Updated : 07 Jun 2022 11:48 IST

Inflation: మీ రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించాలంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా సరఫరా వ్యవస్థల్లో తలెత్తిన ఇబ్బందులతో పాటు ఇటీవలి భౌగోళిక రాజకీయ వివాదాలు అనేక కమొడిటీల కొరతకు దారితీశాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం తెరమీదకొచ్చింది. ధరలు పెరుగుతున్న కొద్దీ.. మదుపర్లకు అనేక అనుమానాలు తలెత్తుతుంటాయి. తాము చేస్తున్న పెట్టుబడి భవిష్యత్తు అవసరాలకు సరిపడా రాబడినిస్తుందా అనే ప్రశ్న తొలుస్తుంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? దాన్ని అధిగమించేలా మన పెట్టుబడి మార్గాలు ఎలా ఉండాలి?అనే విషయాలను చూద్దాం..

ద్రవ్యోల్బణం అంటే..

ద్రవ్యానికి ఉన్న వాస్తవ విలువ తగ్గుదలనే ద్రవ్యోల్బణంగా పేర్కొనవచ్చు. అంటే వస్తువులను కొనే సామర్థ్యం తగ్గిపోతుంది. ఉదాహరణకు 2012లో రూ.50కే వచ్చిన వస్తువులకు.. ఇప్పుడు రూ.100 వెచ్చించాల్సి వస్తోంది. అంటే పదేళ్లలో ద్రవ్యోల్బణం రెండింతలైందన్నమాట! సాధారణంగా ద్రవ్యోల్బణ లెక్కింపునకు టోకు ధరల సూచీ కంటే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ)నే పరిగణనలోకి తీసుకుంటారు. సీపీఐ స్థిరంగా పెరుగుతూ ఉంటే ద్రవ్యోల్బణం ఎగబాకినట్లుగా పరిగణిస్తారు.

ఇవి సురక్షితం..

మనం పెట్టే పెట్టుబడి ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడినిచ్చేలా ఉండాలి. రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ROI) అధికంగా ఉండే పెట్టుబడి మార్గాల్లో మాత్రమే మదుపు చేయాలి. స్థిరాస్తి, బంగారం వంటి పెట్టుబడి సాధనాలు ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పిస్తాయని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా వీటిలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. స్థిరాస్తిలో స్థానిక బ్రోకర్లు మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దగా డిమాండ్‌లేని ప్రాంతంలో కొనుగోలు చేయడం వల్ల రావాల్సిన రాబడి రాకపోవచ్చు. దీనికి బదులుగా రీట్స్‌లో మదుపు చేయడం ఉత్తమం.

బంగారంపై పెట్టుబడులను పంచాలి..

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చాలా మంది దీన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటారు. కానీ, ఈకాలంలో భౌతిక బంగారాన్ని కొనడం అంటే రిస్కుతో కూడుకున్న వ్యవహారమే. ముఖ్యంగా నకిలీల బెడద పెరిగిపోయింది. అందుకే పసిడిపై పెట్టుబడులను వివిధీకరించుకోవాలి. ఉదాహరణకు ప్రభుత్వ పసిడి బాండ్లను కేంద్ర సర్కార్‌ బాగా ప్రమోట్‌ చేస్తోంది. అలాగే డిజిటల్‌ గోల్డ్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ వంటి ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. 

ఇతర మార్గాలనూ చూడాలి..

స్థిరాస్తి, బంగారంతో పాటు చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో కూడా మదుపు చేస్తుంటారు. కానీ, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఇది అంత శ్రేష్ఠమైన మార్గం కాదని చెప్పొచ్చు. దీనికంటే కూడా మ్యూచువల్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, స్టాక్‌ మార్కెట్‌ ఇంకా మెరుగైన రాబడినిచ్చే అవకాశం ఉంది. అయితే, కనీసం ఐదేళ్ల కాలపరిమితితో వీటిలో మదుపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పైన తెలిపిన పెట్టుబడి సాధనాలే కాకుండా ఇతర మార్గాల్లోకి కూడా పెట్టుబడులను వివిధీకరించుకోగలిగితే.. వచ్చే రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. ఒక దాంట్లో వచ్చిన నష్టాలను మరోదాంట్లో వచ్చే అధిక లాభాలతో పూడ్చుకోవచ్చు. ఇలా మదుపర్లు తమ ముందున్న వివిధ మార్గాలను విశ్లేషించి తమ లక్ష్యానికి ఏది సరిపోతుందో చూసుకొని మదుపు చేయాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts