విదేశానికి వెళ్లండి... ధీమాగా!

చాలామంది విద్యార్థులకు ప్రయాణ బీమా తీసుకునే విషయంలో కొంత అయోమయం ఉంటుంది. మరి ఈ విషయంలో ఏం చేయాలి?

Published : 20 Dec 2020 19:58 IST

విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలని చాలామంది కల. దీన్ని నెరవేర్చుకునేందుకు అన్ని విధాలా సన్నాహాలు పూర్తి చేసుకుంటారు. ఇలాంటి సమయంలో ఒక రకమైన భావోద్వేగం కూడా ఉంటుంది. కొత్త దేశం, విభన్న అలవాట్లు, నూతన స్నేహితులు ఇలా అన్ని విషయాల్లోనూ మార్పులు సహజం. విమాన టిక్కెట్లు తీసుకోవడం, ఫీజుల చెల్లింపులు అన్నీ పూర్తయినా… చాలామంది విద్యార్థులకు ప్రయాణ బీమా తీసుకునే విషయంలో కొంత అయోమయం ఉంటుంది. మరి ఈ విషయంలో ఏం చేయాలి? విదేశీ విశ్వవిద్యాలయాలు తమ దగ్గర చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ఆరోగ్య బీమాను తప్పనిసరి చేశాయి. విద్యాభ్యాసం ముగిసేంత వరకూ ఈ బీమా పాలసీ కొనసాగాల్సిందే. చాలా యూనివర్సిటీలు ఈ పాలసీ లేకుండా ప్రవేశానికి కూడా అనుమతించవు. సాధారణంగా కొన్ని అవసరాలకు తగిన పాలసీ తీసుకుంటే సరిపోతుందని అవి చెబుతుంటాయి. దీన్ని అక్కడికి వెళ్లిన తర్వాతగానీ, లేదా స్వదేశంలోగానీ తీసుకోవచ్చు. అయితే, పూర్తిస్థాయి బీమా పాలసీ తీసుకోవడమే ఎప్పుడూ విద్యార్థులకు మంచిది. దీనివల్ల అటు నిబంధనలు పాటించడంతోపాటు, ఇటు వ్యక్తిగతంగానూ ఆర్థిక భద్రత లభిస్తుంది.

ప్రయాణ బీమా పాలసీ తీసుకునేప్పుడు చాలా విషయాలను పరిగణనలోనికి తీసుకోవాలి. అదే సమయంలో ఈ పాలసీలపై బోలెడు అపోహలు కూడా ఉంటాయి. వీటన్నింటికి సమాధానాలు తెలుసుకుంటే పాలసీ అందించే ప్రయోజనాలపై పూర్తి అవగాహన వస్తుంది.
మన దేశంలో తీసుకున్న పాలసీ విదేశాల్లో చెల్లదా? విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి, అక్కడికి వెళ్లిన తర్వాతే బీమా పాలసీ తీసుకోవాలని భావిస్తుంటారు చాలామంది. ఇది కేవలం అపోహ మాత్రమే. భారత దేశంలో తీసుకున్న బీమా పాలసీని కూడా ప్రపంచంలోని అన్ని దేశాల యూనివర్సిటీలు అంగీకరిస్తాయి. పైగా అక్కడికి వెళ్లి తీసుకున్నప్పుడు చెల్లించే ప్రీమియంలో మూడో వంతులోనే ఇక్కడ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ పాలసీ తీసుకున్నప్పుడు భారత దేశ కరెన్సీలోనే ప్రీమియం చెల్లిస్తారు. కానీ, ఇచ్చే పరిహారం మీరు వెళ్లిన దేశ కరెన్సీలోనే ఇస్తారు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఈ పాలసీల విషయంలో విశ్వవిద్యాలయం ఏదైనా ప్రత్యేక నిబంధనలు విధించిందా అనేది చూడాలి.

నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుందా?

మన దేశంలో బీమా పాలసీ తీసుకున్నప్పుడు విదేశీ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందుతుందా లేదా అనేది చాలామందికి అనుమానం. ఇలాంటి సందేహం అక్కర్లేదు. విద్యార్థులు తమ దగ్గరున్న వైద్య బీమా కార్డులను నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో చూపించి, నిరంభ్యంతరంగా నగదు రహిత చికిత్సను అందుకోవచ్చు. మన దేశంలోని బీమా కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత క్లెయిం సెటిల్‌మెంట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఇవి అక్కడి ఆసుపత్రులతో సంబంధాలు కలిగి ఉంటాయి. కాబట్టి, మన దేశంలో పాలసీ తీసుకున్నా, ప్రపంచంలో ఎక్కడైనా మెరుగైన చికిత్స పొందడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

క్లెయిం పరిష్కారంలో ఇబ్బంది?

క్లెయిం పరిష్కారం మన దేశంలో ఎలా ఉంటుందో విదేశాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. మీ దగ్గరున్న కార్డును సమర్పించడం ద్వారా నగదు రహిత చికిత్సను పొందే వీలుంటుంది. ఒకవేళ మీరు ముందుగా చికిత్స ఖర్చులను చెల్లించినా, దాన్ని తిరిగి పొందేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి, వివరాలు తెలియజేస్తే సరిపోతుంది. మీ దగ్గర్నుంచి అన్ని పత్రాలు అందిన వెంటనే మీ క్లెయింను పరిష్కరిస్తారు.

కేవలం ప్రయాణాల్లో మాత్రమే వర్తిస్తుందా?

సాధారణంగా ప్రయాణ బీమా అనగానే కేవలం ప్రయాణించేప్పుడు మాత్రమే వర్తిస్తుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. పూర్తిస్థాయిలో తీసుకున్న బీమా కేవలం ప్రయాణ సమయంలోనే కాదు… విదేశాల్లో ఉన్నన్ని రోజులూ భద్రత కల్పిస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విమానాశ్రయానికి వెళ్లింది మొదలు బీమా రక్షణ ప్రారంభం అవుతుంది. అదే విశ్వవిద్యాలయాల నుంచి తీసుకునే ఆరోగ్య బీమా పాలసీల్లో కేవలం వైద్య ఖర్చులు మాత్రమే లభిస్తాయి. కానీ, మన దేశంలో తీసుకునే పాలసీల్లో పూర్తి స్థాయిలో వైద్య ఖర్చులను చెల్లిస్తారు.

దీనికి అనుబంధంగా దంత చికిత్సలు, క్రీడల వల్ల అయ్యే గాయాల చికిత్సకు, మానసిక, నరాల బలహీనతలకు సంబంధించి చికిత్స తీసుకునేందుకూ పాలసీలను ఎంచుకోవచ్చు.
వైద్య చికిత్సలకే కాకుండా, లగేజీ, పాస్‌పోర్టు పోయిన సందర్భాల్లోనూ తగిన ఆర్థిక సహాయం అందుతుంది. అనారోగ్య పరిస్థితుల్లో ఒక సెమిస్టర్‌ను పూర్తి చేయలేకపోయినప్పుడు, ఆ సెమిస్టర్‌కు అయ్యే ఖర్చులను కూడా ఈ పాలసీల ద్వారా పొందేందుకు వీలుంటుంది. విద్యార్థులు తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు తల్లిదండ్రులు వారి దగ్గరకు వెళ్లడానికి ఖర్చులను కూడా చాలావరకు పాలసీలు భరిస్తున్నాయి.

పునరుద్ధరణ కష్టమా?

పాలసీని పునరుద్ధరించుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో మీ పాలసీ ప్రీమియాన్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల మీకు ఎంతో సమయం కలిసొస్తుంది.

విదేశాలకు వెళ్లేముందు మీ బీమా పాలసీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా సంబంధిత బీమా కంపెనీని సంప్రదించి తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి, మీరు విదేశాలకు వెళ్లే ముందే పూర్తిస్థాయి విద్యార్థి ప్రయాణ బీమా పాలసీని తీసుకోండి. నిశ్చింతగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని