chatGPT: మనుషుల్ని భర్తీ చేయడం ఏఐ వల్ల కాదు: నారాయణమూర్తి

Infosys Narayan Murthy on AI: చాట్‌జీపీటీ తరహా ఏఐలు మనుషుల్ని భర్తీ చేయలేవని, వాటి వల్ల మన పనులు మరింత సులభతరం కానున్నాయని ఇన్ఫీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అన్నారు.

Published : 28 Feb 2023 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ చాట్‌జీపీటీపై (chatGPT) ఈ మధ్య పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కృత్రిమ మేధ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భవిష్యత్‌లో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని కొందరు వాదిస్తున్నారు. అలాంటిదేమీ ఉండబోదని, దీనివల్ల మనుషుల పనులు మరింత సులభతరం కానున్నాయని చెప్పేవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి (Narayan Murthy) తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మనిషిని ఏఐ భర్తీ చేయలేదని అభిప్రాయపడ్డారు. ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఫౌండేషన్‌ డే కార్యక్రమంలో దీనిపై ఇటీవల ఆయన మాట్లాడారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మనుషుల్ని భర్తీ చేస్తుందన్న అభిప్రాయాలతో నారాయణమూర్తి విభేదించారు. సాంకేతికత వల్ల మనుషుల జీవితం మరింత సులభతరం కానుందన్నారు. కంప్యూటర్‌ వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమైందని, కానీ అవి మన జీవితాన్ని సులభతరం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మానవ మేధస్సును మించిన శక్తి దేనికీ లేదని, ఏ కంప్యూటరూ మన మెదడుతో పోటీ పడలేదని చెప్పారు. ఏఐ వల్ల మనిషికి మరింత ఖాళీ సమయం దొరకుతుందన్నారు. అయితే, ఆ సమయాన్ని ఉత్పాదకతకు వినియోగించాలని నారాయణమూర్తి సూచించారు.

చాట్‌జీపీటీ వంటి ఉత్పాదక కృత్రిమ మేధ ప్లాట్‌ఫామ్‌లు ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయలేవని టీసీఎస్‌ సైతం పేర్కొంది. అవి కేవలం ‘ఏఐ సహ-ఉద్యోగి’గా వ్యవహరిస్తాయని, ఉత్పాదకతను మెరుగుపర్చుకునేందుకు చాట్‌జీపీటీ వంటి టూల్స్‌ వినియోగించవచ్చని టీసీఎస్‌ ముఖ్య మానవ వనరుల అధికారి మిలింద్‌ లక్కడ్‌ అన్నారు. కంపెనీల వ్యాపార నమూనాలు మార్చడానికి పనికి రావని.. వచ్చే రెండేళ్లలో ఇటువంటి ప్లాట్‌ఫామ్‌ల పనితీరుకు సంబంధించి పూర్తి స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. నారాయణమూర్తి సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని