మహిళలకు ధీమా..కాస్త ప్రత్యేకంగా!

నేటి మహిళలు కుటుంబ భారాన్ని పంచుకుంటున్ననప్పటికీ బీమా విషయంలో పూర్తి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు

Published : 26 Dec 2020 14:01 IST

భారతీయులు సహజంగా పొదుపరులు. తమకు ఏ అత్యవసరం వచ్చినా తాము పొదుపు చేసిన డబ్బు తమను ఆదుకుంటుందనే నమ్మకంతోనే ఉంటారు. కాలంతోపాటు ఈ నమ్మకం మారుతోంది. పొదుపుతోపాటు పెట్టుబడులూ ఉండాలనీ అనుకుంటున్నారు. అనుకోని కష్టం వచ్చినప్పుడు బీమా పాలసీలు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడతాయని నమ్ముతున్నారు. నేటి మహిళలూ…పురుషులతోపాటు కుటుంబ భారాన్ని పంచుకుంటున్నారు. అయినప్పటికీ బీమా విషయంలో వారు పూర్తి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కుటుంబంలో దంపతులిద్దరూ ఆర్జిస్తున్నా… బీమా పాలసీలు సాధారణంగా మగవారే తీసుకుంటారు. చివరకు… భర్తకన్నా భార్య అధికంగా ఆర్జిస్తున్నా సరే. బీమా రంగం నివేదికల ప్రకారం కేవలం 20-30% మంది మహిళలకే బీమా పాలసీలు ఉన్నాయి. ఉద్యోగం/వ్యాపారం నిర్వహిస్తున్న మహిళలైనా… గృహిణిగా ఇంటిని నిర్వహిస్తున్నవారైనా… మహిళలకూ కొన్ని బీమా పాలసీలు అవసరం. అందుకోసం ముందుగా వాటి గురించి అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకోగలరు.

ప్రమాదంలో అండగా…

ఇంట్లో ఉన్నా… ప్రయాణం చేస్తున్నా… ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. ఇది ఏ క్షణంలో… ఏ రూపంలో వస్తుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే… ప్రతి మహిళకూ వ్యక్తిగత ప్రమాద బీమా తప్పనిసరిగా ఉండాలి. ఈ పాలసీ ఉంటే… అత్యవసరాల్లో ఎవరిమీదా ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రమాదంలో గాయపడినా, పాక్షిక లేదా శాశ్వత వైకల్యం సంక్రమించినప్పుడు ఈ పాలసీ పరిహారం ఇస్తుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి, అనుకోనిదేదైనా జరిగినప్పుడూ పాలసీ మొత్తం చెల్లిస్తారు. గృహరుణంలాంటివి ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రమాద బీమాతో ముడిపెట్టడం మంచి ఆలోచన.

వైద్య ఖర్చుల కోసం…

వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో కుటుంబం అందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా ఉండటం అత్యవసరం. ఒంటరిగా ఉండే మహిళలు ఈ బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణ బీమా ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు వైద్య చికిత్స, మందులు, వైద్యుల ఫీజులను చెల్లిస్తుంది. దీనికి అదనంగా మెటర్నిటీ బెనిఫిట్‌ పాలసీలను తీసుకోవచ్చు. ఈ తరహా పాలసీలకు కొంత వేచి ఉండే సమయం ఉంటుంది. మెటర్నిటీ బెనిఫిట్‌ పాలసీ తీసుకున్నప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అయ్యే వైద్య ఖర్చులను పాలసీ చెల్లిస్తుంది. కొన్ని పాలసీల్లో బిడ్డ పుట్టగానే తనకూ బీమా రక్షణ లభిస్తుంది. మరికొన్ని పాలసీల్లో కొన్ని టీకాల ఖర్చులనూ చెల్లిస్తారు.

తీవ్ర వ్యాధులు…

కొన్ని తీవ్ర వ్యాధులు మహిళలకు మాత్రమే వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అండాశయ, రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్లలాంటివి ఇటీవల కాలంలో మహిళల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. వీటి చికిత్సకు అధిక మొత్తంలో డబ్బు కావాలి. ఎవరికైనా ఇలాంటి తీవ్ర వ్యాధులు బయటపడినప్పుడు… కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలామంది వీటికి చికిత్స చేయించుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితులను నివారించాలంటే… తీవ్ర వ్యాధులు వచ్చినప్పుడు పరిహారం ఇచ్చే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలను తీసుకోవాలి. ఒకసారి వ్యాధిని గుర్తించగానే పాలసీ ద్వారా ఒకేసారి పరిహారం అందుతుంది. దీంతో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు. మిగిలిన డబ్బుతో రుణాలు తీర్చుకోవచ్చు. ఇంట్లో చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయించుకోవచ్చు.

వాహన బీమా

మహిళలు వాహనాలు నడపడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. అయితే, ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మహిళలు నడిపే వాహనాల బీమా అవసరాలు కొంత అదనపు ప్రయోజనాలతో ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని తరలించేందుకు ఏర్పాటు, రహదారిపై వాహనం నిలిచినప్పుడు సేవలు అందించేలా ‘రోడ్‌సైడ్‌ అసిస్టెంట్‌’ లాంటి రైడర్లను జోడించుకోవాలి. మహిళలు వాహనం నడిపేప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా బీమా కంపెనీని సంప్రదిస్తే చాలు. బీమా సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది.

వీటితోపాటు… గృహ బీమా పాలసీని కూడా తీసుకోవాలి. తరచుగా ప్రయాణాలు చేసేవారు ప్రయాణ బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్య సంబంధిత అత్యవసరాలు వచ్చినప్పుడు, వెంటతెచ్చుకున్న సామగ్రి పోయినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

పురుషులతో పోలిస్తే మహిళల బీమా అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి. బీమా పాలసీలు తీసుకునేప్పుడు ప్రత్యేకించి మీకు ఏం ఉపయోగమే తెలుసుకోవాలి. మీరు తీసుకోబోయే పాలసీలో అవన్నీ ఉన్నాయా లేదా చూసుకున్నాకే పాలసీని ఎంపిక చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు