Updated : 04 Aug 2022 17:46 IST

Insurance: బీమా, పెట్టుబడులను ఎందుకు కలపకూడదంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది ఆర్థిక ప్ర‌ణాళిక అంటే పెట్టుబ‌డులు అనుకుంటారు. కానీ నిజానికి ఇందులో ఆదాయం, ఖ‌ర్చులు, బ‌డ్జెట్ వేయ‌డం, రుణాల నిర్వ‌హ‌ణ‌, పెట్టుబడులు, బీమా ఇలా ప‌లు అంశాలు ఉంటాయి. బీమా, పెట్టుబ‌డులు రెండూ ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో కీల‌క‌మైన స్తంభాలు లాంటివి. అయితే ఇవి ఒకేరకంగా ఉండ‌వు. భిన్న ప్ర‌యోజ‌నాలు అందిస్తాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ ఒక‌దానితో మ‌రొక‌టి మూడిపెట్ట‌కూడ‌దు.

బీమా: ఏదైనా ఒక వ‌స్తువు, సేవ‌ను కొనుగోలు చేసేందుకుగానూ మ‌నం డ‌బ్బు ఖ‌ర్చు చేస్తుంటాం. ఇక్క‌డ మ‌నం ఇచ్చే డ‌బ్బుకు బ‌దులుగా వ‌స్తువు/సేవ పొందుతాం. అయితే, బీమాను కూడా డ‌బ్బుతో కొనుగోలు చేస్తున్నాం. కానీ ఇక్క‌డ వెంట‌నే ఆ వ‌స్తువు లేదా సేవ మ‌న‌కు చేర‌దు. కానీ మ‌నం ఊహించ‌లేని ప‌రిణామాల వ‌ల్ల భ‌విష్య‌త్‌ ఆర్థిక జీవ‌నం దెబ్బ‌తినకుండా బీమా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. దీని విలువ అలాంటి సంద‌ర్భాల్లో పాల‌సీదారునికి చేరుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. బీమా భ‌విష్య‌త్తు రిస్క్‌ని క‌వ‌ర్ చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ట‌ర్మ్‌ బీమా పాల‌సీని తీసుకుంటే.. ఇందులో బీమా తీసుకున్న వ్య‌క్తి పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణిస్తే అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు హామీ మొత్తం అందుతుంది. దీంతో వారి ఆర్థిక భ‌విష్య‌త్తును ప్లాన్ చేసుకోగ‌లుగుతారు.

పెట్టుబడులు: పెట్టుబ‌డులు అంటే.. మ‌నం పెట్టిన డ‌బ్బు తిరిగి డ‌బ్బును సంపాదించ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వ‌డ్డీ రూపంలో మ‌రికొంత మొత్తం మ‌న‌కు అందుతుంది. ఒక‌వేళ మ‌నం ఇదే మొత్తాన్ని పెట్టుబ‌డులు పెట్ట‌కుండా ఇంట్లోనే దాచిపెడితే దాని నుంచి డ‌బ్బు సంపాదించ‌లేము. అదీ కాక రోజు రోజుకి ఖ‌ర్చులు పెరిగి పోతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం మ‌నం రూ. 100తో ఒక వ‌స్తువును కొంటే.. అదే వ‌స్తువును ఇప్పుడు కొనుగోలు చేయ‌డానికి రూ. 107 కావాల్సి వ‌స్తుంది. మ‌న డ‌బ్బు మ‌న వ‌ద్దే దాచిపెట్ట‌డం వ‌ల్ల మ‌నం భ‌విష్య‌త్తులో ఆ వ‌స్తువును కొనుగోలు చేయ‌లేం. అందుకే పెట్టుబ‌డులు పెట్ట‌డం చాలా ముఖ్యం.

బీమా, పెట్టుబ‌డులు ఎందుకు క‌ల‌ప‌కూడ‌దు?

సాధారణంగా చాలా మంది 22-25 ఏళ్ల వయసులో సంపాదించ‌డం మొద‌లు పెడుతుంటారు. ప్ర‌తి నెలా కొంత మొత్తం ఆదా చేస్తుంటారు. కానీ ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలో తెలియ‌దు. అలాంటి స‌మ‌యంలో బీమా ఏజెంట్లు చెప్పే పాల‌సీలు, చూపించే లెక్కలు చాలా ఆక‌ర్ష‌ణీయంగా, అద్భుతంగా ఉంటాయి. ఎండోమెంట్‌, హోల్‌లైఫ్‌, మ‌నీబ్యాక్ పాల‌సీల గురించి వివ‌రించిన‌ప్పుడు.. బీమా క‌వ‌రేజ్‌తో పాటు, రాబ‌డి కూడా వ‌స్తుంద‌ని ఇలాంటి పాల‌సీని ఎంపిక చేసుకుంటుంటారు. కానీ నిజానికి ఇవి స‌రైన బీమా క‌వ‌రేజ్‌ను గానీ, పెట్టుబ‌డుల నుంచి స‌రైన రాబ‌డిని గానీ ఇవ్వ‌లేవు. బీమా ఏజెంట్లు వారికి వ‌చ్చే క‌మీష‌న్ల కోసం ఇలాంటి వాటిని కొనుగోలు చేయ‌మ‌ని స‌ల‌హా ఇస్తుంటారు.

ఉదాహ‌రణకు ఒక 30 సంవ‌త్స‌రాల వ్య‌క్తి (ధూమ‌పానం అలవాటు లేని) రూ. 1 కోటి హామీ మొత్తంతో 30 సంవ‌త్స‌రాల కాలానికి ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే అత‌ను వార్షికంగా దాదాపు రూ. 10 వేల ప్రీమియం చెల్లిస్తే స‌రిపోతుంది. అదే ఎండోమెంట్ ప్లాన్‌లో అదే బీమా హామీ మొత్తం పొందేందుకు ప్ర‌తీ సంవ‌త్స‌రం దాదాపు రూ. 1 ల‌క్ష ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

అదే మ‌రో విధంగా చూస్తే.. ఒక వ్య‌క్తి ఎండోమెంట్ ప్లాన్ కోసం రూ.20 వేలు చెల్లిస్తుంటే.. దాదాపు రూ. 15 ల‌క్ష‌ల హామీ మొత్తం ల‌భిస్తుంది. అదే రూ. 20 వేల‌తో ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే దాదాపు రూ. 2 కోట్ల వ‌ర‌కు హామీ మొత్తం ల‌భిస్తుంది.

బీమా తో పాటు రాబడి కూడా ఉంటుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. పైన ఉదాహ‌ర‌ణ‌లో వ్య‌క్తి రూ.1 ల‌క్ష ప్రీమియం నుంచి రూ. 10 వేలు ట‌ర్మ్ పాల‌సీ కోసం ఖ‌ర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని పెట్టుబ‌డులకు మ‌ళ్లిస్తే దాదాపు రూ.1 కోటి ట‌ర్మ్ పాల‌సీతో పాటు, పెట్టుబ‌డి పెట్టిన మొత్తం నుంచి 8 శాతం రాబ‌డి అంచ‌నాతో దాదాపు రూ. 1.12 కోట్లు కూడ‌బెట్ట‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి మార్కెట్ అనుసంధానిత పెట్టుబ‌డుల‌లో దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు పెట్టేవారు 10 నుంచి 12 శాతం రాబ‌డిని ఆశించవ‌చ్చు. ఒక‌వేళ 10 శాతం రాబ‌డి వ‌స్తే 1.70 కోట్లు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. అదే ఎండోమెంట్ పాల‌సీలో అయితే దాదాపు 4 నుంచి 6 శాతం రాబ‌డి మాత్ర‌మే ఆశించ‌గ‌ల‌ం. అంటే ఇవి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించి రాబ‌డిని ఇవ్వడం క‌ష్ట‌మే.

అందువ‌ల్ల బీమా, పెట్టుబ‌డులు రెండింటినీ క‌ల‌ప‌కూడ‌దు. ఇలాంటి ఎండోమెంట్, మ‌నీ బ్యాక్ పాల‌సీల బదులుగా జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీని తీసుకోవచ్చు. దీనిలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా హామీని పొందొచ్చు. ట‌ర్మ్ బీమా పాల‌సీ హామీ మొత్తం వార్షిక ఆదాయానికి 10-15 రేట్లు ఉండేటట్లు తీసుకోవాలి. పాల‌సీలో కచ్చితమైన వివరాలను తెలపాలి. 60 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు పాల‌సీని కొన‌సాగించాలి. మిగిలిన మొత్తాన్ని పెట్టుబ‌డుల కోసం కేటాయించ‌వ‌చ్చు.

రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డని వారు దీర్ఘ‌కాలం కోసం పీపీఎఫ్ వంటి ప‌థ‌కాల‌లో మదుపు చేయవచ్చు. రిస్క్ తీసుకోగ‌లిగే వారు నెల‌నెలా సిప్ ద్వారా ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. దీర్ఘ‌కాలంలో వీటి నుంచి 10-12 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. లేదా కొంత మొత్తాన్ని పీపీఎఫ్ వంటి న‌ష్ట‌భ‌యంలేని ప‌థ‌కాల‌లోనూ, మిగిలిన మొత్తాన్ని ఈక్వీటీ మ్యూచ్‌వ‌ల్ ఫండ్ల‌లోనూ ఉంచ‌వచ్చు. 

రాబడి ఎందుకు తక్కువ?

ఈ బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పాలసీలలో మోర్టాలిటీ, నిర్వహణ, అసెట్ అల్లోకేషన్ లాంటి ఇలా అనేక చార్జీలు ఉంటాయి. కాబట్టి, పెట్టుబడి పెట్టే మొత్తం తగ్గిపోతుంది. దీని వల్ల రాబడి ఫిక్సిడ్ డిపాజిట్ కంటే కూడా తక్కువగా ఉంటుంది.

చివ‌రిగా: కష్టపడి సంపాదించిన సొమ్ముకు విలువ ఇవ్వాలంటే సరైన పథ‌కాలను ఎంచుకోవాలి. మనకు ఉపయోగపడే ప‌థ‌కాల‌ గురించి తెలుసుకోవాలి. బీమా పాలసీలను ర‌క్ష‌ణ అందించే సాధ‌నాలుగానే చూడాలి. అంతేకానీ పెట్టుబడి కోణంలో చూడకూడదు. బీమాకి, పెట్టుబడికి వేరు వేరు లక్షణాలు, పద్ధతులు, అనుకూలతలు, ప్రతికూలతలు, నియమ నిబంధనలు ఉంటాయి. జీవిత బీమా కోసం టర్మ్ పాలసీ మాత్రమే తీసుకోవడం మంచిది. అవసరమైతే, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవ‌డంలో త‌ప్పులేదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని