Cadbury: మరో 4 ఏళ్లు.. ₹ 4వేల కోట్లు.. భారత్‌లో క్యాడ్‌బరి భారీ పెట్టుబడులు!

వ్యాపార విస్తరణలో భాగంగా రాబోయే నాలుగేళ్లలో క్యాడ్‌బరి (Cadbury) సంస్థ భారత్‌లో రూ. నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

Published : 21 Mar 2023 23:25 IST

దిల్లీ: ప్రముఖ చాక్లెట్‌ (Chocolate) తయారీ సంస్థ క్యాడ్‌బరి (Cadbury) మాతృసంస్థ మోండెలెజ్(Mondelez) భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వ్యాపార విస్తరణలో భాగంగా రాబోయే నాలుగేళ్లలో రూ. నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. కొత్తగా చాక్లెట్ తయారీ ప్లాంట్‌ల విస్తరణ, గిడ్డంగుల నిర్మాణం, రిఫ్రిజిరేట్‌ సౌకర్యాలను పెంచడం వంటి వాటి ద్వారా  క్యాడ్‌బరీ ఉత్పత్తులు దేశంలో మరింత మందికి చేరవేయాలని భావిస్తోంది. 

‘‘2023 నుంచి 2026 మధ్య కాలంలో భారత్‌లో రూ. నాలుగు వేల కోట్లు పెట్టుబడుల పెట్టనున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడం మాకెంతో సంతోషంగా ఉంది. గత నాలుగేళ్లలో సంస్థ భారత్‌లో పెట్టిన రూ.1,500 కోట్లు పెట్టుబడులకు ఇది అదనం. కొవిడ్‌ ప్రభావం చూపించినప్పటికీ, సంస్థ పెట్టుబడులను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. భారత్‌లో మా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు మద్దతుగా ఈ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం. ఒరియో బిస్కెట్స్‌ (Oreo Cookies), క్యాడ్‌బరి డైరీ మిల్క్‌ (Cadbury Dairy Milk), టోబ్లెరోన్ చాక్లెట్ల (Toblerone Chocolates) అమ్మకాల్లో భారత్‌ మాకు ముఖ్యమైంది. ఇకపై భారత్‌లో కంపెనీ పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉంటుంది ’’ అని మోండెలెజ్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా విభాగం ప్రెసిడెంట్‌ దీపక్‌ అయ్యర్‌ తెలిపారు.

2030 నాటికి  భారత్‌లో ఈ కంపెనీ వాణిజ్యం రెండు బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. వీటిలో ఎక్కువ శాతం వ్యాపారం క్యాడ్‌బరి డెయిరీ మిల్క్‌, 5 స్టార్‌, పెర్క్‌ బ్రాండ్‌ల ద్వారా జరుగుతుందని చెప్పారు. స్నాక్స్‌ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దిశగా మరిన్ని ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని