Gautham Adani: పర్యావరణ హిత ఇంధన రంగంలో రూ.8.3 లక్షల కోట్ల పెట్టుబడులు

పర్యావరణ హిత ఇంధన రంగంలోకి మార్పు చెందే ప్రాజెక్టులపై 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,30,000 కోట్ల)కు పైగా పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు.పర్యావరణ హిత ఇంధన రంగంలోకి మార్పు చెందే ప్రాజెక్టులపై 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,30,000 కోట్ల)కు పైగా పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు.

Published : 20 Jun 2024 02:56 IST

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ

దిల్లీ: పర్యావరణ హిత ఇంధన రంగంలోకి మార్పు చెందే ప్రాజెక్టులపై 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,30,000 కోట్ల)కు పైగా పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ - ది క్యాటలిస్ట్‌ ఫర్‌ ఇండియాస్‌ ఫ్యూచర్‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమైన ప్రతి పరికరాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోనున్నట్లు అదానీ తెలిపారు. ఇప్పటికే తమ గ్రూప్‌ భారీ ఎత్తున సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తు చేశారు. ఎలక్ట్రోలైజర్లు, గాలిమరలకు సంబంధించిన టర్బైన్లు, సోలార్‌ ప్యానెల్స్‌ తయారీపైనా సంస్థ దృష్టి సారించింది. కచ్‌లోని ఖావ్‌డాలో అతి పెద్ద పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టు చేపట్టామని అదానీ వివరించారు. ఇక్కడ 30 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని, 2030 నాటికి 50 గిగావాట్లకు దీన్ని పెంచుతామన్నారు. పర్యావరణ హిత ఇంధన రంగంలోకి మార్పు చెందే మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.249 లక్షల కోట్లు) ఉంటుందని అదానీ అంచనా వేశారు. 2030 నాటికి ఇది 6 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.498 లక్షల కోట్ల)కు చేరుతుందని తెలిపారు. 2050 వరకు చూస్తే, ప్రతి పదేళ్లకు ఈ మొత్తం రెట్టింపు అవుతుందనే అంచనాలను వివరించారు.

డేటా కేంద్రాలపై అదానీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇవి ఎంతో కీలకమవుతాయన్నారు. మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, డీప్‌ లెర్నింగ్‌కు డేటా కేంద్రాలే ఆధారమన్నారు. 2030 నాటికి ఏఐ డేటా కేంద్రాల కోసమే 100-150 గిగావాట్ల అదనపు హరిత ఇంధనం ప్రపంచానికి అవసరమవుతుందని అదానీ తెలిపారు. భారత్‌ ఇప్పటికే డేటా కేంద్రాల ఆర్డర్‌ బుక్‌ భారీగా ఉందని, అదనపు గిగావాట్‌-స్కేల్‌ గ్రీన్‌ ఏఐ డేటా కేంద్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

లక్షల ఉద్యోగాలకు వీలు: ‘దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యం ఉంది. దీనికోసం వార్షికంగా 150 బి.డాలర్ల (సుమారు రూ.12.45 లక్షల కోట్ల) పెట్టుబడులు అవసరమవుతాయి. దేశంలో హరిత ఇంధనానికి మార్పు చెందడం వల్ల సౌర, పవన, ఇంధన నిల్వ, హైడ్రోజన్, దాని డెరివేటివ్స్, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, గ్రిడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి వంటి రంగాల్లో లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయ’ని అదానీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని