Investments: స్వ‌ల్ప‌కాలానికి రాబ‌డినిచ్చే పెట్టుబ‌డి ప‌థ‌కాలివే..

స్వ‌ల్ప కాలానికి పెట్టుబడి పెట్టే మదుపర్లకు అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాలను ఇప్పుడు చూద్దాం. 

Updated : 23 Nov 2022 10:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త‌మ అవ‌స‌రాల కంటే ఎక్కువ న‌గ‌దు నిల్వ‌లు ఉన్న‌వారెవరైనా అధిక వ‌డ్డీ వ‌చ్చే ఏదో ఒక పొదుపు ప‌థ‌కంలో గానీ, మార్కెట్ సాధ‌నాల్లో గానీ మ‌దుపు చేయ‌డం స‌హ‌జం. అయితే దీర్ఘకాల పెట్టుబడుల్లో మెచ్యూరిటీకి ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు పీపీఎఫ్‌లో మ‌దుపు చేస్తే కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో త‌ప్ప,15 సంవ‌త్స‌రాలు వేచి చూడాలి. కిసాన్ వికాస్ ప‌త్ర విషయంలోనూ అంతే. ఈక్విటీ మార్కెట్లలో కూడా అధిక స‌మ‌యం వేచిచూస్తేనే లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.  స్వ‌ల్ప కాలానికి నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అయితే వడ్డీ రాబ‌డి త‌క్కువ వ‌చ్చినా ప‌ర్వాలేదు, స్వ‌ల్ప కాలానికే న‌గ‌దు అవ‌స‌రం ప‌డే పెట్టుబ‌డిదారుల‌కు కొన్ని పెట్టుబ‌డి సాధ‌నాలు లేక‌పోలేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

భార‌త్‌లో ఎక్కువ మంది డ‌బ్బు దాచుకునేది, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేది బ్యాంకుల్లోనే. అధిక భ‌ద్ర‌త‌తో కూడిన స్థిర రాబ‌డి కోసం చూస్తున్న‌ట్ల‌యితే బ్యాంకు డిపాజిట్ల‌లో మ‌దుపు చేయ‌డం కూడా మంచిదే. ఈ డిపాజిట్లు 10 ఏళ్ల కాల వ్య‌వ‌ధి వ‌ర‌కు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ.. 7 రోజుల నుంచి 365 రోజుల వ‌ర‌కు కూడా స్వ‌ల్ప కాలానికి డిపాజిట్‌ను చేయొచ్చు. ప్ర‌ముఖ బ్యాంకులు ఏడాది డిపాజిట్‌కు 5.5% వ‌ర‌కు వ‌డ్డీ ఇస్తున్నాయి. బ్యాంకులో ఎక్కువ కాలానికి డిపాజిట్లు చేసినా కూడా.. నిధులు అవ‌స‌రం ప‌డితే మ‌ధ్య‌లోనే డిపాజిట్‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. వ‌డ్డీలో జ‌రిమానా ఉంటుంది. అంతేకాకుండా అన్ని ర‌కాల బ్యాంకుల్లోనూ రూ.5 ల‌క్ష‌ల డిపాజిట్ల‌ వ‌ర‌కు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ (DICGC) క‌వ‌ర్ కింద ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ బీమాతో బ్యాంకు డిపాజిట్ల‌కు మ‌రింత భ‌ద్ర‌త ఉంటుంది. స్వ‌ల్ప కాలానికి బ్యాంకు ఎఫ్‌డీలు చాలా అనుకూలంగా ఉంటాయి.

పోస్ట్ ఆఫీసు టైమ్ డిపాజిట్

మీ పెట్టుబ‌డికి, వ‌డ్డీ రాబ‌డికి హామీ ఉండే వాటిలో పోస్టాఫీసు డిపాజిట్ల‌ను ప్ర‌ముఖంగా చెప్ప‌వ‌చ్చు. ఈ పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లలో 1,2,3,5 ఏళ్ల కాల వ్య‌వ‌ధితో డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. 10 సంవ‌త్స‌రాలు వ‌య‌స్సు దాటిన వారు ఎవ‌రైనా ఒక సంవ‌త్స‌రం (దీనికి వ‌డ్డీ 5.5% శాతంగా ఉంది) స్వ‌ల్ప‌కాలానికి కూడా పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్‌లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. డిపాజిట్ ప్రారంభించిన తేదీ నుంచి 6 నెల‌ల త‌ర్వాత మాత్ర‌మే డిపాజిట్‌ను ఉప‌సంహ‌రించుకునే వీలుంది. అయితే వ‌డ్డీ రాబ‌డిలో జ‌రిమానా ఉంటుంది.

డెట్ ఫండ్లు

ఈక్విటీ ఫండ్లు కాకుండా డెట్ ఫండ్ల‌లో స్వ‌ల్ప కాలానికి మ‌దుపు చేయ‌డం మంచిదే. రిస్క్ కూడా త‌క్కువ ఉంటుంది. డెట్ ఫండ్ల‌లో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధికి మెచ్యూర్ అయ్యేవి కూడా ఉన్నాయి. ఓవ‌ర్‌నైట్ ఫండ్లు, లిక్విడ్ ఫండ్లు, అల్ట్రా-షార్ట్ డ్యూరేష‌న్ ఫండ్లు, లో డ్యూరేష‌న్ ఫండ్లు, మ‌నీ మార్కెట్ ఫండ్ల‌ను పెట్టుబ‌డికి ఎంచుకోవ‌చ్చు. వీటిలో మీరు 3 నెల‌ల‌ నుంచి ఒక సంవ‌త్స‌రం వ‌ర‌కు ఫండ్ల కాల వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌చ్చు. ఈ కేట‌గిరీలో ఉన్న ఫండ్లు 3 నెల‌లు, 6 నెలలు, 9 నెల‌లు, 12 నెల‌ల్లో మెచ్యూరిటీని క‌లిగి ఉంటాయి. మీరు వీటి ద్వారా న‌గ‌దు లిక్విడిటీని త‌క్కువ కాలానికే పొందొచ్చు. ఈ కేట‌గిరీ డెట్ ఫండ్ల‌లో 6 శాతం రాబ‌డిని ఆశించ‌వ‌చ్చు.

కార్పొరేట్ ఎఫ్‌డీ

దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థ‌లు డిపాజిట్ల‌ను సేక‌రిస్తున్నాయి. ఈ కార్పొరేట్‌ డిపాజిట్లు 5 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధి వ‌ర‌కు ఉన్న‌ప్ప‌టికీ.. 1 సంవ‌త్స‌రం స్వ‌ల్ప‌కాలానికి కూడా డిపాజిట్లు సేక‌రిస్తాయి. స్వ‌ల్ప‌కాల డిపాజిట్ల‌కు ఇందులో పేరున్న సంస్థ‌లు 5.25% నుంచి వ‌డ్డీ ఇస్తున్నాయి. అయితే ఈ డిపాజిట్ల‌కు బ్యాంకు డిపాజిట్లకు ఉండే బీమా రక్షణ ఉండ‌దు. కాబట్టి ఇందులో డిపాజిట్ చేసేట‌ప్పుడు ఇక్రా, కేర్‌, క్రిసిల్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌ను గ‌మ‌నించాలి. AAA, క్రిసిల్ FAA+, కేర్ AA రేటింగ్ పొందిన ఏదైనా ఆర్థిక సంస్థ ఎఫ్‌డీల‌ను ఎంచుకోవడం మంచిది. 

ఆర్బిట్రేజ్ ఫండ్లు

ఆర్బిట్రేజ్ ఫండ్లు ఈక్విటీల్లో క‌నీసం 65% వాటా క‌లిగి ఉండే హైబ్రిడ్ ప‌థ‌కాలు. ఆర్బిట్రేజ్ ఫండ్ అనేది మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఒక ప్ర‌త్యేక‌మైన ఫండ్‌. ఎక్కువ రిస్క్ తీసుకోకుండానే మ‌దుపర్లు మార్కెట్ ఒడుదొడుకుల్లో కూడా లాభాల‌ను ఆర్జించేందుకు ఈ పండ్ల‌ను ఎంచుకుంటారు. రాబ‌డి ఎంత ఉంటుంది అనేది కచ్చితంగా చెప్ప‌లేం గానీ స్వ‌ల్ప‌కాలానికి బ్యాంకు పొదుపు ఖాతా ద్వారా ల‌భించే వ‌డ్డీ రాబ‌డి క‌న్నా ఎక్కువ ఉంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాల చెబుతున్నాయి. దీనిపై ప‌న్నులు కూడా ఈక్విటీ ఫండ్లలాగే ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని