తీసుకోవడం.. సెక్యూరిటీ చెకింగ్‌లు దాటుకుని విమానం ఎక్కడం ఒకెత్తయితే.. దిగడం మరో ఎత్తు. విమానం వెనుక సీట్లో కూర్చున్నవారైతే దిగడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ప్రయాణం చేసిన ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో విమాన సంస్థ కొత్త విధానం తీసుకొచ్చింది. ప్రయాణికులు దిగే సమయాన్ని తగ్గించడం కోసం మూడు డోర్ల నుంచి బయటకొచ్చే వెసులుబాటును తీసుకొచ్చింది.

మూడు పాయింట్ల ద్వారా విమానం దిగే ప్రక్రియను ప్రపంచంలోనే తొలిసారి తాము తీసుకొస్తున్నట్లు ఇండిగో సీఈఓ రొణొజోయ్‌ దత్తా తెలిపారు. ముందు వైపు నుంచి రెండు ద్వారాలు, వెనుక నుంచి ఒక ద్వారం నుంచి ప్రయాణికులు బయటకు రావొచ్చని చెప్పారు. దీనివల్ల కనీసం ఐదారు నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు. సాధారణంగా  విమానం దిగేందుకు 13-14 నిమిషాలు పడుతుందని, తాము తీసుకొచ్చిన ఈ విధానం వల్ల ఏడెనిమిది నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపారు. ముందుగా బెంగళూరు, ముంబయి, దిల్లీ విమానాశ్రయాల్లో అమలు చేస్తామని, దశలవారీగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. గురువారంతో ఇండిగో 16 వసంతాలు పూర్తి చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని