Insurance: విద్యుత్తు ద్విచక్రవాహనాల బీమా ప్రీమియం పెరగనుందా?

ఇన్సూరెన్స్‌ కంపెనీలు విద్యుత్తు ద్విచక్రవాహనాల బీమా ప్రీమియంను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం....

Published : 13 May 2022 18:10 IST

ముంబయి: బీమా కంపెనీలు విద్యుత్తు ద్విచక్రవాహనాల ప్రీమియాలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాటరీలు, తయారీలో లోపాల కారణంగా జరిగే ప్రమాదాల వల్ల మరణాలు సంభవించినా లేక గాయాలపాలయినా ప్రస్తుత పాలసీల ప్రకారం బీమా చెల్లించాలి. అయితే, తయారీలో లోపం వల్ల ప్రమాదం సంభవించినట్లు తేలితే ఆ భారాన్ని వాహన తయారీ సంస్థలే భరించాల్సి ఉంటుంది.

బ్యాటరీల్లో మంటలు చెలరేగి ఇటీవల పలు వాహనాలు ప్రమాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొన్ని ఘటనల్లో వాహనదారులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఫలితంగా ఈవీల తయారీలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల కంపెనీలను హెచ్చరించారు. దీనిపై క్షుణ్నంగా అధ్యయనం చేసి లోపాలున్న వాహనాలను రీకాల్‌ చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకినోవ, ఓలా, ప్యూర్‌ ఈవీ పలు వాహనాలను రీకాల్‌ చేసిన విషయం తెలిసిందే. 

మంటలంటున్న ప్రమాదాలు సహా ఇతర సందర్భాల్లో విద్యుత్తు వాహనాల బీమా క్లెయింలను పరిశీలిస్తున్నామని డిజిట్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు మరిన్ని సంభవిస్తే ప్రీమియం పెంచే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రమాదాలకు సంబంధించి మరింత కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తే నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రస్తుతం ఉన్న పాలసీల ప్రకారం.. ఒకవేళ తయారీలో లోపం వల్ల ప్రమాదం సంభవిస్తే బీమా చెల్లింపు భారాన్ని తయారీ సంస్థలు భరించాల్సి ఉంటుందని బీమారంగ నిపుణుడు సంజయ్‌ దత్తా తెలిపారు. అయితే, ఈవీలకు ఇన్సూరెన్స్‌ తీసుకునే సమయంలోనే వ్యక్తిగత బీమా కవర్‌ను కూడా తీసుకోవాలని సూచించారు. అప్పుడు ఒకవేళ బ్యాటరీలో మంటలు చెలరేగడం వంటి తయారీ లోపాల వల్ల ప్రమాదం సంభవించినా బీమా సంస్థలే పరిహారం చెల్లిస్తాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని