Published : 28 Jul 2022 11:40 IST

Investments: ఆర్థిక అనిశ్చితిలో అనువైన పెట్టుబడి సాధనాలివే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు మనం చేసే పెట్టుబడులపైనే భవిష్యత్తులో మనం అవసరాలను తీర్చే నగదు ఆధారపడి ఉంటుంది. రోజురోజుకీ కొత్త రూపును సంతరించుకుంటున్న జీవనశైలి.. నిత్యావసరాల వ్యయాలను అంతే వేగంగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో మన సొమ్మును సంరక్షిస్తూ.. సరిపడా రాబడినిచ్చే పథకాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ.. తక్కువ నష్టభయంతో మంచి రాబడినిచ్చే కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సరిగా మదుపు చేస్తే మీ పెట్టుబడి సంతృప్తికర స్థాయిలో వృద్ధి చెందే అవకాశం మెండుగా ఉంది. అదీ ఎలాంటి నష్టభయం లేకుండానే. పైగా మహమ్మారి సంక్షోభం, ఆర్థిక మాంద్యం, యుద్ధభయాలు, స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకుల వంటి పరిస్థితుల కారణంగా తలెత్తే ఆర్థిక అనిశ్చితులకు సైతం దూరం ఉండొచ్చు.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌: ప్రజా భ‌విష్య నిధి (PPF).. 100 శాతం న‌ష్టభ‌యం లేని పథకం. దీర్ఘకాల ల‌క్ష్యాల కోసం మ‌దుపు చేసే వారికి సరిగ్గా స‌రిపోతుంది. పెట్టుబ‌డుల‌కు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబ‌డి ఉంటుంది. అంతేకాకుండా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం ఒక ఆర్థిక సంవ‌త్సరంలో రూ.1.50 ల‌క్షల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్రయోజ‌నాల‌ను పొందొచ్చు. ప్రస్తుతం వార్షికంగా 7.10 శాతం వ‌డ్డీ అందిస్తోంది.

పీపీఎఫ్ ఖాతాకు 15 సంవ‌త్సరాల కాలపరిమితి ఉంటుంది. అయితే, 15 సంవ‌త్సరాల త‌ర్వాత కూడా ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లైనా ఖాతాను పొడిగించుకోవ‌చ్చు. మ‌దుప‌ర్లు తెలివిగా ఒక ప్రణాళిక ప్రకారం పీపీఎఫ్‌లో మ‌దుపు చేస్తే.. కాల‌ప‌రిమితి పొడిగింపు ప్రయోజ‌నాన్ని ఉప‌యోగించుకొని విత్‌డ్రా చేసుకునే స‌మ‌యానికి రూ.కోటి వరకు సమకూర్చుకునే అవకాశం ఉంది.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌: భారత పోస్టల్‌ శాఖ అందిస్తున్న పొదుపు బాండ్లే ఈ ఎన్‌ఎస్‌సీలు. వీటిలో చేసే పెట్టుబడులకు కూడా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కోరవచ్చు. ప్రస్తుతం వార్షిక వడ్డీరేటు 6.8 శాతంగా ఉంది. ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడి పెట్టడానికి గరిష్ఠ పరిమితి లేదు. అయితే, సంవత్సరానికి రూ.1.5 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. పెట్టుబడికి రక్షణతో పాటు కచ్చితమైన రాబడి అందుతుంది. అయితే, మెచ్యూరిటీ తర్వాత అందే మొత్తంపై మాత్రం పన్ను ఉంటుంది.

స్వచ్ఛంద భవిష్య నిధి (వీపీఎఫ్‌ ): సురక్షితమైన పథకాలను ఎంపిక చేసుకోవాలని అనుకుంటే ఈపీఎఫ్‌ (ఉద్యోగ భవిష్య నిధి), వీపీఎఫ్‌ని మించిన మార్గాలు లేవనే చెప్పాలి. ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనం కల్గించే పెట్టుబడి. వీపీఎఫ్‌లో 8.1శాతం వడ్డీ వస్తుంది. దీనికి ఎలాంటి పన్నూ ఉండదు. ప్రస్తుతం బ్యాంకులు 4-6.5శాతం వరకూ వడ్డీని అందిస్తున్న నేపథ్యంలో ఇందులో మదుపు చేయడం లాభదాయకమే. ఇందులో జమ చేసే మొత్తానికి సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు పన్ను మినహాయింపూ లభిస్తుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000కు మించి మదుపు చేసినప్పుడు.. ఆ పై మొత్తం మీద వచ్చే వడ్డీపై పన్ను భారం ఉంటుంది. అయితే, ఒకసారి ఈ ప్లాన్‌లో పెట్టుబడి ప్రారంభిస్తే ఐదు సంవత్సరాల వరకు కచ్చితంగా కొనసాగాలి.

లిక్విడ్ ఫండ్స్: ఇవి 91 రోజుల వరకు కాలపరిమితితో సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్స్ నుంచి ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ల సర్టిఫికెట్లు, కమర్షియల్ పేపర్లు మొదలైన మనీ మార్కెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు. తక్కువ రిస్క్ కలిగి ఉండే పెట్టుబడి సాధనాల్లో ఇదొకటి. లిక్విడ్ ఫండ్‌లు సేవింగ్స్ ఖాతా కంటే మెరుగైన రాబడిని అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కూడా ఎక్కువ రిటర్న్స్‌ వస్తాయి. పదేళ్ల రాబడి 6.41%-7.25% మధ్య ఉండే అవకాశం ఉంది. డబ్బును కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు మదుపు చేయొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) కోసం ఇండెక్సేషన్ ప్రయోజనం పొందవచ్చు.

బంగారం: భారతీయులకు చాలా ఇష్టమైన పెట్టుబడి మార్గం పసిడి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏమాత్రం డబ్బు ఆదా చేసిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కాస్త బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఆర్థిక అత్యవసరాల్లో దాన్ని విక్రయించి సొమ్ము చేసుకొంటారు. ముఖ్యంగా కొవిడ్‌ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, మార్కెట్‌ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం చాలా సురక్షితమైన పెట్టుబడి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. పసిడి పెట్టుబడి మూడేళ్ల వార్షిక వృద్ధి (CAGR) 11.4-12.8 శాతంగా ఉండడం అందరినీ ఆకర్షించే అంశం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని