Infosys: 600 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్!

శిక్షణ అనంతరం నిర్వహించిన కంపెనీ అంతర్గత పరీక్షల్లో పాస్‌ కానీ కొత్త ఉద్యోగులను (Fresher Employees) తొలగిస్తూ ఇన్ఫోసిస్‌ (Infosys) కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగింపులపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Published : 06 Feb 2023 19:06 IST

బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ (IT Company) ఇన్ఫోసిస్‌ (Infosys) కొత్త ఉద్యోగుల (Fresher Employees)పై వేటు వేసింది. శిక్షణ అనంతరం ఉద్యోగంలో సరైన పనితీరు కనబరచని కారణంగా వీరిని తొలగించినట్లు తెలిపింది. కంపెనీ ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు నిర్వహించే ఇంటర్నల్‌ ఫ్రెషర్‌ అసెస్‌మెంట్‌ (FA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించని 600 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది. ‘‘నేను గతేడాది ఆగస్టు నుంచి ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాను. మాకు కంపెనీ శాప్‌ ఏబీఏపీ (SAP ABAP)లో శిక్షణ ఇచ్చింది. మా బృందంలోని 150 మందిలో 60 మంది మాత్రమే ఎఫ్‌ఏ పరీక్ష పాస్‌ అయ్యారు. మిగిలిన 90 మందిని తొలగిస్తున్నట్లు రెండు వారాల క్రితం నోటీసులు ఇచ్చారు’’అని ఓ ఉద్యోగి తెలిపారు. ఈ తొలగింపులపై ఇన్ఫోసిస్‌ కంపెనీ అధికారికంగా స్పందించాల్సివుంది. 

కొద్ది నెలల క్రితం ఇన్ఫోసిస్‌ కంపెనీ ఎఫ్‌ఏ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు కంపెనీ అంతర్గంగా తెలిపింది. ఫ్రెషర్స్ తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలని సూచించింది. పరీక్ష ఫలితాల ఆధారంగా రెండు వారాల క్రితం 600 మంది ఫ్రెషర్స్‌ను తొలగించినట్లు కంపెనీ ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు తెలిపారు. వీరంతా 8 నెలల క్రితం ఆఫర్‌ లెటర్‌ తీసుకున్నవారే కావడం గమనార్హం. మరోవైపు కంపెనీ జాబ్‌ ఆఫర్‌ అందుకుని, ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారు సైతం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గత నెలలో మరో దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సైతం 452 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపింది. శిక్షణ తర్వాత సరైన పనితీరు కనబరచని కారణంగా వారిని తొలగించినట్లు తెలిపింది. మరోవైపు మాంద్యం భయాలతో ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగిస్తున్నాయి. ట్విటర్‌, మెటా, అమెజాన్‌, గూగుల్ వంటి సంస్థలతోపాటు స్టార్టప్‌ కంపెనీలు సైతం ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని