Salary Hike: జీతం పెరిగిందా? పన్ను ఇలా ఆదా చేసుకోండి మరి!

పెట్టుబ‌డులు పెట్టేవారు.. నిర్ణీత పెట్టుబ‌డిని ఎంచుకునే ముందు ప‌న్ను సామ‌ర్థాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.

Updated : 27 May 2022 16:08 IST

కొవిడ్ స‌మ‌యంలో కొంత మంది ఉద్యోగం కోల్పోతే, మ‌రికొంత మంది వేత‌నంలో కోత‌ల‌ను ఎదుర్కొన్నారు. మ‌రికొన్ని సంస్థ‌లు ఉద్యోగుల‌కు వార్షిక వేత‌న పెంపును నిలిపివేశాయి. ప్ర‌స్తుతం కొవిడ్ ప‌రిస్థితుల నుంచి కోలుకుని సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాం. సంస్థ‌లు కూడా పూర్తి స్థాయిలో ప‌నిచేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వేతనంలో పెరుగుద‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం గ‌రిష్ఠ స్థాయికి చేరుకోవ‌డంతో ఈ సంవ‌త్స‌రం వేత‌న పెంపు చాలా ముఖ్యం కూడా. అయితే, వేత‌న పెంపుతో ప‌న్ను కూడా పెరుగుతుంది. అధిక పన్నుల నుంచి విముక్తి కోసం ప‌న్ను ఆదా ప‌థ‌కాల‌లో ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం మదుపు చేయాలి. 

పెట్టుబ‌డులు..

ప్ర‌తీ సంవ‌త్స‌రం వేత‌న పెరుగుద‌ల స‌మ‌యం ఉద్యోగి జీవితంలో పండుగ లాంటిదని చెప్పొచ్చు. వేతన పెరుగుద‌ల సంద‌ర్భంగా వేడుక చేసుకోవాల‌ని ఖ‌రీదైన వ‌స్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, పెరిగిన జీతంతో విందులు, విలాసాలు కాకుండా పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోని విస్త‌రించేందుకు ప్రాధాన్య‌ం ఇవ్వాలి. స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాల కోసం సంపదను నిర్మించాలని చూస్తున్న వారికి, పెరిగిన జీతాన్ని మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, పీపీఎఫ్‌లు లేదా ఎన్‌పీఎస్ వంటి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం వ‌ల్ల అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు వేత‌న పెంపు స‌హాయ‌ప‌డుతుంది.

రుణాలు..

కొవిడ్ స‌మ‌యంలో జీతం త‌క్కువ ఉండ‌డం, అద‌న‌పు ఖ‌ర్చుల‌తో రుణాలు తీసుకున్న‌వారు వాటిని తిరిగి చెల్లించ‌వ‌చ్చు. ఇవే కాకుండా విద్య‌, గృహ‌, వ్య‌క్తిగ‌త రుణాలకు సంబంధించి ఈఎమ్ఐలు చెల్లిస్తున్న‌వారు ఈ మొత్తాన్ని రుణ చెల్లింపుల‌కు ఉప‌యోగించ‌కోవ‌చ్చు.

ఆదాయ‌పు ప‌న్ను..

వేత‌న పెరుగుద‌లతో వ్య‌క్తిగ‌త ప‌న్ను పెర‌గ‌వ‌చ్చు. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు 20 శాతం శ్లాబులో ఉన్న వారు 30 శాతం శ్లాబులోకి వెళ్లొచ్చు. అందువ‌ల్ల పెట్టుబ‌డుల‌పై మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించాలి. పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక పన్ను సమర్థవంతమైనదిగా ఉండాలి. అప్పుడే ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌రు. నిపుణుల ప్ర‌కారం పోర్ట్‌ఫోలియోలో ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే పెట్టుబ‌డులు 30 శాతానికి మించ‌కుండా చూసుకోవాలి.

ఉదాహ‌ర‌ణ‌కి, మీ ప్ర‌స్తుత జీతం రూ. 9.60 ల‌క్ష‌లు అనుకుందాం. ఈ ఏడాది రూ. 2.40 ల‌క్షలు జీతం పెరిగింది. అయితే దీంతో మీ జీతం రూ.12 లక్ష‌లు అవుతుంది. అంటే మీరు 20 శాతం శ్లాబు నుంచి 30 శాతం శ్లాబులోకి వస్తారు. ఒక‌వేళ మీరు ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు చేయ‌క‌పోతే.. జీతం పెరిగిన త‌ర్వాత, పెర‌గ‌క ముందు ప‌న్ను ఎలా వ‌ర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. 

జీతం పెర‌గ‌క ముందు..
స్టాండర్డ్ డిడ‌క్ష‌న్ తీసివేస్తే రూ. 9,60,000 - రూ. 50,000 = రూ. 9,10,000

రూ. 2,50,000 వ‌ర‌కు ప‌న్ను .. వ‌ర్తించ‌దు.

రూ. 2,50,000 నుంచి రూ. 5,00,000 ... ప‌న్ను 5శాతం ( 5% x (5,00,000-2,50,000)) = రూ. 12,500

రూ. 5,00,000 నుంచి రూ.9,10,000 ... ప‌న్ను 20 శాతం (20% x (9,10,000-5,00,000)) = రూ.82,000

మొత్తం ప‌న్ను రూ.94,500

జీతం పెరిగిన త‌ర్వాత‌..

స్టాండర్డ్ డిడ‌క్ష‌న్ తీసివేస్తే .. రూ.12,00,000 - రూ. 50,000 = రూ. 11,50,000

రూ. 2,50,000 వ‌ర‌కు ప‌న్ను .. వ‌ర్తించ‌దు.

రూ. 2,50,000 నుంచి రూ. 5,00,000 ... ప‌న్ను 5 శాతం ( 5% x (5,00,000-2,50,000)) = రూ. 12,500

రూ. 5,00,000 నుంచి రూ. 10,00,000 ... ప‌న్ను 20 శాతం (20% x (10,00,000-5,00,000)) = రూ.1,00,000

రూ. 10,00,000 నుంచి రూ. 11,50,000 ... ప‌న్ను 30 శాతం (30% x (11,50,000-10,00,000)) = రూ.45,000.

మొత్తం ప‌న్ను = రూ. 12,500 + రూ.1,00,000 + రూ.45,000 = రూ. 1,57,500

పైన తెలిపిన ఉదాహ‌ర‌ణ‌లో జీతం రూ. 2.40 ల‌క్ష‌లు పెరిగి రూ. 12 ల‌క్ష‌లు అయిన‌ప్ప‌టికీ అందులో  రూ. 1,57,500 ప‌న్ను రూపంలో చెల్లిస్తున్నాం. కాబ‌ట్టి త‌గిన ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు ఎంచుకుని ప‌న్ను త‌గ్గించుకోవడం చాలా ముఖ్యం. 

ఒక‌వేళ మీరు ప‌న్ను ఆదా ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టార‌నుకుందాం. అంటే సెక్ష‌న్ 80సీ (ఈపీఎఫ్‌+పీపీఎఫ్‌+ఎన్‌పీఎస్‌+ఎస్ఎస్‌వై మొద‌లైన‌వి) కింద రూ. 1,50,000, సెక్ష‌న్ 80సీసీడి(1బి) (ఎన్‌పీఎస్ అద‌న‌పు పెట్టుబ‌డులు) కింద రూ. 50,000, సెక్ష‌న్ 80డీ (ఆరోగ్య బీమా) కింద రూ. 25,000, మొత్తం రూ. 2,25,000

స్టాండర్డ్ డిడ‌క్ష‌న్ తీసివేస్తే .. రూ. 12,00,000 - రూ. 50,000

రూ. 11,50,000 - రూ.2,25,000( ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు) = రూ. 9,25,000

రూ. 2,50,000 వ‌ర‌కు ప‌న్ను .. వ‌ర్తించ‌దు.

రూ. 2,50,000 నుంచి రూ. 5,00,000 ... ప‌న్ను 5శాతం ( 5% x (5,00,000-2,50,000)) = రూ. 12,500 
రూ. 5,00,000 నుంచి రూ. 9,25,000 ... ప‌న్ను 20 శాతం (20% x (9,25,000-5,00,000)) = రూ.85,000. 
మొత్తం ప‌న్ను = రూ. 12,500 + రూ.85,000 = 97,500.

పైన తెలిపిన ప్ర‌కారం ప‌న్ను ఆదా పథకాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్ల రూ.60,000 వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు గృహ రుణం తీసుకుని ఉంటే వ‌డ్డీ చెల్లింపుల ద్వారా సెక్ష‌న్ 24బీ కింద మ‌రో రూ.2 ల‌క్ష‌ల మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు.. వృథా కాకుండా దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు నెర‌వేర‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త‌తో పాటు స్థిర రాబ‌డి కోరుకునే మ‌దుప‌ర్లు ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌), జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ) వంటి వాటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిది. ఇవి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక రాబ‌డిని ఇస్తాయి. అలాగే ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

ప‌న్ను ఆదా కోసం సెక్ష‌న్ 80సీ ప‌రిమితిని మించిన వారు పెరిగిన వేత‌నాన్ని నేష‌న‌ల్ సేవింగ్స్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌)లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. ఎన్‌పీఎస్ ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ నిధితో పాటు పెన్ష‌న్ కూడా పొంద‌వ‌చ్చు. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా ఈపీఎఫ్ కాంట్రిబ్యూట్‌ చేయాలి. దీంతోపాటు వీపీఎఫ్‌లో కూడా పెట్టుబ‌డులు పెట్టొచ్చు.

చివ‌రిగా..

పెట్టుబ‌డులు పెట్టేవారు.. నిర్ణీత పెట్టుబ‌డిని ఎంచుకునే ముందు ప‌న్ను సామ‌ర్థాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. అలాగ‌ని ప‌న్ను ఆదా కోసం మాత్ర‌మే పెట్టుబడులు చేయ‌డం కూడా మంచిది కాదు. ప్ర‌తీ వ్య‌క్తి వారి వారి ల‌క్ష్యాలు, వాటిని చేరుకునేందుకు ఉన్న స‌మ‌యాన్ని అనుస‌రించి పెట్టుబ‌డుల‌ను ఎంపిక చేసుకోవాలి. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు పెట్టుబ‌డుల‌ను ఎంచుకునే ముందు వాటి లాక్‌-ఇన్ పీరియ‌డ్‌ను చెక్ చేయాలి. ఎందుకంటే ఏ పెట్టుబ‌డిలోనైనా లాక్-ఇన్ పీరియ‌డ్ వ‌ర‌కు పెట్టుబ‌డులు కొన‌సాగిస్తేనే వాటి పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌ం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని