Infosys Narayana Murthy: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వద్దు.. ఎందుకో చెప్పిన నారాయణమూర్తి!

వర్క్‌ ఫ్రమ్‌ హోంను ఇంకా కొనసాగించడం ఏమాత్రం వాంఛనీయం కాదని ఇన్ఫోసిస్‌ సీఈఓ నారాయణమూర్తి తెలిపారు....

Published : 21 Mar 2022 12:12 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడక్కడా తిరిగి పెరుగుతున్నప్పటికీ.. వ్యాప్తి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోంది. అనేక దేశాలు ఆంక్షల్ని సడలిస్తున్నాయి. విమానయానం సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కొన్ని కంపెనీలు ‘ఇంటి నుంచి పని’ (WFH) సదుపాయానికి స్వస్తి పలికేందుకు సిద్ధమవుతున్నాయి. సాధారణ కార్యకలాపాలు నెలకొనాలని అందరూ కోరుకునేదే. కానీ, వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అలవాటుపడ్డవారికి మాత్రం ఇది కాస్త ఇబ్బందికరమే. బడా కంపెనీల యాజమాన్యాలు మాత్రం ఉద్యోగుల్ని వీలైనంత త్వరగా కార్యాలయాలకు తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. మహమ్మారి కట్టడిలో భాగంగా అనేక సంస్థలు ఈ కొత్త పని విధానాన్ని అమలు చేశాయి. కేసులు తగ్గిన ప్రతిసారీ ఏదోఒక కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చి గందరగోళం సృష్టించింది. ఏదేమైనప్పటికీ.. ప్రస్తుతం కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతోన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహమ్మారి కథ ముగిసిందనుకోవడానికి వీల్లేదని మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. అయితే.. వర్క్‌ ఫ్రమ్‌ హోంను ఇంకా కొనసాగించడం ఏమాత్రం వాంఛనీయం కాదని ఇన్ఫోసిస్‌ సీఈఓ నారాయణమూర్తి తెలిపారు.

ఈ విలువల్ని పెంపొందించడం సులభం కాదు..

‘‘వర్క్‌ ఫ్రమ్‌ హోం వ్యవస్థను నేను పెద్దగా ఇష్టపడను. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తే.. సంస్థల్లో ఉండే ఒక ప్రత్యేకమైన సంస్కృతి బలహీనపడుతుంది. ఇంటి నుంచి పని సంస్కృతిలో కృషి, సృజనశీలత, అత్యుత్తమ ప్రదర్శన, అంతర్‌ దృష్టి, యోగ్యత, సంవాదం.. వంటి విలువల్ని పెంపొందించడం అంత సులభం కాదు’’ అని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

భారత్‌లో సత్ఫలితాలివ్వదు..

భారత్‌ వంటి దేశాల్లో ఇంటి నుంచి పని సంస్కృతి అంతగా సత్ఫలితాలివ్వదని మూర్తి తెలిపారు. మన దేశంలో కొన్ని తరాలు కలిసి ఒకే కుటుంబంలో జీవనం సాగిస్తుంటాయని గుర్తుచేశారు. అలాంటి ఇళ్లలో మనకంటూ ఒక గదిని ఆఫీసు అవసరాల కోసం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చునన్నారు. ఇంటర్నెట్‌ వేగం కూడా ఓ పరిమితిగా నిలిచే అవకాశం ఉందన్నారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఉత్పాదకత విషయంలో బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉందని తెలిపారు.

చైనాను అందుకోవాలంటే తప్పదు..

భారత్‌ వంటి దేశాల్లో ఉత్పాదకతను తిరిగి పూర్వస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నారాయణమూర్తి తెలిపారు. అందుకోసం కార్పొరేట్ వర్గాలు వెంటనే వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి ఆఫీసులకు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 1940ల్లో జర్మనీయులు ఎలా పనిచేశారో అలా మనం కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. వారానికి ఆరు రోజులు, రోజుకి 16 గంటలు పనిచేసే వారని గుర్తుచేశారు. వేగంగా దూసుకెళ్తున్న చైనాను అందుకోవాలంటే అదొక్కటే మార్గమని సూచించారు.

దీర్ఘకాలంలో విధ్వంసకరం.. కునాల్‌ షా

నారాయణమూర్తితో పాటు ఇటీవల మరికొందరు కార్పొరేట్‌ దిగ్గజాలూ వర్క్‌ ఫ్రమ్‌ హోంపై ప్రతికూలంగా మాట్లాడారు. ఫిన్‌టెక్‌ సంస్థ క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా మాట్లాడుతూ.. ఇంటి నుంచి పనిచేయడం సౌకర్యంగా ఉన్నప్పటికీ.. ఈ సంస్కృతి విధ్వంసకరమైందని వ్యాఖ్యానించారు. ‘ఇంటి నుంచి పనిచేయడం అంటే పిల్లల్ని ఇంట్లో ఉండి చదువుకోనివ్వడం’ వంటిదేనని అభిప్రాయపడ్డారు. వాస్తవ బంధాలు, ఇతరులతో కలిసిపోయే తత్వం, నేర్చుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడాలు.. ఇలా ఏమీ ఉండవని తెలిపారు. దీర్ఘకాలంలో ఇది విధ్వంసకర సంస్కృతికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని