పోస్టాఫీస్‌ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

postal small saving schemes: ఇటీవల భారత పోస్టల్‌ విభాగం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పొదుపు పథకాల్లో చేస్తున్న పెట్టుబడి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోకి మళ్లకుండా పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మదుపర్ల నుంచి కొన్ని పత్రాల సేకరణను తప్పనిసరి చేసింది.

Published : 30 May 2023 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ రిస్క్‌, కచ్చితమైన రాబడి నేపథ్యంలో చాలా మంది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small Savings Schemes) మదుపు చేస్తుంటారు. అందులోనూ పెట్టుబడికి భద్రత ఉంటుందని భావించి పోస్టాఫీసు స్కీమ్‌లను ఎంచుకుంటుంటారు. మీరూ అలా చేస్తున్నారా? అయితే, ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లోని ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.

ఇటీవల భారత పోస్టల్‌ విభాగం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small Savings Schemes) రూ.10 లక్షలు ఆపై మదుపు చేసే వారి నుంచి కేవైసీ పత్రాలతో పాటు ఆదాయ ధ్రువీకరణ డాక్యుమెంట్లు తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించింది. మనీలాండరింగ్‌, ఉగ్రవాద చర్యలకు నిధుల మళ్లింపు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఉత్తర్వుల్లో మదుపర్లను మూడు కేటగిరీల కింద వర్గీకరించారు..

తక్కువ రిస్క్‌: ఖాతా తెరవడానికి లేదా క్రెడిట్‌ సర్టిఫికెట్ల కొనుగోలుకు లేదా పొదుపు సాధనాల గడువు ముగిసిన తర్వాత అందే మొత్తం లేదా అన్ని సేవింగ్స్‌ పథకాల్లో ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.50,000 దాటిన కస్టమర్లను తక్కువ రిస్క్‌ ఉన్నవారి కింద వర్గీకరించారు.

మీడియం రిస్క్‌: పైన తెలిపిన మొత్తం రూ.50,000 మించి రూ.10 లక్షల లోపు ఉంటే అలాంటి కస్టమర్లను మీడియం రిస్క్‌ కింద వర్గీకరించారు.

హై రిస్క్‌: ఒకవేళ పైన తెలిపిన మొత్తం రూ.10 లక్షలు దాటితే వారిని హై రిస్క్‌ కేటగిరీలో చేర్చారు. అలాగే రాజకీయాలతో సంబంధం ఉండి భారత్‌ వెలుపల నివసిస్తున్న కస్టమర్ల ఖాతాలను కూడా ఈ కేటగిరీ కిందే వర్గీకరించారు.

  • పైన పేర్కొన్న మూడు కేటగిరీల వారు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోగ్రాఫ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. జాయింట్‌ ఖాతా అయితే, అందరూ ఇవ్వాలి. గుర్తింపు ధ్రువీకరణ పత్రం కింద ఆధార్‌ (Aadhaar), పాన్‌ (PAN) సమర్పించాలి. చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్‌ లేదా పాన్‌ లేదా చిరునామా ఉన్న పాస్ట్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ గుర్తింపు కార్డు, యుటిలిటీ బిల్స్‌ వంటి వాటిని ఇవ్వొచ్చు. ఒకవేళ జాయింట్‌ అకౌంట్‌ అయితే, ఖాతాలో ఉన్నవారంతా పై పత్రాలను సమర్పించాలి. అన్ని డాక్యుమెంట్లను మదుపర్లు సెల్ఫ్‌ అటెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.
  • వీటితో పాటు హైరిస్క్‌ కేటగిరీలో ఉన్న కస్టమర్లు పెట్టుబడి పెడుతున్న ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో రుజువు చేసే పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీని కోసం బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌ ఖాతా స్టేట్‌మెంట్‌, ఐటీ రిటర్నులు, సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, వీలునామా, సక్సెషన్‌ సర్టిఫికెట్‌.. వీటిలో ఏవైనా ఇవ్వొచ్చు.

ఈ కింది సందర్భాల్లో ఆయా లావాదేవీలను పోస్టాఫీస్‌.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది..

  • నగదు లావాదేవీల మొత్తం రూ.10 లక్షలు దాటితే.
  • లావాదేవీ మొత్తం రూ.10 లక్షల కంటే తక్కువ ఉన్నప్పటికీ.. ఒక కేలండర్‌ నెలలో అన్ని లావాదేవీల మొత్తం రూ.10 లక్షలు దాటితే.
  • నగదు డిపాజిట్లలో నకిలీ కరెన్సీ లభించినా.. లేదా డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినట్లు తెలిసినా.
  • నగదు డిపాజిట్‌, ఉపసంహరణ, బదిలీ.. ఇలా ఖాతాకు సంబంధించిన యాక్టివిటీలలో ఏదైనా అనుమానం తలెత్తినా వెంటనే పోస్టాఫీసులు అలాంటి ఖాతాల గురించి ప్రభుత్వానికి నివేదిస్తాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని