Updated : 18 Feb 2022 14:24 IST

Rahul Bajaj: ‘హమారా.. రాహుల్‌ బజాజ్‌’.. ఆయనో ధిక్కారం!

మధ్యతరగతి కలలకు రెక్కలు తొడిగిన స్వాప్నికుడు... నిజాన్ని నిర్భీతిగా చెబుతూ ప్రభుత్వంలో చలనం తెప్పించిన ధైర్యశాలి... ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మార్గదర్శి... వెతుక్కుంటూ వచ్చిన పదవులకు వన్నెతెచ్చిన వ్యక్తి... ఆయనే రాహుల్‌ బజాజ్‌. ఈ మధ్యే కన్నుమూశారు. భారతీయ పరిశ్రమల రంగంలో చెరగని ముద్ర వేసిన ఆయన ఆసక్తికర జీవితాన్ని ఓసారి స్మరిద్దాం.

‘ఇతరుల్ని, నచ్చని విధానాల్ని పొగడటం నాకు చేత కాదు. నా పుట్టుకే అలాంటిది కాదు’ ముగ్గురు కేంద్ర మంత్రులున్న వేదికపై ప్రభుత్వ పాలసీలను నిరసిస్తూ ఇలా మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉంటుందా? దటీజ్‌ రాహుల్‌ బజాజ్‌. మొహమాటానికైనా నచ్చని పని చేయరాయన. తప్పును తప్పే అంటారు. ఎంత పెద్దవాళ్లనైనా నిలదీస్తారు. ఆటోమొబైల్‌ రంగంపై అత్యధిక పన్నుల్ని వ్యతిరేకిస్తూ ‘టాక్స్‌ టెర్రరిజం’ అనే పదం వాడారు. అదొక్కటే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, తన వ్యాపార సామ్రాజ్యం.. విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేవారు. తూటాల్లాంటి మాటలు విసిరినా.. మాట్లాడటం పూర్తైన వెంటనే ఆయన ముఖంలో దరహాసం కదలాడేది. అరవయ్యో దశకంలో కుటుంబ వ్యాపారంలోకి ప్రవేశించారాయన. ఆ రోజుల్లో పెద్ద వ్యాపారవేత్తలెవరూ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనేవారు కాదు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించే వారు కాదు. కానీ, రాహుల్‌ది మొదట్నుంచీ ధిక్కార స్వరమే. తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. 90వ దశకంలో కేంద్రం ఆర్థిక సంస్కరణలకు తెర తీస్తున్నప్పుడు ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. విదేశీయులకు గేట్లు బార్లా తెరవడమేంటని ప్రశ్నించారు. ఇది ఆర్థిక వ్యవస్థకు శరాఘాతమని ఆందోళన చెందారు. కానీ సంస్కరణల ఫలాలు అందుకున్న వ్యాపారవేత్తల్లో ఆయనే ముందున్నారు. తర్వాత తన ఆలోచన తప్పని ఒప్పుకున్నారు.

దూకుడు మంత్రం

ముప్ఫై ఏళ్ల వయసున్నప్పుడు బజాజ్‌ గ్రూప్‌తో రాహుల్‌ ప్రస్థానం మొదలైంది. 1972లో తండ్రి కమల్‌నయన్‌ బజాజ్‌ కన్నుమూయడంతో మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయ్యారు. అంతకుమందే ఆయన దిల్లీలోని స్టీఫెన్‌ కాలేజీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుంగు శిష్యుడైన జమ్నాలాల్‌, రాహుల్‌ తాత.. బజాజ్‌ సంస్థ వ్యవస్థాపకులు. రాహుల్‌ చేతికి పగ్గాలు అందగానే బీమా, ఫైనాన్స్‌, ఎలక్ట్రిక్‌ రంగాల్లోకి దూకుడుగా విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన జీవితంలో అత్యంత విజయవంతమైన ప్రాజెక్టు ‘చేతక్‌’. ఇటాలియన్‌ కంపెనీ పియాజియో వెస్పా స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. ఇది మధ్యతరగతికి ఒక కలల స్వప్నంలా మారింది. అప్పట్లో ఈ స్కూటర్‌ని సొంతం చేసుకోవడం సమాజంలో గౌరవంగా.. హోదాకి చిహ్నంలా భావించేవారు. ‘హమారా బజాజ్‌’.. అంటూ చేసిన ప్రచారం మధ్యతరగతి మనసులు గెల్చుకుంది. ఈ వాణిజ్య ప్రకటన రూపకల్పనలో రాహుల్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారంటారు. తర్వాత జపాన్‌ వాహన సంస్థ కవాసాకీతో జట్టు కట్టారు. మొత్తానికి తను పదవీవిరమణ చేసే సమయానికి ఏడున్నర కోట్ల సంస్థని 15 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మలిచారు. ప్రత్యర్థులను సైతం గౌరవించడం ఆయన నైజం. హీరో హోండా, హీరో మోటార్‌కార్ప్‌లు బజాజ్‌కి ప్రత్యర్థులు. ద్విచక్ర వాహన విభాగంలో అగ్రస్థానం కోసం నాలుగు దశాబ్దాలు పోటీ పడ్డాయి. ఎత్తుకు పైఎత్తులు వేసుకున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు రంగంలోకి దించుతున్నాయి. కానీ ఆ హీరో సంస్థ వ్యవస్థాపకుడు బ్రిజ్‌మోహన్‌లాల్‌ని తన గురువుగా చెప్పుకునేవారు బజాజ్‌. ‘మేం ఏళ్లుగా ప్రత్యర్థులం. మార్కెట్లో పట్టు కోసం వ్యూహాలు రచిస్తాం. కానీ వ్యక్తిగత విషయానికొస్తే స్నేహితుల్లాగే మెలిగేవాళ్లం’ అంటూ తమ మధ్య ఉండే అనుబంధం చాటుకునేవారు. వ్యాపారంలో ప్రత్యర్థులు ఉంటారే తప్ప శత్రువులు ఉండరని ఆయన భావన.

పుణెకి ప్రాణం పోశారు

పుణె ఇప్పుడు వాహన రంగానికి గుండెకాయలా మారింది. కానీ అప్పట్లో పెద్ద పరిశ్రమలు దిల్లీ, ముంబయి, చెన్నైలాంటి నగరాల్లోనే నెలకొల్పేవారు. బజాజ్‌ ఆటో ప్రారంభించే నాటికి పుణె చిన్న పట్టణమే. మౌలిక సదుపాయాలు సైతం పెద్దగా ఉండేవి కావు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావొద్దనే ఉద్దేశంతో తమ కుటుంబం, వ్యాపారాలు ముంబయిలోనే ఉన్నా.. ఆ నగరాన్ని కాదని పుణెలో పరిశ్రమ ప్రారంభించారు రాహుల్‌. ఉద్యోగుల కోసం స్కూళ్లు, ఆసుపత్రులు నిర్మించారు. కార్మికుల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల పిల్లలంతా అక్కడే చదువుకునేవారు. సంస్థలో ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారాయన. ఆరు దశాబ్దాల్లో అక్కడ ఒక్కసారి మాత్రమే ఉద్యోగులు విధులు బహిష్కరించారంటే ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బజాజ్‌ ఆటో ప్రారంభించిన తర్వాత దాన్ని అనుసరిస్తూ ఎన్నో దిగ్గజం కంపెనీలు పుణె బాట పట్టాయి. ప్రస్తుతం ఆ నగరం దేశంలోని పరిశ్రమల కేంద్రాల్లో ఒకటిగా మారిందంటే అది రాహుల్‌ చలవ, ముందుచూపే వల్లే.

ప్రభుత్వాన్ని ఎదిరించినా..

1970-71ల్లో దేశంలో ఏదైనా కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అనుమతుల కోసం ఏళ్లకొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి. అప్పట్లో వాహనాల ఉత్పత్తులను సైతం ప్రభుత్వమే నియంత్రించేది. ఈ జాప్యం, పెత్తనాన్ని తీవ్రంగా నిరసించేవారు. ప్రభుత్వ పెద్దలతో వాదించేవారు. ఇక ప్రతిసారీ బడ్జెట్‌ లోపాలపై నిర్మొహమాటంగా మాట్లాడేవారు. ఆయన కామెంటరీ కోసం వ్యాపారవర్గాలు ఆసక్తిగా ఎదురుచూసేవి. సర్కారు విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా ఆయనకున్న సమర్థత కారణంగా పదవులు వెతక్కుంటూ వచ్చేవి. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీకి (సీఐఐ) రెండుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు. దేశీయ వాహనల తయారీ సంస్థకి అధ్యక్షుడయ్యారు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కి ఛైర్మన్‌గా పని చేశారు. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కౌన్సిల్‌, దక్షిణాసియా అడ్వైజరీ బోర్డు, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లకు సలహాదారుగా పని చేశారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. పద్మభూషణ్‌ గౌరవం అందుకున్నారు.

వైఫల్యాలు..

రాహుల్‌ బజాజ్‌ ప్రస్థానంలో వైఫల్యాలూ లేకపోలేదు. 1980ల్లో జపాన్‌కి చెందిన హోండా కంపెనీ భాగస్వామ్యం కోసం బజాజ్‌తో సంప్రదించింది. కంపెనీలో వాటా ఇస్తే టెక్నాలజీ బదలాయిస్తాం. కలిసి పనిచేద్దాం అని అడిగింది. తమ కంపెనీలో విదేశీ సంస్థ వాటా, పెత్తనం ఉండటం రాహుల్‌కి రుచించలేదు. టెక్నాలజీ బదలాయింపునకు మాత్రమే అంగీకరించారు. దీంతో హోండా హీరోతో జట్టు కట్టింది. ఫోర్‌స్ట్రోక్‌ ఇంజిన్‌ టెక్నాలజీతో సంచలనం సృష్టించి, పదేళ్లలో ద్విచక్రవాహనాల్లో బజాజ్‌ని వెనక్కి నెట్టి అగ్రస్థానం చేరుకుంది. ఈ ఓటమిని ఆయన ఒప్పుకున్నారు. తర్వాత కాలంలో కంపెనీకి యువ రక్తం ఎక్కించాల్సిన అవసరం గుర్తించారు. తాను గౌరవంగా తప్పుకొని కొడుకు రాజీవ్‌ని డ్రైవర్‌ సీట్లో కూర్చోబెట్టారు. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని