Insurance claim: బీమా క్లెయిమ్‌ను తిరస్కరించారా? తిరిగి అప్పీల్‌ చేయండిలా..

Insurance claim rejection: మీ బీమా క్లెయింను తిరస్కరణకు గురైందా? చింతించాల్సిన అవసరం లేదు. తిరిగి అప్పీల్‌ చేయడానికి అనేక మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.

Published : 22 Apr 2023 12:33 IST

Insurance claim rejection | ఇంటర్నెట్‌ డెస్క్‌:  భవిష్యత్తులో ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు మనతో పాటు మన కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించేందుకు బీమా (Insurance) సహాయపడుతుంది. ఒకప్పుడు బీమా అంటే చాలా మంది డబ్బులు వృథా అనుకునేవారు. ఈ మధ్య పరిస్థితి మారింది. బీమా ప్రయోజనాల పట్ల అవగాహన పెరిగింది. అయితే బీమా పాలసీని తీసుకోవడం దగ్గరి నుంచి క్లెయిమ్‌ చేసుకొనే వరకూ చాలా ప్రాసెస్‌ ఉంటుంది. మీకు ఏదైనా సమస్య వచ్చి బీమాను క్లెయిమ్‌ చేసుకోవాలనుకుంటే.. వివిధ కారణాల వల్ల క్లెయిమ్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలు ఎదురైతే ఏం చేయాలి? తిరస్కరించిన క్లెయిమ్‌ను తిరిగి పొందగలమా?

ఉదాహరణకు.. ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని కుటుంబ సభ్యులకు బీమా కంపెనీ రూ.15 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంది. మొత్తం డబ్బును అతను మరణించిన 45 రోజుల్లోనే చెల్లించాలి. కానీ సదరు కంపెనీ పాలసీదారుని క్లెయింను తిరస్కరించింది. గడువు ముగిశాక దరఖాస్తు నమోదు చేసుకున్నారని కారణం చూపించింది. కుటుంబ సభ్యులకు అప్పీల్‌ చేసే విధానం తెలియకపోవటం, దానికున్న నిబంధనలు సరిగ్గా అర్థం చేసుకోకపోవటంతో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకనే  పాలసీదారులు తమ హక్కులను తెలుసుకోవాలి. ఒక వేళ బీమాను తిరస్కరిస్తే ఫిర్యాదును లేవనెత్తగలగాలి. క్లెయిమ్‌ తిరస్కరించిన సందర్భాల్లో పాలసీదారులు లేదా నామినీలు వివిధ ప్రత్యామ్నాయ మార్గాల్లో క్లెయిమ్‌ పొందే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం. 

అధికారిని ఆశ్రయించడం

బీమా సంస్థపై మీకు ఏదైనా ఫిర్యాదు ఉంటే.. ముందుగా మీరు బీమా తీసుకున్న సంస్థను సంప్రదించాలి. అక్కడున్న గ్రీవెన్స్ ఆఫీసర్‌ని కలిసి మీ బీమా తిరస్కరణకు గల కారణం, వివరాలను అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ ఫిర్యాదు చేయాలనుకుంటే లిఖిత పూర్వకంగా సంబంధిత పత్రాలతో లేఖను అందజేయాలి.

ఐఆర్‌డీఏఐ..

బీమా ఫిర్యాదుల కోసం ‘ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI)’ పటిష్ఠమైన యంత్రాంగాన్ని తయారు చేసింది. మీకు గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ఇచ్చిన సమాధానంతో సంతృప్తిగా లేకపోతే ఐఆర్‌డీఏఐ సెల్‌ను సంప్రదించవచ్చు. ఐఆర్‌డీఏఐ గ్రీవెన్స్‌ కాల్‌ సెంటర్‌, ఐఆర్‌డీఏఐ కస్టమర్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అందులో మీ ఫిర్యాదు స్టేటస్‌ కూడా చెక్‌ చేసుకోవచ్చు.

అంబుడ్స్‌మన్‌..

మీ ఫిర్యాదుకు సంస్థ స్పందిచకపోయినా, పరిష్కారం చూపకపోయినా, ఇచ్చిన పరిష్కారంతో సంతృప్తి చెందకపోయినా పాలసీదారులే ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌ వద్దకు వెళ్లవచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్ స్కీమ్‌లను వ్యక్తిగత పాలసీదారులు వారి ఫిర్యాదులను తక్కువ ఖర్చుతో, నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 17 ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌లు ఉన్నాయి. బీమా హామీ మొత్తం కోసం చట్టపరమైన వారసులు, నామినీగా ఉన్న వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారు పేరు, చిరునామా, ఇన్సూరెన్స్‌ కంపెనీ కార్యాలయం పేరు అవసరమైన వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుకు సంబంధించి ఏవైనా మద్దతు పత్రాలు ఉంటే వాటిని కూడా జత చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని