నెలనెలా ₹2,000తో... అర‌కోటి రాబ‌డి ఎలా?

పీపీఎఫ్‌లో నెలకు రూ.2000 చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా రూ .50 లక్షలకు పైగా ఎలా పొంద‌వ‌చ్చో..ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Updated : 10 Oct 2021 18:57 IST

ఒక మంచి పెట్టుబ‌డి సంతృప్తిక‌ర‌మైన రాబ‌డిని ఇస్తుందన‌డంలో సందేహం లేదు. వీలైనంత త్వ‌ర‌గా పెట్టుబడుల‌ను ప్రారంభించ‌డం ఎంత ముఖ్యమో, క్ర‌మ‌శిక్ష‌ణతో న‌డుచుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. స‌రిగ్గా ఇలాంటిదే ప్ర‌జా భ‌విష్య నిధి(ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌). ఈ ప‌థ‌కంలో పెట్టిన పెట్టుబ‌డులకు ఖ‌చ్చిత‌మైన రాబ‌డి ఉంటుంది. అందువ‌ల్ల స‌రైన కాల‌ప‌రిమితిని ఎంచుకుంటే పీపీఎఫ్ పెట్టుబ‌డులతో దీర్ఘకాలంలో మంచి రాబడులు ఆశించవచ్చు. 

ఉదాహరణకు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప‌థ‌కంలో ప్ర‌తీ నెల‌ రూ. 2,000 పెట్టుబడి పెట్టిన‌వారికి, దీర్ఘకాలికాలంలో వ‌చ్చే రాబ‌డి రూ.ల‌క్ష‌ల్లో ఉంటుంది. పీపీఎఫ్‌లో నెలకు రూ.2000 చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా రూ .50 లక్షలకు పైగా ఎలా పొందవచ్చనేది ఓ సారి చూద్దాం.

ఈ ప‌థ‌కం ప్ర‌స్తుతం అందించే వ‌డ్డీ రేటు 7.1 శాతం. ఏడాదికి క‌నీసం రూ.500, గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పీపీఎఫ్ ఖాతాలో జ‌మ‌ చేయ‌వ‌చ్చు. 15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పీరియ‌డ్ ఉంటుంది. మెచ్యూరిటీ గడువు పూర్తయిన తర్వాత డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. లేదా 5 సంవ‌త్స‌రాల చొప్పున, ఎన్ని సంవ‌త్స‌రాలైనా ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. 

నెల‌కు రూ.2000 చొప్పున పెట్ట‌బడితో రూ.52 ల‌క్ష‌ల ఎలా పొంద‌చ్చో చూద్దాం..
1. నెల‌కు రూ.2000 చొప్పున 15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ వ‌ర‌కు పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే మొత్తం..రూ.6,50,916 ఇందులో మీరు పెట్టుబ‌డి పెట్టిన మొత్తం రూ.3,60,000 అయితే, వ‌డ్డీ ఆదాయం..రూ.2,90,916. 

2. పీపీఎఫ్ మ‌రో 5 సంవ‌త్స‌రాలు కొన‌సాగిస్తే, నెల‌కు రూ. 2000 పెట్టుబ‌డితో మ‌రో ఐదేళ్ళ పూర్తయ్యే నాటికి పెట్టుబ‌డి పెట్టిన మొత్తం రూ.4,80,000, వ‌డ్డీ ఆదాయం.. రూ. 5,85,329. మొత్తం 20 సంవ‌త్స‌రాల‌కు వ‌చ్చే మెచ్యూరిటీ రూ.10,65,329.

3. ఈ ప‌థ‌కంలో ఇంకో ఐదేళ్లు(రెండోసారి) పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తే, పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తం రూ.16,49,286కి పెరుగుతుంది. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తం రూ.6 ల‌క్ష‌లు, మిగిలిన‌ది వ‌డ్డీ ఆదాయం.

4. మూడోసారి 5 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తే, మొత్తం పెట్టుబ‌డుల వ్య‌వ‌ధి 30 సంవ‌త్స‌రాలు అవుతుంది. అప్ప‌టికి పీపీఎఫ్ మొత్తం రూ.24,72,150.

5. నాలుగోసారి కూడా 5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి పెంచి, నెల‌కు రూ.2వేల చొప్పున పెట్టుబ‌డులు పెడితే 35 సంవ‌త్స‌రాలకు పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తం రూ.36,31,664 వస్తుంది. 

6. ఐద‌వ‌సారి ఐదేళ్ల కాల‌వ్య‌వ‌ధిని పెంచుకుంటే 40 సంవ‌త్స‌రాల‌కు రూ.52,65,554 వ‌స్తుంది. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 9,60,000 ఉంటే, వడ్డీ ఆదాయం రూ.43,05,554 ఉంటుంది. 

7. 20 సంవ‌త్స‌రాల వ‌య‌సులో నెల‌కు రూ. 2వేల చొప్పున పెట్టుబ‌డులు ప్రారంభిస్తే ప‌ద‌వీవిర‌మ‌ణ‌ వ‌య‌సు వచ్చేసరికి అర‌కోటి స‌మ‌కూర్చుకోవ‌చ్చు. అదే నెల‌కు రూ.1000 చొప్పున డిపాజిట్ చేస్తే 40 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి 26.32 లక్ష‌లు వ‌స్తుంది.

8. ఈ ప‌థ‌కం అనుమతించిన గరిష్ఠ ప‌రిమితి వ‌ర‌కు పెట్టుబ‌డితే.. అంటే ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల చొప్పున మెచ్యూరిటి పీరియడ్‌ 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తే రూ.40,68,208 మొత్తం చేతికి అందుతుంది. 

ఈ ప‌థ‌కానికి సంబంధించి కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు..
* ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేటు 7.1 శాతం. ఈ వ‌డ్డీ రేట్లు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అధిగమించడంలో స‌హాయపడతాయి. 
* ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ఉన్న ప‌థ‌కం కాబ‌ట్టి రిస్క్ ఉండదు. అందువ‌ల్ల‌ తక్కువ ప్రమాదం ఉన్న పెట్టుబడి మార్గాలను అన్వేషించే వారికి ఇది మంచి ఎంపిక.
* ఇందులో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. అయితే గడువు ముగియక ముందే డబ్బు అత్యవసరం వచ్చినప్పుడు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వీలుంది.
* పీపీఎఫ్ ఖాతాదారుడు ఏడేళ్ల తర్వాత ఏడాదికోసారి పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేసుకునే వీలుంది. 
* డబ్బు ఉపసంహరించుకుంటున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి నగదు నిల్వలో 50 శాతం (లేదా) సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి ముందు సంవత్సరం నాటి నగదు నిల్వలో 50 శాతం.. ఇందులో ఏది.. తక్కువ మొత్తమైతే .. అంత మేర ఉపసంహరించుకోవచ్చు.
* పీపీఎఫ్‌లో పెట్టుబడులు ప్రారంభించిన తర్వాత, ఖాతాను మొత్తంగా మూసివేసేందుకు అవకాశం ఉంది. కానీ, అందుకు తగిన కారణాలు ఉండాలి. ఉదాహరణ‌కు ఉన్నత విద్య, వైద్య చికిత్స వంటివి.  గడువు పూర్తికాకముందే ఖాతాను మూసివేస్తే 1 శాతం వడ్డీ తక్కువగా లభిస్తుంది. 
* ఖాతా తీసుకున్న మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకునే వీలుంది. రుణం తీసుకోవాలనుకుంటున్న సంవత్సరానికి ముందు రెండు సంవత్సరాల ఖాతా నిల్వలో 25 శాతం వరకు రుణంగా పొందచ్చు. ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 5 సంవత్సరం వరకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
* ప్ర‌స్తుతం ఉన్న ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై 'ఈఈఈ' ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది.

చివ‌రిగా..
ప్ర‌స్తుతం ఉన్న వ‌డ్డీ రేటు ప్ర‌కారం ఎంత కాల‌వ్య‌వ‌ధికి.. ఎంత మొత్తం.. స‌మ‌కూర్చుకోగ‌లం అనేది ఇక్క‌డ లెక్కించాం. వ‌డ్డీ రేట్ల‌ను త్రైమాసిక ప్రాతిప‌దిక‌న ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తుంది. అందువ‌ల్ల వ‌డ్డీ రేట్లు పెరిగితే వ‌చ్చే రాబ‌డి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. అదేవిధంగా త‌గ్గితే వ‌చ్చే మొత్తం కూడా త‌గ్గే అవ‌కాశం ఉంది. ఏదిఏమైనా చిన్న మొత్తంతో రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవాల‌నుకునే వారికి పీపీఎఫ్‌ మంచి ఎంపిక‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని