Moonlighting: ఒకేసారి రెండు ఉద్యోగాలకు అనుమతించేది లేదు: ఇన్ఫోసిస్‌

ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసే (మూన్‌లైటింగ్‌) విధానాన్ని అనుమతించేది లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది....

Updated : 13 Sep 2022 14:31 IST

బెంగళూరు: ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసే (moonlighting) విధానాన్ని అనుమతించేది లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) స్పష్టం చేసింది. ఈ మేరకు తమ ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం లేఖ రాసింది. కంపెనీ నిబంధనలకు ఇది విరుద్ధమని తేల్చి చెప్పంది. ఈ విషయాన్ని ఉద్యోగులకు ఆఫర్‌ లెటర్‌లోనే స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేసింది. దీన్ని ఉల్లంఘించినవారిని తొలగించడానికి కూడా వెనకాడబోమని తెలిపింది.

ఒకవేళ అలా అదనపు ఆదాయం కోసం ఏదైనా పనిచేయాలనుకుంటే దానికి కంపెనీ అనుమతి తప్పనిసరని లేఖలో పేర్కొంది. సందర్భాన్ని బట్టి నిబంధనలకు లోబడి ఉద్యోగి అభ్యర్థన అర్హమైనదేనని భావిస్తే ప్రత్యేక అనుమతి విషయాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దాన్ని ఏ సందర్భంలోనైనా రద్దు చేసే అధికారమూ ఉంటుందని పేర్కొంది. మూన్‌లైటింగ్‌పై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో దీనికి ప్రాముఖ్యం పెరిగింది. నైపుణ్యం గల ఉద్యోగులకు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కొంతమంది అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయంలో మరో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు పలు సర్వేలు పేర్కొన్నాయి.  విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ కూడా ఇటీవల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మూన్‌లైటింగ్‌పై ప్రతికూలంగా స్పందించారు.

ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకొని ఆహారాన్ని పంపిణీ చేసే స్విగ్గీ తమ ఉద్యోగులకు మూన్‌లైటింగ్‌ పాలసీని ఇటీవల తీసుకొచ్చింది. తమ దగ్గర ఉద్యోగం చేస్తున్న వారు, విధుల అనంతరం ఇతర సమయాల్లో తాత్కాలికంగా మరో ఉద్యోగాన్ని/ తమకు నైపుణ్యం ఉన్న మరో రంగంలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించింది. స్విగ్గీ నిర్ణయం తర్వాతే ఈ విధానంపై చర్చ తెరపైకి వచ్చింది. 

మరోవైపు తాజా ఇన్ఫోసిస్‌ లేఖను లాభాపేక్ష లేని సంస్థ ‘నైట్స్‌’ (NITES) తప్పుబట్టింది. ఉద్యోగులు కేవలం 9 గంటలు మాత్రమే పనిచేసేలా కంపెనీతో ఒప్పందం ఉందని తెలిపింది. పనివేళల తర్వాత ఉద్యోగులు ఏం చేయాలనేది వారి స్వతంత్రమని పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం.. ప్రతి పౌరుడికీ జీవనోపాధిని పొందే హక్కు ఉందని తెలిపింది. ఉద్యోగులకు ఇలాంటి లేఖలు పంపడం చట్టవిరుద్ధమని, అనైతికమని మండిపడింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని