కార్పొరేట్ ఎఫ్‌డీలో పెట్టుబ‌డి మంచిదేనా!

క‌ంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి అత్యంత ఆక‌ర్ష‌ణ అది ఇచ్చే వ‌డ్డీ రేటే.

Updated : 04 Mar 2022 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పోలి ఉంటుంది. బ్యాంకు క‌న్నా కూడా మెరుగైన రాబ‌డిని ఇస్తుంది. రిస్క్ అయితే కంపెనీని బ‌ట్టి ఉంటుంది. అయితే, కొన్ని కంపెనీలు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఆఫ‌ర్ చేస్తూ ఉంటాయి. ఆ కంపెనీల చ‌రిత్ర చూసి నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది. స‌రైన పొదుపు, పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు సంప‌ద పెర‌గ‌డానికి  ఇవి తొడ్ప‌డ‌తాయి. 

కొవిడ్ కారణంగా చాలా మంది హై-రిస్క్ పెట్టుబ‌డుల నుండి వైదొల‌గి.. త‌క్కువ రిస్క్ పెట్టుబ‌డుల‌కు వెళ్లాల‌ని ఆలోచిస్తున్నారు. త‌క్కువ రాబ‌డి ఇచ్చినా కూడా ప్ర‌మాణాలు బాగుండే ఆర్థిక సంస్థ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌ం ఇస్తున్నారు. ఈ రాబ‌డినిచ్చే వాటిలో బాండ్లు, డిబెంచ‌ర్లు, డిపాజిట్ల ప‌త్రాలు, డెట్ ఫండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొద‌లైన‌వి ఉంటాయి.

మీ డ‌బ్బుని బ్యాంకులో ఉంచ‌డం సుర‌క్షితం.. కానీ మీ సేవింగ్స్ ఖాతా మీకు కేవ‌లం 3% రాబ‌డిని మాత్రమే ఇస్తుంది. మీ పెట్టుబ‌డిని వైవిధ్య‌ప‌ర‌చ‌డానికి ఒక మార్గం బ్యాంక్, కార్పొరేట్ ఎఫ్‌డీలు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 5-5.5% రాబ‌డిని అందిస్తున్నాయి. అయితే, కార్పొరేట్ ఎఫ్‌డీలు త‌క్కువ రిస్క్ స్థాయిల‌ను కొన‌సాగిస్తూ అధిక రాబ‌డిని ఇచ్చేవి కూడా ఉన్నాయి. చాలా కార్పొరేట్ ఎఫ్‌డీలు రేటింగ్ అయినందున అధిక స్థాయి భ‌ద్ర‌తా స్థాయిని క‌లిగి ఉంటాయి. కార్పొరేట్‌లు 1 సంవ‌త్స‌రం నుంచి 5 సంవ‌త్స‌రాల డిపాజిట్‌కి 7.50%-9% వ‌ర‌కు కూడా రాబ‌డిని అందించేవి ఉన్నాయి.

రేటింగ్స్: కార్పొరేట్‌ ఎఫ్‌డీల విషయంలో  ముఖ్యంగా చూడాల్సింది వివిధ ప్ర‌ముఖ రేటింగ్ సంస్థ‌లు ఇచ్చిన రేటింగ్‌లు. ఈ ట‌ర్మ్ డిపాజిట్లు సాధార‌ణంగా ఇక్రా, కేర్‌, క్రిసిల్‌ మొద‌లైన కొన్ని రేటింగ్ ఏజెన్సీల ద్వారా వాటి విశ్వ‌స‌నీయ‌త కోసం రేట్ చేస్తారు. త‌క్కువ వ‌డ్డీ ఇచ్చినా ఎక్కువ కార్పొరేట్ ప్ర‌మాణాలు పాటించే కంపెనీల‌కు సాధార‌ణంగా ఏఏ నుంచి ఏఏఏ క్రెడిట్ రేటింగ్‌ని ఇస్తాయి. రేటింగ్ చార్ట్‌లో దిగువ‌కు వెళ్లినప్పుడు, డిపాజిట్ల‌కు భ‌ద్ర‌త స్థాయి తగ్గిన‌ట్టే. కార్పొరేట్ సంస్థ‌ నాణ్య‌త‌ను అంచ‌నా వేస్తున్న‌ప్పుడు గ్రూప్ ఉనికిలో ఉన్న సంవ‌త్స‌రాలు, కార్పొరేట్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌మాణాలు ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.

వ‌డ్డీ రేటు: క‌ంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి అత్యంత ఆక‌ర్ష‌ణ వ‌డ్డీ రేటే. కార్పొరేట్లు, ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకుల కంటే ఎక్కువ‌గా వ‌డ్డీ రేట్లు ఇవ్వ‌డానికి కార‌ణం త‌మ రుణ వ్యాపారం నుంచి బ్యాంకులు సంపాదించిన వాటి కంటే ఎక్కువ రాబ‌డిని పొందుతాయి. అందువ‌ల్ల ఈ లాభాల‌ను ఈ కంపెనీ డిపాజిట్ల‌దార్ల‌కు బ‌దిలీ చేయ‌గ‌ల‌వు.

డిపాజిటర్లూ ఇవి తెలుసుకోండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేక‌రించే ఆయా కంపెనీలు త‌మ వాటాదారుల‌కు రెగ్యుల‌ర్ డివిడెండ్‌ని చెల్లిస్తుందా లేదా తెలుసుకోవాలి. కంపెనీల బ్యాలెన్స్ షీట్ క‌నీసం 3 సంవ‌త్స‌రాల పాటు స్థిర‌మైన లాభాల‌ను చూపించాలి. కంపెనీ గ‌త 5 సంవ‌త్స‌రాల చరిత్ర ప‌రిశీలించాలి. ఈ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేశాయో లేదో నిర్ధారించుకోవాలి.

స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఉన్న కంపెనీలు సెబీ నియంత్రణలో ఉంటాయి. అన్ని పెట్టుబ‌డులు ఒకే దగ్గర పెట్టొద్దు. పెట్టుబ‌డులు విభిన్న‌మైన సెక్టార్‌లలో ఉండాలి. 1-2 సంవ‌త్స‌రాల‌కే డిపాజిట్ చేయండి. ఏటా స‌కాలంలో చెల్లింపుల ప‌నితీరును స‌మీక్షించండి. త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌లకు ప్ర‌భావితం అవ్వ‌కూడ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని