మదుపు చేసేందుకు మంచి మార్గమేది?

దీర్ఘకాలంలో సంపద వృద్ధి చెందాలంటే స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో పెట్టుబడి పెట్టడానికి నేరుగా షేర్లను ఎంచుకోవాలా? మ్యూచువల్‌ ఫండ్లు మేలా అనేది చాలామందికి ఉండే సందేహం.....

Updated : 02 Jan 2021 14:33 IST

దీర్ఘకాలంలో సంపద వృద్ధి చెందాలంటే స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో పెట్టుబడి పెట్టడానికి నేరుగా షేర్లను ఎంచుకోవాలా? మ్యూచువల్‌ ఫండ్లు మేలా అనేది చాలామందికి ఉండే సందేహం. మరి దీనికి సమాధానం ఏమిటో చూద్దామా! భవిష్యత్తు లక్ష్యాలను సాధించాలంటే మనం సంపాదిస్తున్న సొమ్మును క్రమానుగతంగా, క్రమశిక్షణతో మదుపు చేయాలి. దీనికి మార్కెట్లో మీ తరఫున మదుపు చేసే మ్యూచువల్‌ ఫండ్లు సహాయం చేస్తాయి. మీ పెట్టుబడిని వృద్ధి చేయడానికి వీటినే ఎందుకు ఎంచుకోవాలంటే…

మార్కెట్‌ నిపుణులు తోడుగా…

మార్కెట్లో కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. వీటిలో ఒక్కో దాన్నీ విడివిడిగా గమనించి, వాటి పనితీరును అంచనా వేస్తూ పెట్టుబడి పెట్టడం కష్టంతో కూడుకున్న పని. పైగా ఎంతో అవగాహన కావాలి. మార్కెట్‌ గురించి తెలుసుకుంటూ, ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలి. ఒక్కో రంగంలో ఏ కంపెనీ బాగుంది? దాని ఉత్పత్తులు, సేవలకు ఉన్న గిరాకీ, ముడి సరుకుల ధరలు, సంస్థల లాభనష్టాలు ఇలా అనేక విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కంపెనీల చరిత్ర, యాజమాన్యం, వారు ఎలా పనిచేస్తున్నారు? పోటీ వాతావరణంలో నెగ్గుకు వస్తున్నారా అనేదీ చూసుకోవాలి. ఆస్తి అప్పులు, నగదు నిల్వలు ఎలా ఉన్నాయో గమనించాలి. అప్పుడే లాభాలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే పెట్టుబడి నష్టపోయే ప్రమాదమూ ఉంది.

ఇక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల విషయానికి వస్తే… వీటిని మార్కెట్‌ లావాదేవీల్లో ఎంతో నైపుణ్యం ఉన్న నిపుణులు నిర్వహిస్తారు. వీరికి మార్కెట్‌ పరిస్థితులను బట్టి, ఎక్కడ మదుపు చేయాలి? ఏ సంస్థలను ఎంచుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి అనే విషయాల్లో పూర్తి అవగాహన ఉంటుంది. వీరి వెనుక అనేక మంది మార్కెట్‌ నిపుణులు ఎప్పటికప్పుడు మార్కెట్‌ను, కంపెనీల పరిస్థితులను విశ్లేషిస్తుంటారు. ఫండ్‌ మేనేజర్‌ నైపుణ్యం, అతని వెనక ఉన్న పరిశోధనా బృందం కలిసి మీ పెట్టుబడులను ఏయే కంపెనీల్లో పెట్టాలో నిర్ణయిస్తారు. అంతేకాకుండా, పెట్టుబడులను ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉంటూ, ఒక్కో షేరు ఎలా పనిచేస్తోందో తెలుసుకుంటూ ఉంటారు. ఇవన్నీ వ్యక్తిగత మదుపరులకు అంత తేలిక కాదనే చెప్పాలి.

సులభంగా మదుపు:

ఈక్విటీల్లో మదుపు చేసి, అందులో వచ్చే లాభాలను స్వీకరించాలంటే వ్యక్తులకు మార్కెట్‌ గురించి పూర్తి అవగాహన అక్కర్లేదు. మంచి పనితీరు ఉన్న ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, అందులో మదుపు చేయడం ప్రారంభిస్తే చాలు. ఒక్కో షేరులో మదుపు చేసి, అవి ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉండటం అంత తేలికైన విషయం కాదు. మదుపరులు మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొంటే చాలు. రోజువారీ మార్కెట్‌ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మదుపరులు చేయాల్సిందల్లా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ వెళ్లడమే. ఏయే కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలన్నది ఫండ్‌ మేనేజర్‌ చూసుకుంటారు. మీరు దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెడితే… మీరు అనుకుంటున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

తక్కువ మొత్తంతో వైవిధ్యంగా:

పెట్టుబడి మొత్తాన్ని ఒకే దగ్గర పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. వైవిధ్యంగా ఉన్నప్పుడే నష్టభయం తక్కువగా ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని మ్యూచువల్‌ ఫండ్లు కల్పిస్తాయి. ఒక ఫండ్‌ అనేక రంగాలు, కంపెనీల షేర్లలో మదుపు చేస్తుంది. ఫండ్లలో మదుపు చేయడానికి పెద్ద మొత్తంలో సొమ్ము కూడా అక్కర్లేదు. రూ.1,000తోనూ మదుపరులు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. పెద్ద కంపెనీల షేర్లను నేరుగా కొనాలంటే ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదనే చెప్పాలి. కానీ, చాలామంది డబ్బును ఒకచోట చేర్చి ఫండ్‌ మేనేజర్‌ ఈ సంస్థల్లో మీ తరఫున మదుపు చేస్తారు. అందువల్ల దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించే అవకాశం ఉంటుంది.

క్రమం తప్పకుండా:

మ్యూచువల్‌ ఫండ్లలో ఈక్విటీ పథకాలే కాకుండా… వైవిధ్యమైన ఫండ్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మన అవసరానికి తగిన ఫండ్లను ఎంచుకోవచ్చు. పైగా నెలనెలా నిర్ణీత మొత్తాన్ని వీటిల్లో మదుపు చేయడానికి కేటాయించవచ్చు. ఈ పద్ధతి షేర్లలో అంతగా కుదరకపోవచ్చు. ఫండ్‌ యూనిట్లను విక్రయించి, పెట్టుబడిని చాలా సులభంగా వెనక్కి తీసుకునే వీలుంది.

తక్కువ ఖర్చుతో:

షేర్లలో మదుపు చేయడానికి డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు అవసరం అవుతాయి. షేర్ల క్రయవిక్రయాల సమయంలో బ్రోకరేజీ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల లావాదేవీల ఖర్చు అధికం అవుతుంది. మదుపరులు తమ ఖాతాలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. డివిడెండ్లు వస్తున్నాయా చూసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో రుసుములు చాలా తక్కువగా ఉంటాయి. పైగా ఖర్చుల విషయంలోనూ నియంత్రణ ఉంది. డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తప్పనిసరేమీ కాదు.

మ్యూచువల్‌ ఫండ్లు మార్కెట్‌ ఆధారంగానే పనిచేస్తాయి. మార్కెట్‌ హెచ్చుతగ్గులను బట్టి లాభనష్టాలు ఉంటాయి. పెట్టుబడికీ, రాబడికీ ఎలాంటి హామీ ఉండదనే విషయాన్ని మర్చిపోకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని