పెట్టుబడులు ఆలస్యం చేయొద్దు..

చిన్నవయసులో ఉన్నప్పుడు ఏదైనా   చేసే శక్తి ఉంటుంది. సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతల బరువు ఉండదు. ఖర్చులూ పరిమితంగానే ఉంటాయి.

Updated : 31 Mar 2023 09:49 IST

చిన్నవయసులో ఉన్నప్పుడు ఏదైనా   చేసే శక్తి ఉంటుంది. సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతల బరువు ఉండదు. ఖర్చులూ పరిమితంగానే ఉంటాయి. ఇలాంటప్పుడే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక ప్రణాళికలను రచించుకునేందుకు  ప్రయత్నించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మీతోపాటు మీ డబ్బూ మీ కోసం కష్టపడుతూ ఉంటుంది. సంపదను సృష్టించేందుకు  వీలవుతుంది. మరి దీనికోసం ఎలాంటి వ్యూహాలు పాటించాలో చూద్దామా..

యువకులు అధికంగా ఉన్న దేశం మనది. 35 ఏళ్లలోపు వారు 65 శాతం వరకూ ఉన్నారు. కానీ, ఆర్థిక ప్రణాళికల విషయానికి వస్తే వీరిలో చాలామంది అంతగా పట్టించుకోవడం లేదని నివేదికలు చెబుతున్నాయి. మంచి అలవాట్లను సాధ్యమైనంత తొందరగా నేర్చుకోవాలి. ఇందులో డబ్బు నిర్వహణా ఒకటి అని గుర్తించాలి. చదువుకునేటప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడతాం. కానీ, ఒక్కసారి ఆర్జన మొదలు పెట్టాక.. సంపాదించిన ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేసేందుకు ప్రయత్నించాలి.

50:50 సూత్రంతో...

తొలి జీతం బ్యాంకులో జమ కాగానే ఎంతో ఆనందంగా ఉంటుంది. చాలామంది దీన్ని ఖర్చు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, మొదటి జీతం వచ్చిన నాటి నుంచే 50:50 సూత్రాన్ని ఆచరించడం మంచి మార్గం. మీ ఆదాయంలో 50 శాతం పొదుపు కోసం కేటాయించండి. మిగిలిన 50 శాతం ఖర్చు చేయండి. దీని వల్ల మీరు భవిష్యత్తులో కావాల్సిన విధంగా జీవించేందుకు తోడ్పాటు లభిస్తుంది. మీరు దాచిన సగం జీతాన్ని ముందుగా ఎలాంటి నష్టభయం లేని పథకాల్లో మదుపు చేయండి. దీనివల్ల ప్రాథమికంగా మీ దగ్గర కొంత డబ్బు జమ అవుతుంది. ఒక్కసారి మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యం గురించి అవగాహన వచ్చిన తర్వాత అధిక రాబడి వచ్చే పథకాలను పరిశీలించవచ్చు.  

లక్ష్యం ఆధారంగా...

మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణను సాధించడంలో ఇదే ముఖ్యమైన దశ. ఒక పెట్టుబడిని నిర్ణీత లక్ష్యంతో అనుసంధానం చేసినప్పుడే దీర్ఘకాలం కొనసాగించగలం. లేకపోతే.. ఏదో పెట్టుబడి పెట్టాలి కదా అని ప్రారంభించడం, మధ్యలోనే నిలిపివేయడం అలవాటు అవుతుంది. అందుకే స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించండి. వాటిని సాధించేందుకు తగిన పెట్టుబడి మార్గాలను ఎంచుకొని, మదుపు ప్రారంభించండి.
అవసరమైన వెంటనే నగదుగా మార్చుకునే పథకాలను ఎంచుకునేందుకు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. స్వల్పకాలిక లక్ష్యాలకు ఇవి సరైనవే. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి ఏ మాత్రం సరిపోవనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి, లాకిన్‌ ఉన్న లేదా దీర్ఘకాలం కొనసాగే వాటినే ఎంచుకోవాలి.  

రక్షణ మర్చిపోవద్దు..

చిన్న వయసులో ఉండి, ఇప్పుడిప్పుడే సంపాదన ప్రారంభించిన వారికి పరిమిత ఆర్థిక వనరులు ఉంటాయి. ముఖ్యమైన కుటుంబ బాధ్యతలు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మీరే కుటుంబానికి ఆధారం కావచ్చు. పదవీ విరమణ చేసిన తల్లిదండ్రులు, తోబుట్టువులు మీపై ఆధారపడి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు బీమా పాలసీని తీసుకోవాలి. కుటుంబానికి ఇది ఒక రక్షణ కవచం అని మర్చిపోవద్దు. చిన్న వయసులోనే బీమా పాలసీని తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అధిక విలువైన పాలసీని ఎంచుకోవచ్చు.  

దీర్ఘకాలిక దృష్టితో..

ఆర్థిక ప్రణాళిక ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. అందుబాటులో ఉన్న వనరులను ఎంత సమర్థంగా వాడుకుంటున్నారన్నది ఇది నిర్ణయిస్తుంది. మీ వివాహం, పిల్లలు, వారి చదువులు, వారి ఇతర అవసరాలు, మీ పదవీ విరమణ ఇలా దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. 30-40 ఏళ్లు సంపాదించడం, అందులో నుంచి కొంత దాచడం ఇదంతా ఒక లెక్క ప్రకారం జరగాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని, ముందుకు సాగాలి.

వైవిధ్యంగా...

పెట్టుబడుల కోసం ఎంచుకునే పథకాలు వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొత్తం సురక్షితంగా ఉండే పథకాలు లేదా నష్టభయం అధికంగా ఉండేవాటినే ఎంచుకుంటే పోర్ట్‌ఫోలియో సమతుల్యత దెబ్బతింటుంది. వైవిధ్యంగా ఉన్నప్పుడు పెట్టుబడిని నష్టపోయే ఆస్కారం తక్కువగా ఉంటుంది.

మారుతున్న ఆర్థిక పరిస్థితులు, బాధ్యతలు ఇతర అంశాల ఆధారంగా మీ ఆర్థిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. మార్కెట్‌ పనితీరు ఆధారంగా మీ పెట్టుబడులను సమీక్షించుకోవాలి. క్రమం తప్పకుండా పోర్ట్‌ఫోలియోను సరిచేసుకుంటూ ఉండాలి. కొత్తగా ఉద్యోగాన్ని ప్రారంభించిన దగ్గర్నుంచి, పదవీ విరమణ చేసేదాకా ప్రతి దశలోనూ అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆర్థికంగా ఇబ్బందుల్లేని జీవితం సాధ్యమవుతుంది.
 అనూప్‌ సేథ్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌,ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు