Investments: దీర్ఘ‌కాల పెట్టుబ‌డులకు 5 మార్గాలు

ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న స‌మ‌యం, న‌ష్ట‌భయం, లిక్విడిటీ వంటివి ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌గిన పెట్టుబ‌డుల‌ను ఎంపిక చేసుకోవాలి. 

Published : 05 Feb 2022 14:26 IST

దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేసేవారు అధిక రాబ‌డి వచ్చే పెట్టుబ‌డి మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. బ్యాంకు ఎఫ్‌డీల ద‌గ్గ‌ర నుంచి మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్వీటీల‌ వ‌ర‌కు అనేక పెట్టుబ‌డి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అంద‌రికీ ఒకే ర‌క‌మైన పెట్టుబ‌డులు స‌రిపడ‌వు. ఈక్వీటీల‌లో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. బ్యాంకు ఎఫ్‌డీల‌లో న‌ష్ట‌భ‌యం దాదాపు ఉండ‌దు. అలాగే వేరు వేరు వ్య‌క్తుల‌కు వేరు వేరు ఆర్థిక ల‌క్ష్యాలు ఉంటాయి. ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న స‌మ‌యం, లిక్విడిటీ అవ‌స‌రాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ అంశాల‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌గిన పెట్టుబ‌డుల‌ను ఎంపిక చేసుకోవాలి. 

దీర్ఘకాల పెట్టుబ‌డుల‌కు అనుకూలంగా ఉండే 5 పెట్టుబ‌డి మార్గాలు.. 
1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు..
ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే అధిక రాబ‌డినిచ్చే పెట్టుబ‌డి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ చాలా మంది సాంప్ర‌దాయ‌క పెట్టుబ‌డి మార్గమైన ఫిక్స్‌డ్ డిపాజిట్లనే ఎంచుకునేందుకు ఆశ‌క్తి చూపుతారు. కార‌ణం స్థిర‌త్వం. పెట్టుబ‌డులు సుర‌క్షితంగా ఉండ‌డంతో పాటు స్థిర‌మైన రాబ‌డిని అందిస్తాయి. వీటిని పున‌రుద్ధ‌రించ‌డ‌మూ సుల‌భ‌మే. బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు రెండూ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను వివిధ కాల‌ప‌రిమితుల‌కు ఆఫ‌ర్ చేస్తున్నాయి. వ‌డ్డీ రేట్లు బ్యాంక్‌, కాల‌ప‌రిమితుల‌పై ఆధార‌ప‌డి ఉంటాయి. ఎఫ్‌డీ కోసం ఆర్థిక సంస్థ‌లను ఎంచుకునేట‌ప్పుడు క్రిసెల్‌, కేర్ వంటి క్రెడిట్‌ రేటింగ్ ఏజ‌న్సీలు ఇచ్చే రేటింగ్‌ను ప‌రిశీలించి మంచి సంస్థ‌ను ఎంపిక చేసుకుంటే చాలా వ‌ర‌కు న‌ష్ట‌భ‌యం త‌గ్గించుకోవ‌చ్చు. 5 ఏళ్ళ బ్యాంకు డిపాజిట్ల పై పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి.

2. ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్‌)..
దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డులు పెట్టేవారు ఈ ప‌థ‌కం ద్వారా మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబ‌డులకు 15 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. 5 సంవ‌త్స‌రాల చొప్పున ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు కూడా. పీపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల ఉన్న‌ మ‌రో ప్ర‌యోజ‌నం లిక్విడిటీ. ఖాతా తెరిచిన 7వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమితిస్తారు. అలాగే, ఈఈఈ (మిన‌హాయింపు- మిన‌హాయింపు- మిన‌హాయింపు) ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. 

3. జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్‌)..
దీర్ఘ‌కాల పెట్టుబ‌డి మార్గాల కోసం చూస్తున్న పెట్టుబ‌డిదారుల‌కు ఎన్‌పీఎస్‌ మ‌రొక సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గం. ఈ ప‌థ‌కంలో చేరిన స‌భ్యులు చేసిన పెట్టుబ‌డులు ఈక్వీటి, డెట్ రెండింటికి కేటాయించ‌డం జ‌రుగుతుంది. చందాదారుడు ఆటో లేదా యాక్టీవ్ స్కీమ్‌ను ఆప్షన్ ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది. కొంత ఎక్కువ రిస్క్ తీసుకునే వారు, ఈక్వీటీల‌లో ఎక్కువ భాగం కేటాయించాల‌ని అనుకునేవారు యాక్టీవ్ మోడ్‌ని ఎంపిక చేసుకోవ‌చ్చు. ఆటో ఆప్షన్ లో పెట్టుబ‌డిదారుని వ‌య‌సు ఆధారంగా ఈక్విటీ, డెట్ లో పెట్టుబడులు పెడతారు. అలాగే, ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాల‌కు అనుమితి ఉంది. ఖాతా ప్రారంభించిన మూడేళ్ల త‌ర్వాత నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

4. మ్యూచువ‌ల్ ఫండ్లు..
దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌పై మంచి రాబ‌డిని పొందేందుకు మ్యూచువ‌ల్ ఫండ్లు స‌హాయ‌ప‌డతాయి. మార్కెట్ లింక్డ్ పెట్టుబ‌డుల‌లో న‌ష్ట‌భ‌యం ఉంటుంది. అనుభ‌వ‌జ్ఞులైన ఫండ్ మేనేజ‌ర్లు పెట్టుబ‌డిదారుల నుంచి డ‌బ్బు సేక‌రించి వివిధ రకాల షేర్లలో పెట్టుబడులు చేసి పోర్ట్‌ఫోలియోని వైవిధ్యంగా నిర్వ‌హిస్తారు. సిప్ విధానంలో నెల‌వారిగా డ‌బ్బును దీర్ఘ‌కాలం పాటు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం వ‌ల్ల మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. కొంత వరకు రిస్క్ తీసుకోగలిగే వారే ఇందులో మదుపు చేయాలి. 

5. డైరెక్ట్ ఈక్వీటీ..
డైరెక్ట్ ఈక్వీటీలో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. అయితే రిస్క్ ఎక్కువ‌గా ఉన్న‌చోటే రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది. ఇందులో పెట్టుబ‌డులకు క‌నీస వ్య‌వ‌ధి ఉండ‌దు. మార్కెట్లు స్వ‌ల్ప‌కాలంలో తీవ్ర ఒత్తికి లోన‌వుతూ ఉంటాయి. స్వ‌ల్ప‌కాలంలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయే ప్రమాదం ఉంది. దీర్ఘ‌కాలం మ‌దుపు చేయ‌డం వ‌ల్ల న‌ష్ట‌భ‌యం త‌గ్గించుకుని మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు. మార్కెట్ల‌పై స‌రైన అవ‌గాహ‌న ఉంటేనే వ్యక్తిగత షేర్లలో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిది. ఇందుకోసం సమయం, నైపుణ్యం ఎంతో అవసరం. నిపుణుల స‌ల‌హా, సూచ‌న‌ల‌ను అనుస‌రించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని