Updated : 18 Feb 2022 09:57 IST

Cryptocurrency: క్రిప్టోలో మదుపు ఇవన్నీ తెలుసుకున్నాకే

క్రిప్టో కరెన్సీపై వచ్చిన ఆదాయానికి పన్ను విధిస్తున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో ఈ డిజిటల్‌ ఆస్తులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా వీటిని నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కొంత మేరకు గ్రహించవచ్చు. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో స్పష్టత ఇప్పటికీ రాలేదు. రోజుకో కొత్త క్రిప్టో కరెన్సీలు వస్తున్న నేపథ్యంలో వీటిలో మదుపు చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలేమిటో చూడండి..

ఎంతోమందిని ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేర్చడంలోనూ.. పతనం చేయడంలోనూ క్రిప్టో కరెన్సీ కొద్ది కాలంగా కీలకంగా మారింది. ఉదాహరణకు 2021లో ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ రెండుసార్లు జీవిత కాల గరిష్ఠాలను తాకింది. మేలో ఒక్కో కాయిన్‌ విలువ రూ.51లక్షలకు చేరి, ఆ తర్వాత భారీగా తగ్గింది. మళ్లీ నవంబరులో రూ.54లక్షలకు వెళ్లింది. ఇప్పుడు రూ.35 లక్షల దరిదాపుల్లో ఉంది. బిట్‌కాయిన్‌ అతి పెద్ద క్రిప్టో కరెన్సీ కాబట్టి, దాని ధరల కదలికలు ఇతర క్రిప్టోలనూ ప్రభావితం చేస్తాయి. క్రిప్టో ఒక బుడగలాంటిదే అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ చాలామంది ఇందులో ఉన్న అవకాశాలను కోల్పోతున్నామనే భావనతో ఉంటున్నారు. మీరూ ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారా?

ఒక ఆస్తిగా.

ప్రస్తుతం మన దేశంలో క్రిప్టో కరెన్సీకి   చట్టబద్ధమైన ఆస్తిగా గుర్తింపు లేదు.. పెద్ద ఆర్థిక వ్యవస్థలేవీ వీటికి ఈ హోదా ఇవ్వలేదు. ఈ కాయిన్లు ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారతాయనే భావిస్తున్నాయి. మదుపరులు మాత్రం క్రిప్టోను ఒక పెట్టుబడి పథకంగానూ, చెల్లింపులకు ఉపయోగించేందుకూ వినియోగించొచ్చని అనుకుంటున్నారు. కొన్ని దేశాల్లో వ్యాపారులు క్రిప్టో చెల్లింపులను అంగీకరించడమూ ఇందుకు కారణం. నిజానికి క్రిప్టోకు ఒక ఆస్తిగా అంతర్లీన విలువ అంటూ ఏమీ ఉండదు. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత ద్వారా నడిచే ఈ ఊహాజనిత పెట్టుబడిలో.. వేరే వ్యక్తి మీరు పెట్టుబడి పెట్టినదానికన్నా ఎక్కువగా చెల్లిస్తారనే నమ్మకం తప్ప ఏమీ ఉండదు.

వీటిలో ట్రేడింగ్‌ చేయడానికి అందుబాటులో చాలా ఎక్స్ఛేంజీలు వచ్చాయి. వీటిలో నమోదు చేసుకొని, భారతీయ రూపాయలలో సొమ్మును బదిలీ చేసి, ట్రేడింగ్‌ ప్రారంభించవచ్చు. ఎంత సులభంగా మదుపు చేయొచ్చో.. అంతే జాగ్రత్త ఇక్కడ తప్పనిసరి.


సొంత పరిశోధన..

ఇప్పుడు వేల సంఖ్యలో క్రిప్టోలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైనదే. క్లిష్టత, అస్పష్టతతో ఉంటున్నాయి. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మీ శక్తి మేరకు వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకూ చదవండి. క్రిప్టో ఫోరమ్‌లలో పాల్గొనండి. ఏదైనా క్రిప్టో గురించి 100 శాతం నమ్మకమైన సమాచారం లేదు. కొన్ని క్రిప్టోలు మోసపూరితంగా ఉంటాయి. వీటిని గుర్తించడం తెలియాలి. నష్టాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటాయని ముందు తెలుసుకున్నాకే క్రిప్టో కరెన్సీల్లో మదుపు ప్రారంభించాలి.


ఎంత శాతం..

పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలి. మన ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడాలి. స్థిరాస్తులు, బంగారం, ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్‌లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్లు ఇలా మిశ్రమ పెట్టుబడులు ఉండాలి. జీవిత లక్ష్యాలు, నష్టభయాన్ని భరించే సామర్థ్యం, సంపాదన శక్తిని బట్టి, వేటిలో ఎంత మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. చిన్న మదుపరులు, మొదటిసారి మదుపును ప్రారంభిస్తున్న వారు క్రిప్టోలకు దూరంగా ఉండటమే మేలు. మీరు పెట్టుబడులకు కేటాయించే మొత్తంలో 1 శాతం వరకే క్రిప్టోలకు మళ్లించండి. పెట్టుబడి మొత్తం పెరుగుతున్న కొద్దీ నష్ట తీవ్రతా అధికంగానే ఉంటుందని గుర్తుంచుకోండి. 1 శాతం నష్టపోతే ఇతర పెట్టుబడులు దాన్ని భర్తీ చేసే వీలుంటుంది.


స్థిరంగా ఉండదు..

క్రిప్టో ఇప్పుడు రెండు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌. కొన్ని నెలలకోసారి ధరలలో గణనీయమైన హెచ్చుతగ్గులు సర్వసాధారణమయ్యాయి. అత్యంత అస్థిర ఆస్తులలో ఇదొకటి. చాలా క్రిప్టో కరెన్సీలను స్పెక్యులేటర్లే నడిపిస్తారు. కొన్ని రోజులకు ఈ చక్రం దెబ్బతింటుంది. అప్పుడు నష్టాలు తప్పవు. మీకు ఈ హెచ్చుతగ్గులు నచ్చకపోతే.. క్రిప్టో మీకు సరైన పెట్టుబడి పథకం కానే కాదు. మీరు ఈ ఒత్తిడిని భరించలేరు. మీ జీవితంలోని వివిధ దశల్లోని లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ఇది ఎంతమాత్రం సురక్షితం కాదు. ఈ ఊహాజనిత పెట్టుబడుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోవద్దు. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు రూ.5లక్షల వరకూ బీమా ఉంటుంది. క్రిప్టో కరెన్సీకి ఇలాంటి రక్షణలేమీ ఉండవు.


దురాశ వద్దు..

క్రిప్టో మార్కెట్లో ఎలాంటి నియమ నిబంధనలూ లేవు. ఇక్కడ డబ్బు రెట్టింపు కావడం ఎంత వేగమో.. అసలు కనిపించకుండా వెళ్లడమూ అలాగే ఉంటుంది. అత్యాశ, భయం ఇక్కడ పనికిరాదు. మీ డబ్బుకు 50శాతం రాబడి రావాలని మదుపు చేశారు.. ఆ లక్ష్యాన్ని సాధిస్తే.. వెంటనే బయటకు వచ్చేయాలి. ఎదురుచూస్తే లాభం వస్తుందా.. అసలు మొత్తం పోతుందా అనే విషయాల్లో ఎలాంటి హామీ ఇక్కడ దొరకదు. గతంలోలాగా ఇప్పుడు క్రిప్టోలో అంత లాభాలు కనిపించకపోవచ్చు. కొత్తగా ఈ మార్కెట్లోకి వస్తున్న వారు.. చిన్న కాయిన్లవైపు చూడాలి. ఇక్కడ ‘రిస్క్‌-రివార్డు’ అపారంగా ఉండొచ్చు.

ఏప్రిల్‌ 1 నుంచి క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై వచ్చిన లాభాలకు ఎలాంటి సర్దుబాటు లేకుండా 30శాతం పన్ను చెల్లించాలి. పన్ను ఎగవేయడానికి అక్రమ పద్ధతులను ఆశ్రయించకండి. దీనివల్ల కొత్త ఇబ్బందులు రావొచ్చు.


- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని