Updated : 18 Apr 2022 11:42 IST

Save Tax: పిల్లల చదువుపై నెలకు ₹800 పన్ను ప్రయోజనం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల పేరిట పెట్టుబడి పెట్టడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. వారికి ఆర్థిక భరోసానివ్వడంతో పాటు పన్ను ప్రయోజనాలనూ పొందొచ్చు. అందుకే పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు పిల్లల పేరిట మదుపు చేయడంపైనా దృష్టి సారించాలి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన, సంప్రదాయ బీమా పథకాలు, కొన్నిరకాల మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం వల్ల పన్ను రాయితీ పొందడమేగాక పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.


పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌

పిల్లల వివాహం, విద్య వంటి పెద్ద ఖర్చుల కోసం పీపీఎఫ్‌లో మదుపు చేయడం ఉత్తమమైన మార్గాల్లో ఒకటని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. మైనర్‌ పిల్లల కోసం తల్లిదండ్రులు పీపీఎఫ్‌ ఖాతాను తెరవొచ్చు. అప్పటివరకు అది వారి సంరక్షణలోనే ఉంటుంది. ఒకసారి పిల్లల వయసు 18 ఏళ్లు దాటితే.. ఖాతా వారి పేరు మీదకు బదిలీ అవుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు వారి పేరిట కూడా పీపీఎఫ్‌ ఖాతాను నిర్వహిస్తుంటే.. పన్ను మినహాయింపు కోసం రెండింట్లో కలిపి చేసే మదుపు రూ.1.5 లక్షలు దాటొద్దు.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు కోసం మైనర్‌ పిల్లల పేరిట తల్లిదండ్రులిద్దరిలో ఎవరైనా ఒకరు పీపీఎఫ్‌ తెరవొచ్చు. దీనికి ఓ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం, సంరక్షకుడి పాన్‌ వంటి పత్రాలు అవసరం. పిల్లల వయసు 18 ఏళ్లు దాటితే.. ఖాతా వారి పేరు మీదకు మారిపోతుంది. వారిక సొంతంగా మదుపు చేయడం ప్రారంభించొచ్చు. ఒకవేళ పీపీఎఫ్‌ 15 ఏళ్ల కాలపరిమితి ముగిస్తే.. ప్రతి ఐదేళ్లకోసారి పొడిగింపు సౌలభ్యం ఉంటుంది.


సుకన్య సమృద్ధి యోజన

ఈ పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీరేటు 7.6 శాతంగా ఉంది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వారికి పదేళ్ల వయసు వచ్చే వరకు మాత్రమే సుకన్య సమృద్ధి ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంటుంది. పదో తరగతి పూర్తయిన తర్వాత లేదా బిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాత డబ్బును ఉపసంహరించుకోవచ్చు. లేదా వివాహ సమయంలోనూ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖాతా తెరిచిన 21 ఏళ్లు లేదా పెళ్లి సమయంలో ఖాతాను నిలిపివేస్తారు.


ట్యూషన్‌ ఫీజు వ్యయాలపై

సెక్షన్‌ 80సీ ప్రకారం.. ఇద్దరు పిల్లల కోసం చెల్లించే ట్యూషన్‌ ఫీజుపై గరిష్ఠంగా రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులైతే.. ప్రతినెలా ఒక్కో పిల్లవాడిపై రూ.100 ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ కింద, హాస్టల్‌ ఖర్చుల కింద నెలకు మరో రూ.300 మినహాయింపును కోరవచ్చు. గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. అంటే ఇద్దరు పిల్లలకు కలిపి నెలకు రూ.800 వరకు మినహాయింపు కోరే అవకాశం ఉంది. ఒకవేళ దంపతులిద్దరూ పన్ను చెల్లింపుదారులైతే.. ముగ్గురు పిల్లలకు కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. పిల్లలు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివితేనే మినహాయింపులు వర్తిస్తాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని