Infosys: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’పై ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం

ఇన్ఫోసిస్‌ ప్రస్తుతం అనుసరిస్తున్న హైబ్రిడ్‌ పని విధానాన్ని మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని తెలిపింది. ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని ఇప్పుడప్పుడే తప్పనిసరి చేయబోమంది.

Published : 14 Oct 2022 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఉద్యోగులకు కల్పించిన ‘ఇంటి నుంచి పని (Work From Home)’ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడప్పుడే ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయబోమని సీఈఓ సలీల్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము అవలంబిస్తున్న హైబ్రిడ్‌ పని విధానం (కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి) వల్ల ఎలాంటి ఇబ్బంది రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కచ్చితంగా ఇన్ని రోజులు ఆఫీసుకు రావాలని కూడా నియమం పెట్టబోమన్నారు.

ఇంటి నుంచి పని విధానంపై ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల స్పందన బాగుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లోని తమ ఆఫీసుల్లో ఏ సమయంలోనైనా 45 వేలకు తగ్గకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. పైగా ఇది క్రమంగా పెరుగుతోందన్నారు. అలాగే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. ఫలితంగా ఎక్కువ మంది ఆఫీసుకు రావడాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో క్లయింట్ల అవసరానికి అనుగుణంగా ఉద్యోగులు నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) నియమించుకుంటామని గతంలో ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఇందులో తొలి 6 నెలల్లోనే 40,000 నియామకాలు పూర్తి చేసింది. సెప్టెంబరు త్రైమాసికంలో నికరంగా ఉద్యోగుల సంఖ్య 10,032 మేర పెరిగింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,45,218కు చేరింది. వలసల రేటు 27.1 శాతానికి తగ్గింది. మూన్‌లైటింగ్‌ (ఒకేసారి రెండు కంపెనీలకు ఉద్యోగాలు చేయడం)కు తాము వ్యతిరేకమని ఇన్ఫోసిస్‌ మరోసారి స్పష్టం చేసింది. ఇలా చేస్తున్న కొంతమందిని గత 12 నెలల్లో తొలగించినట్లు తెలిపింది. తమ ఉద్యోగులందరూ కొత్త టెక్నాలజీలు నేర్చుకునే అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన బాధ్యతలకు తోడుగా, సంస్థలోనే గిగ్‌ అవకాశాలను అందించడం కోసం ‘యాక్సెలరేట్‌’ పేరుతో ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని